రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో విందులో పాల్గొన్న సీఎం, ఉన్నతాధికారులు
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ హరిచందన్ విశ్వ భూషణ్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఎట్‌హోం’ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో 3.15 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఎట్‌హోం గంట సేపు సాగింది. గవర్నర్ హరిచందన్ లాన్స్‌లో కలియ దిరుగుతూ అందరినీ పరిచయం చేసుకున్నారు. ఆ తరువాత గవర్నర్ దంపతులు, సీఎం వైఎస్ జగన్, ఏసీజే జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒకే టేబుల్‌పై ఆశీనులై అల్పాహార విందును తీసుకున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్, టీడీపీ నేతలు కళా వెంకటరావు, కనకమేడల రవీంద్రబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, ఆర్పీఐ (ఎ) రాష్ట్ర అధ్యక్షుడు కె.బ్రహ్మానందరెడ్డి, పొగాకు బోర్డు చైర్మెన్ రఘునాథబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాయంత్రం సంప్రదాయకంగా జరిగే ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్‌తో న్యాయమూర్తులు
Comments
Please login to add a commentAdd a comment