ఈ నెలాఖరు వరకు ఏపీ లాక్‌డౌన్‌ : సీఎం జగన్‌ | CM YS Jagan Announce Andhra Pradesh Lock Down Till 31st March | Sakshi
Sakshi News home page

ఈ నెలాఖరు వరకు ఏపీ లాక్‌డౌన్‌ : సీఎం జగన్‌

Published Sun, Mar 22 2020 7:41 PM | Last Updated on Sun, Mar 22 2020 8:55 PM

CM YS Jagan Announce Andhra Pradesh  Lock Down Till 31st March - Sakshi

సాక్షి, అమరావతి :  కరోనా వైరస్ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు. గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు.
(చదవండి : చప్పట్లతో తెలుగు రాష్ట్రాల సీఎంల సంఘీభావం)

పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తూ, ప్రతి ఇంటికి రూ.1000 ఆర్థికసాయం అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మార్చి 29 వ తేది నాటికి పూర్తిగా రేషన్‌ అందుబాటులోకి ఉంటుందని, రేషన్‌ ఫ్రీగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పును ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా 14 రోజులు ఇళ్లలోనే ఉండాలన్నారు. అందరూ 14 రోజుల పాటు ఇళ్లలోంచి కదలొద్దని కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఎమన్నారో ఆయన మాటల్లోనే..

104కు కాల్‌ చేయండి
కరానాను ఎదుర్కొవడంలో మిగిలిన రాష్ట్రాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో 6 కేసులు మాత్రమే నమోదు కాగా, అందులో ఒక కేసు నయమయ్యింది. రాష్ట్రంలో 2.50లక్షలకు పైగా ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు. అందువల్లే పరిస్థితి చాలా వరకు అదుపులో ఉంది. ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉంటే 104 నంబర్‌కు ఫోన్ చేయండి.

31వ తేదీ వరకు సకలం బంద్‌ చేద్దాం
కరోనాను కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్‌ సంస్థలకు హాలీడేస్‌ ఇచ్చాం. 31వ తేదీ వరకు సెలవులు ఇచ్చాం. పదో తరగతి పరీక్షలు యధాతథంగా జరుగుతాయి.ఇవన్నీ జరుగుతుండగానే దేశం మొత్తం మీదా దీన్ని శాశ్వతంగా అరికట్టాలనే దానిపై చర్చ జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో కూడా అవగాహన పెరగాలి. ఇంకొకరికి వ్యాధి సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతిఒక్కరూ నిర్ధిష్టమైన ప్రాంతంలో ఉండగలిగితే వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చు. మనం కూడా 31వ తేదీ వరకు సకలం బంద్‌ చేద్దాం. ఇందులో భాగంగానే మనం కూడా రవాణా వ్యవస్థను కట్టడి చేస్తాం. అందరూ కూడా సహకరించుకోవాలి.  ఆటోలు, ట్యాక్సీలు కూడా తప్పనిసరి అయితేనే ఉపయోగించుకోవాలి. ఇద్దరి కంటే కూడా ఎక్కువగా ఎక్కించుకోవద్దని సూచిస్తున్నాం. గోల్డ్‌ షాపులు, బట్టల షాపులు అన్నీ కూడా మార్చి 31 వరకు మూత వేయాలి. ఫ్యాక్టరీలు, గోడౌన్లు కూడా అవసరమైతేనే నడపండి. ప్రభుత్వం కూడా రోటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులను వాడుకుంటాం.
(చదవండి : కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)

అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి
విదేశాల నుంచి వచ్చిన వారందరినీ కూడా అభ్యర్థిస్తున్నా..హోం క్వారైంటన్‌లోకి 14 రోజుల పాటు వెళ్లాలి. బయటకు రావద్దు. ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాలు సరిహద్దులు మూసివేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు కూడా ప్రజలు బంద్‌ పాటించాల్సిన అవసరం ఉంది. ఇళ్ల వద్దే ఉండాలని కోరుతున్నాం. మరీ అవసరమైతేనే బయటకు రండి. వచ్చినప్పుడు కూడా రెండు మీటర్ల దూరాన్ని పాటించాలి. ఒకరికి ఒకరం అర్థం చేసుకోవాలి. అందరూ సహకరించాలని కోరుతున్నా.పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు కట్టడి కావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. పోలీసులు కూడా చెబుతున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారికి కట్టడి చేయమని కోరుతున్నాం. కలెక్టర్లు అందరూ కూడా ధరలు పెరగకుండా చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార దృక్ఫథంలో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. అధిక రేట్లకు ఎవరైనా సరుకులు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలి. టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఇస్తారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి.  

అవ్వాతాతలు ఇంటి నుంచి బయటకు రావొద్దు
 బడ్జెట్‌ పెట్టకపోతే దేనికి కూడా డబ్బులు ఇవ్వలేం కాబట్టి. వీలైనంత తక్కువ రోజుల్లో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తాం. పొలం పనులకు వెళ్లే రైతు కూలీలు కూడా వీలైతే ఇళ్ల వద్దే ఉండండి. తప్పని సరి అయితే రెండు మీటర్ల దూరం పాటించాలి. నీళ్లు, కూరగాయాలు, పాలు, ఎలక్ర్టసిటీ, టెలికాం, మందుల షాపులు, పెట్రోలు బంక్‌లు అందుబాటులో ఉంటాయి. అందరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. వయసు ఎక్కువగా ఉన్న వారిపై కరోనా ప్రభావం ఉంటుంది. షుగర్‌, బీపీ, కిడ్ని వ్యాధిగ్రస్తులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలో ఉండి నయం అయ్యేవారు 80 శాతం ఉన్నారు.13.8 శాతం మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో కూడా 4.5 శాతం మాత్రమే ఐసీయూలోకి వెళ్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఏ స్టేజీలోకి వెళ్తుందనే భయం ఉంది. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను కాపాడుకోవాలంటే ఇవన్నీ కూడా చేయాలి. పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వయసు పెద్దగా ఉన్న అవ్వాతాతలను ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచిస్తున్నాం. పదేళ్లలోపు వయసు ఉన్న పిల్లలను కూడా బయటకు పంపించవద్దు. అందరూ కూడా ఈ నెల 31వ తేదీ వరకు ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కచ్చితంగా హోం ఐసోలేషన్‌లో ఉండాలి. వారు పొరపాట్లు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సౌత్‌ కొరియాలో ఒక్కరికి వచ్చింది. ఆ తరువాత దేశమంతా వ్యాపించింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు కొంచెం కష్టమనిపించినా, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నా కూడా 104కు ఫోన్‌ చేయండి. 

ప్రతి కుటుంబానికి రూ.1000 అందిస్తాం
‘సకలం బంద్‌తో పేదవాళ్లు ఇబ్బందులు పడుతారని ఆలోచన వచ్చింది. కానీ చేయకతప్పదు. వాళ్లందరికీ కూడా ఎక్కువగా చేయలేకపోయినా, వారినష్టాల్లో భాగస్వామ్యం అవుతాం. పేదలందరికీ 29వ తేదీలోగా రేషన్‌ అందుబాటులో ఉంచుతాం. ఉచితంగా రేషన్‌ ఇస్తున్నాం. కంది పప్పు కూడా ఇస్తాం. ప్రతి కుటుంబానికి వెయ్యి చొప్పున ఏప్రిల్‌ 4వ తేదీన ప్రతి ఇంటికి వచ్చి గ్రామ వాలంటీర్‌ ఇస్తారు. ఈ మాత్రం చేయడానికే దాదాపు 1,500 కోట్లు ఖర్చు అవుతుంది. పరిస్థితులను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. అందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దాం. దేశం మొత్తం ఒకే రకమైన అడుగులు వేస్తోంది. అవే అడుగులు మనం కూడావేయగలిగితేనే ఈ వైరస్‌ను కట్టడి చేయగలం. అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement