సాక్షి, అమరావతి: నిత్యావసరాల వస్తువలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రకటించిన ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపుతామన్నారు. కరోనావైరస్ నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, ఎస్పీలతో సోమవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యన్నారాయణ, చీఫ్ సెక్రటరీ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే 15 రోజులకు నిత్యావసరాల వస్తువుల ధరలను ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ప్రకటించిన ధరకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్ మార్కెట్లలో కూడా ఇవే ధరలకు విక్రయించాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్దా డిస్‌ప్లే బోర్టులు ఉండాలని, దాంట్లో ఫిర్యాదు చేయాల్సిన కాల్ సెంటర్ నంబర్ కూడా ఉంచాలని సూచించారు. ప్రతి మున్సిపల్ కమిషనర్ దీన్ని కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలన్నారు. అలాగే లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పతుల తరలింపు మీద, గూడ్స్‌మీద ఆంక్షలు పెట్టకూడదని, సరుకుల రవాణాను అడ్డుకోవద్దని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే...
లాక్‌డౌన్‌ను పూర్తిగా సద్వినియోగంచేసుకోవాలి
కరోనాకు సంబంధించి మనం ఇప్పటివరకూ గట్టి చర్యలే తీసుకున్నాం. యంత్రాంగమంతా సమిష్టిగా పనిచేస్తున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు సిబ్బంది పనితీరు బాగుంది. లాక్‌డౌన్‌ను పూర్తిగా సద్వినియోగంచేసుకోవాలి. తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోకపోతే లాక్‌డౌన్ ఉద్దేశం నెరవేరరు. పట్టణాల్లో ఉన్న వారి మీద కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండడం, విదేశాలనుంచి ఎక్కువమంది వచ్చిన వారు పట్టణ ప్రాంతాల్లో ఉండడం దీనికి కారణం. పట్టణ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. కలెక్టర్లతోపాటు మున్సిపల్ కమీషనర్లు ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది.
ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలి
రెండు రకాల బృందాలతో కోవిడ్–19 నివారణా చర్యలను పటిష్టంగా చేపట్టాలి. మొదటి దశ టీంలో వార్డు వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల ప్రైమరీ రీసోర్స్ పర్సన్లు, వార్డు సచివాలయంలో ఉండే హెల్త్ సెక్రటరీ, అదనపు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఉంటారు. విదేశాలనుంచి వచ్చిన వారు ఉన్నా, లేకున్నా.. ప్రతి ఇంటిమీదా వీరు దృష్టి పెట్టాలి. ప్రతి ఇంటినీ సర్వే చేసి వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలి. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలి. ఇక రెండో స్థాయిలో ప్రతి వార్డుకూ ఒక వైద్యుడ్ని ఏర్పాటు చేయాలి. మున్సిపాల్టీల్లో ప్రతి మూడు వార్డులకు ఒక డాక్టర్‌ను ఉంచాలి. మొదటి స్థాయి టీం నుంచి వచ్చే డేటాను ప్రతిరోజూ మానిటర్ చేసి ఆమేరకు చర్యలు తీసుకోవాలి. మొదటిరోజు ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు వైరస్ లక్షణాలు కనిపించకపోవచ్చు, ఆతర్వాత కనిపించ వచ్చు. అందకనే ప్రతి రోజు కూడా ప్రతి ఇంటిని సరవ్వే చేయాలి. ఇంట్లోనే వైద్యం తీసుకుంటూ కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు.కాకపోతే ముందుగానే గుర్తించడం వల్ల బాగా మేలు జరుగుతుంది. వయస్సు ఎక్కువగా ఉన్నవారు, బీపీ, సుగర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నవారిమీద ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకనే ప్రైమరీ లెవల్ టీమ్స్, సెకండర్ లెవల్ టీమ్స్ బాగా పనిచేయాల్సి ఉంది.ఈ టీమ్స్ బాగా పనిచేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల మీద ఉంది.
ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచుతున్నాం
కోవిడ్-19 క్రిటికల్ కేసుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి. వీటితోపాటు ఆస్పత్రుల పర్యవేక్షణకూడా చాలా కీలకం. వైరస్ సోకిన వారిలో దాదాపుగా 5శాతం కేసులు సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. విశాఖలో విమ్స్, కృష్ణాజిల్లాలో సిదార్థహాస్పటిల్, నెల్లూరులో జీజీహెచ్, తిరుపతిలో పద్మావతి ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్‌కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జిల్లాలకు చెందిన కలెక్టర్లు వీటిపై ఎక్కువ దృష్టిపెట్టమని కోరుతున్నా. ఇవి పూర్తిగా కోవిడ్ వైరస్ సోకడం వల్ల క్రిటికల్ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి కేటాయిస్తున్నాం.ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ఆస్పత్రుల్లో 1370 బెడ్ల సంఖ్యను 1680కు పెంచుతున్నాం.అలాగే వెంటిలేటర్లతో కూడి బెడ్ల సంఖ్యను 148 నుంచి 444కు పెంచుతున్నాం
కోవిడ్–19 కేసుల కోసం జిల్లాల్లో ప్రత్యేక ఆస్పత్రులు
కరోనా సోకిన దాదాపు 15శాతం కేసులు ఆస్పత్రిల్లో చేర్పించాల్సి ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికోసం జిల్లాల వారీగాకూడా ఆస్పత్రులను, అందులో సౌకర్యాలను పెంచుతున్నాం. విజయనగరంలో మిమ్స్ ఆస్పత్రిలో నాన్ ఐసీయూ బెడ్స్ 780 నుంచి 900 కు, ఐసీయూ బెడ్స్‌ను 25 నుంచి 50 కి పెంచుతున్నాం. విశాఖపట్నంలోని గీతం ఆస్పత్రిలో ప్రస్తుతం నాన్ ఐసీయూ బెడ్స్ 400 బెడ్లను 600కు, ఐసీయూ బెడ్స్‌ను 14 నుంచి 25కు పెంచుతున్నారు.ఈస్ట్ గోదావరిలో కిమ్స్ ఆస్పత్రిలో నాన్ ఐసీయూ బెడ్స్ 730 నుంచి 800కు, ఐసీయూ 52 నుంచి 70కి పెంచుతున్నాం. ప.గో.లో ఆశ్రమం ఆస్పత్రిలో నాన్‌ఐసీయూ బెడ్స్ 400 నుంచి 500కు, ఐసీయూ బెడ్స్‌ను 13 నుంచి 50 కి పెంచుతున్నాం. విజయవాడలో పిన్నమనేని ఆస్పత్రిలో 600 నుంచి 800కు, ఐసీయూ బెడ్స్ 12 నుంచి 25 పెంచుతున్నాం.గుంటూరు ఎన్నారై ఆస్పత్రిలో నాన్ ఐసీయూ బెడ్స్ 400 నుంచి 500కు, ఐసీయూ బెడ్స్ 50 నుంచి 60కి పెంపు.ప్రకాశం జిల్లాలోని కిమ్స్ ఆస్పత్రిలో 150 నుంచి 200కు, ఐసీయూ బెడ్స్‌ను 70 నుంచి 80కి పెంచుతున్నాం. నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో నాన్ ఐసీయూ 200 నుంచి 250, ఐసీయూను 10 ని 20కి పెంచుతున్నాం.
చిత్తూరులోని అపోలో అస్పత్రిలో ప్రస్తుతం 800 నాన్‌ఐసీయూ బెడ్స్ ఉండగా, ఐసీయూ బెడ్స్ 15 ను 25కి పెంచుతున్నాం.కడపలోని ఫాతిమా ఆస్పత్రిలో నాన్ ఐసీయూ బెడ్స్ 700 నుంచి 800కి, ఐసీయూ ఐసీయూను 4నుంచి 10కి పెంచుతున్నాం. కర్నూలు జిల్లాలో శాంతిరాం ఆస్పత్రిని నాన్ ఐసీయూ బెడ్లు 700 నుంచి 800కు, ఐసీయూ బెడ్లు 36 నుంచి 50కి పెంచుతున్నాం. అనంతపురంలో సవేరా ఆస్పత్రిలో నాన్ ఐసీయూ బెడ్లు 200 నుంచి 300కి, ఐసీయూను 19 నుంచి 25కి పెంచుతున్నాం.శ్రీకాకుళంలో జెమ్స్‌లో నాన్ ఐసీయూ బెడ్లు 702 నుంచి 800కు, ఐసీయూ బెడ్లను 16 నుంచి 25కు పెంచుతున్నాం, ఐసీయూ బెడ్లు 15 నుంచి 20కి పెంచుతున్నాం.మొత్తమ్మీద ఈ ఆస్పత్రుల్లో 6762 బెడ్ల సామర్థ్యాన్ని 8050కి నాన్ ఐసీయూ బెడ్లను పెంచుతున్నాం. అలాగే ఐసీయూ బెడ్లను 336 నుంచి 515కు పెంచుతున్నాం. ఇవి పూర్తిగా కోవిడ్ –19 సోకిన వారికి ఆయా జిల్లాల్లో సేవలు అందిస్తాయి.కలెక్టర్లు జిల్లాల్లో ఉన్న కోవిడ్ లెవల్ ఆస్పత్రులను స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఒక్కో ఆస్పత్రికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించాల్సి ఉంటుంది.పాజిటివ్ కేసు నమోదైతే.. వెంటనే ఈ ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది.
క్వారంటైన్ కోసం ప్రతి జిల్లాలో 5వేల బెడ్లు
ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ సదుపాయాలను కూడా కల్పించాం. ప్రతి క్వారంటైన్ సదుపాయం వద్ద ఒక వైద్య బృందం ఉంటుంది. ఇళ్లలో ఉండడానికి ఇష్టంలేని వారు నేరుగా క్వారంటైన్‌కు రావొచ్చు. ఇళ్లల్లో సరైన సదుపాయాలు లేనివారికి ఇక్కడ ఐసోలేషన్ సదుపాయం కల్పిస్తాం. జిల్లా వారీగా క్వారంటైన్‌కోసం 16,723 పడకలు ఇప్పటికే ఏర్పాటు చేశాం. వీటి సంఖ్యను బాగా పెంచాలి. ప్రతిజిల్లాలో కనీసం 5వేల బెడ్లు క్వారంటైన్, ఐసోలేషన్‌కోసం ఏర్పాటు చేయాలి. కళ్యాణ మండలపాలు, హోటళ్లు, వసతులున్న కాలేజీలు, హాస్టళ్లు.. ఇలాంటి వాటివన్నీ తీసుకుని వాటిని శానిటైజ్ చేసి ప్రతి జిల్లాకూ 5వేల బెడ్లు చొప్పున సిద్ధంచేయాలి.
షెల్టర్లలో అన్ని సదుపాయాలు
దాదాపు 5వేల మంది రాష్ట్రంలోని వివిధ సెంటర్లలో ఉన్నారు. వారందరికి ఆహారంతో పాటు సరైన సదుపాయలు కల్పించారు. ఏ ఒక్కరూ పస్తుతో పడుకున్నారనే మాట రాకూడదు. ఈ విషయంలో కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాలి. షెల్టర్లలో ఉన్నవారిని మానవతా దృక్పథంతో చూసుకోవాలి. రూ.10ల ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. రోజూ ఒకే ఆహారాన్ని కాక మెనూను మార్చి ఇవ్వండి. టిఫిన్లు, తాగునీరు ఇవ్వండి. టూత్‌బ్రష్, సబ్బులు, దుప్పట్లు అన్ని సదుపాయాలూ ఇవ్వండి:
ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి. సరిహద్దుల్లో ఉన్న మన వాళ్లను కూడా ఇదే రకంగా చూసుకోవాలి. ప్రతి షెల్టర్ వద్దా ఒక రెసిడెంట్ అధికారిని పెట్టాలి. ఆ అధికారి అక్కడే షెల్టర్‌లోనే ఉండాలి.
జాగ్రత్తలతో వ్యవసాయ కార్యకలాపాలు
అంపెడా ప్రకటించిన రేట్ల ప్రకారం ఆక్వా ఎగుమతిదారులు కొనుగోలు చేసేలా చూడాలి. అపెండా ప్రకటించిన రేట్లపై పబ్లిసిటీ ఇవ్వండి. గ్రామ సచివాలయాల్లో ఈరేట్లను ప్రదర్శించండి. కాల్‌సెంటర్ నంబర్ కూడా ఇవ్వండి. అంపెడా ప్రకటించిన రేట్లకు ఎవ్వరైనా కొనుగోలు చేయకపోతే కలెక్టర్లు జోక్యం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులుంచి ఆక్వా ఉత్పత్తులు తక్కువ రేట్లకు అమ్ముడు పోకూడదు. అలాగే సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి. కనీసం ఒక మీటరు దూరం పాటించేలా చూడండి. మధ్యాహ్నం ఒంటి గంటవరకూ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి. 1 గంటల తర్వాత వాలంటీర్లు, వైద్య సిబ్బంది నిర్వహించే సర్వేకు వీరంతా అందుబాటులో ఉండాలి. వీరి ఆరోగ్య పరిస్థితిని వారు పరిశీలించి, గుర్తించిన అంశాల ఆధారంగా చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తారు.
రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి
నిల్వచేయలేని పంటల విషయంలో రైతులకు సమస్యలు రాకూడదు. వీరికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. నిల్వచేసుకునే పంటల విషయంలో రైతులకు సలహాలు ఇవ్వాలి.రైతులు తెగనమ్ముకునే పరిస్థితి రాకూడదు. వ్యవసాయం, మార్కెటింగ్ అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి. రైతుకు మాత్రం కష్టం రాకూడదు.రబీ పంట వస్తున్న దృష్ట్యా రైతులకు ధాన్యానికి మంచి రేటు రావాలి. మిల్లర్లు అందరికీ గట్టిగా చెప్పాలి. కలెక్టర్లు, మార్కెటింగ్ , పౌరసరఫరాల అధికారులు దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ రేటుకు కొనుగోలు జరుగుతుందన్న మాట రాకూడదు.
వ్యవసాయ ఉత్పతుల తరలింపు మీద, గూడ్స్‌మీద ఆంక్షలు పెట్టకూడదు. సరుకుల రవాణాను అడ్డుకోవద్దని స్పష్టంగా చెప్తున్నా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశాలు జారీచేసింది. దిగువస్థాయి పోలీసుల వరకూ కూడా ఈ సమాచారం వెళ్లాలి. వ్యవసాయ ఉత్పతుల తరలింపు మీద, గూడ్స్‌మీద ఆంక్షలు పెట్టకూడదు. సరుకుల రవాణాను అడ్డుకోవద్దని స్పష్టంగా చెప్తున్నా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశాలు జారీచేసింది. దిగువస్థాయి పోలీసుల వరకూ కూడా ఈ సమాచారం వెళ్లాలి. శానిటరీ వర్కర్లకు మాస్కులు ఇవ్వాలి. అలాగే వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలకు మాస్కులు అందించాలి. రేషన్‌దుకాణాల వద్ద సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి.అవసరమైతే దుకాణాల సంఖ్యను పెంచే అవకాశాలనూ పరిశీలించాలి. రైసుమిల్లులు, పప్పు మిల్లులు, ఆయిల్‌మిల్లులకు ఫుడ్‌ప్రాససింగ్, కోల్డ్‌స్టోరేజీలు, వేర్ హౌసింగులు పనిచేయించడానికి అవకాశం ఇవ్వాలి.తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి’ అని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment