దోచుకో.. పంచుకో.. తినుకో.. అనేది వీళ్ల విధానం
కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్ కన్నెర్ర
పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అసమర్ధ సర్కారిది
రాష్ట్రంలో ఐదు నెలలుగా డీబీటీ మచ్చుకైనా లేదు
ఏ నియోజకవర్గంలో చూసినా.. ఇసుక, మద్యం నుంచి పేకాట క్లబ్‌ల వరకు మాఫియా రాజ్యమేలుతోంది
ఓ పరిశ్రమ పెట్టాలన్నా.. నిర్వహించాలన్నా కప్పం కట్టాల్సిందే.. ఎవరు ఏం చేయాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిందే
అందులో ఎమ్మెల్యే, సీఎం పంచుకుంటున్నారు
ఎన్నికల హామీల అమలుపై ఎవరూ ప్రశ్నించకుండా, తమ అవినీతిపై నిలదీసే స్వరం ఉండకూడదనే ఎత్తుగడ
తప్పుడు కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.. ఎన్నికలప్పుడు నాసిరకం లిక్కర్.. ధరలుఎక్కువఅంటూ బాబు దుష్ప్రచారం.. నేడు పేదల జేబుల లూటీ
గతంలో రూ.120కి లభ్యమైన క్వార్టర్ మద్యం నేడు రూ.130కి అమ్ముతున్నారు
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్‌ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలోదోచుకో పంచుకో తినుకో విధానంలో రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోంది. – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఎక్కడా మచ్చుకైనా డీబీటీ కానరావడం లేదని... కన్పిస్తుందల్లా డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో) ఒక్కటేనని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఏకంగా ఇన్ని నెలలపాటు ఓట్ ఆన్ అకౌంట్‌పై నడుస్తున్న ప్రభుత్వం బహుశా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ మరెక్కడా ఉండదన్నారు. ఎన్నికలప్పుడు నాసిరకం లిక్కర్.. ధరలు ఎక్కువ అంటూ దుష్ప్రచారం సాగించిన చంద్రబాబు ఇప్పుడు ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు తెర లేపారని చెప్పారు. అప్పుడైనా.. ఇప్పుడైనా అవే డిస్టిలరీస్, లిక్కర్‌లో అవే స్పెసిఫికేషన్స్ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే 14 కంపెనీలకు చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చారని, తాము అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్‌ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందేనన్నారు.
ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలో దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో మాఫియా పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎన్నికల హామీల అమలు.. ప్రభుత్వ అవినీతిపై ఎవరూ నిలదీయకుండా.. ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే లక్ష్యంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన కేసే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
» చంద్రబాబు మోడస్ ఆపరండా (ఓ పద్ధతి ప్రకారం అనుసరించే వ్యూహం) గమనిస్తే ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు. ప్రజల ఆశలతో చెలగాటాలాడుతూ అబద్ధాలు చెబుతారు. వాళ్లకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా సామ్రాజ్యంతో కలిసి గోబెల్స్ ప్రచారం చేస్తారు.
» ఆయన ఏ స్థాయిలో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారంటే.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తారు. వలంటీర్లకు రూ.10 వేలు జీతం అని మోసగించడంతో అది మొదలవుతుంది. మీకు రూ.పది వేలు రావాలంటే మా ప్రభుత్వం రావాలి.. మా ప్రభుత్వం రావాలంటే మేం చెప్పిన అబద్ధపు హామీలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి అని వలంటీర్లకు చెబుతారు.
» ఏ ఇంటికి వెళ్లినా సరే చిన్నపిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు! సంతోషమా..? అని అడుగుతారు. వాళ్ల అమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు.. సంతోషమా? అంటారు. చిన్నమ్మలు తారసపడితే నీకు రూ.18 వేలు.. పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు... ఉద్యోగం కోసం వెతుక్కుంటూ 20 ఏళ్ల పిల్లాడు బయటకొస్తే నీకు రూ.36 వేలు... కండువా వేసుకొని రైతు బయటకొస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అని అడుగుతారు. ఎవరినైనా సరే ఇదే మాదిరిగా మాటలు చెప్పి, ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడమే మోడస్ ఆపరండాగా మార్చుకున్నారు.
» తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం క్లిçష్ట పరిస్థితుల్లో ఉంది. చేయాలన్నా నేను చేయలేకపోతున్నా..! అంటూ కొత్త మోడస్ ఆపరండా తెరపైకి తెస్తారు. అంతటితో ఆగిపోతుందా.. అంటే ఆగిపోదు. ఎన్నికల హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తారేమో? ఎవరైనా నిలదీస్తారేమో? అనే భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయాలని ఆరాట పడుతున్నారు.
వీటికి తోడు మార్పులు తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో స్కామ్‌లకు తెర తీస్తున్నారు. వీళ్ల మోడస్ ఆపరండా ఏమిటో ఈ ఐదు నెలలుగా సాగుతున్న ఇసుక, మద్యం మాఫియా పాలనే నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment