1918లో వచ్చిన ఫ్లూ భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. రెండేళ్లకు పైగా అది దేశంపై ప్రభావం చూపింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మనం దీర్ఘకాలం పోరాటం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడిచే విధంగా చూడాలి.
లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బ తిన్నారు. కోవిడ్–19 నివారణకు ప్రధాన మంత్రిగా మీరు తీసుకున్న విశాలమైన,గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను.
రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. ఇందులో కరోనా వైరస్ సోకిన రెడ్‌జోన్లలో 37 మండలాలు, ఆరెంజ్ జోన్లలో 44 మండలాలు (మొత్తం 81) ఉన్నాయి. గ్రీన్ జోన్‌లో ఉన్న మిగతా 595 మండలాలపై ప్రస్తుతానికి కరోనా ప్రభావం లేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను రెడ్, ఆరెంజ్ జోన్లకే పరిమితం చేస్తే బావుంటుంది.
జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజా రవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలి. ఇవి కాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలి. ఈ యుద్ధంలో ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలి.
– సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వ్యాప్తి నివారణకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని, లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వివరించారు. వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 81 రెడ్, ఆరెంజ్ జోన్ల మండలాలకు లాక్‌డౌన్‌ను పరిమితం చేస్తూ మిగతా 595 (కరోనా కేసుల్లేని) గ్రీన్ జోన్ మండలాల్లో ఆంక్షలతో లాక్‌డౌన్ సడలించాలనేది తన అభిప్రాయమని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ప్రధాన మంత్రిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్ కొనసాగించాలా.. లేదా.. కొనసాగిస్తే ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే అంశాలపై శనివారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్–19 నివారణకు తీసుకున్న చర్యలను, కోవిడ్ ఆసుపత్రుల సన్నద్ధత, లాక్‌డౌన్ కారణంగా నెలకొన్న సమస్యలను ప్రధానికి వివరించారు.
మంత్రులు, అధికారులతో కలసి ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఇదీ మా పని తీరు
► రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నాం.
► రాష్ట్ర వ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్యం అందిస్తున్నాం.
► ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వలంటీర్లు, 40 వేల మంది ఆశా వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తున్నాం. వారికి దాదాపు 3 వేల మంది వైద్యుల ద్వారా సేవలు అందిస్తున్నాం.
► కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ వ్యూహం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం.
► ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం. క్రిటికల్ కేర్ కోసం నాలుగు అత్యాధునిక ఆసుపత్రులు, 13 జిల్లాల్లోనూ ఒక్కో కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటున్నాం.
► సమర్థవంతంగా క్వారంటైన్ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాం. ఇందులో 26 వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి.
వ్యవసాయం పరిస్థితి ఇదీ..
► మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక. జీఎస్‌డీపీలో 35 శాతం, ఉపాధి కల్పనలో 62 శాతం వాటా వ్యవసాయానిదే. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది. నిలిపివేస్తారనే భయంతో 25 శాతం మించి ట్రక్కులు తిరగడం లేదు.
► రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వ చేయడానికి సరిపడా గోదాములు లేవు. మార్కెట్లు నడవక పోవడంతో ధాన్యం, మొక్క జొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ స్థానికంగా వీటిని ఎంత వరకు వినియోగించగలం?
► ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. నిల్వ చేయడానికి తగిన స్టోరేజీ సదుపాయం లేక, ఎగుమతులు లేక ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది.
పడకేసిన పారిశ్రామిక రంగం
► రాష్ట్రంలోని పారిశ్రా>మిక రంగం విషయానికొస్తే 1,03,986 యూనిట్లకు గాను 7,250 మాత్రమే నడుస్తున్నాయి. పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రోడ్డు, రైల్వే రవాణా నిలిచి పోవడం సంక్షోభం పెరగడానికి కారణమైంది.
► పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం? రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి. సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తింది.
► కరోనా వైరస్ మరింతగా వ్యాపించకుండా దేవుడి దయ వల్ల అడ్డుకోగలుగుతున్నాం. మన కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నాం.
► నా అభిప్రాయంతో పాటు, మా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై మీకు సంక్షిప్తంగా నివేదించా. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలి. మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుతాం.
► వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment