సాక్షి, అమరావతి : టీడీపీ నేతలు అసెంబ్లీలో కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మద్యం పాలసీపై అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలన్నీ తప్పని అన్నారు. ఆయన చెప్పిన లెక్కలు తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా? అని సీఎం జగన్ సవాల్ విసిరారు. టీడీపీ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అచ్చెన్నాయుడుపై సభాహక్కుల నోటీసును ఇస్తామన్నారు.
(చదవండి : ఇంత దారుణమా చంద్రబాబూ..!)
మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. దశల వారిగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 43వేల బెల్ట్ షాపులలతో పాటు పర్మిట్ రూమ్‌లను కూడా ఎత్తివేశామన్నారు. చంద్రబాబు హయంలో 4,380 మద్యం షాపులు ఉంటే.. తమ ప్రభుత్వం వాటిని 3,456కు తగ్గించిందన్నారు. ఇప్పటి వరకు 20శాతానికి పైగా మద్యం షాపులు తగ్గించామని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 34.84శాతం బీర్‌ల అమ్మకాలు తగ్గాయని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టి మరీ మద్యం విక్రయాలు జరిపిందని దుయ్యబట్టారు. ఒక్క గ్రామంలో 10 బెల్ట్ షాపులు నడిచాయని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో మద్యం షాపుల పక్కనే పర్మిట్ రూమ్‌లు పెట్టారన్నారు. దీంతో మహిళలు ఆ దారిగుండా వెళ్లాలంటేనే భయపడేవారని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. మద్యం అమ్మకాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుపుతున్నామని చెప్పారు. మద్యం అక్రమ రవాణా చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులు పెడుతామని హెచ్చరించారు. బార్ యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment