వైఎస్‌ జగన్‌: మద్యం.. షాక్‌ తథ్యం | YS Jagan Directed to Officials on Closing 40% of Bars in AP - Sakshi
Sakshi News home page

మద్యం.. షాక్‌ తథ్యం

Published Wed, Nov 20 2019 4:21 AM | Last Updated on Wed, Nov 20 2019 11:53 AM

CM YS Jagan has directed officials to close 40 per cent of the bars in the state - Sakshi

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: దశలవారీ మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం మూసేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్యం ముట్టుకుంటే షాక్‌ కొడుతుందన్న భావన ఉండాలని, అప్పుడే చాలా మంది దానికి దూరం అవుతారని సీఎం వ్యాఖ్యానించారు. నూతన బార్ల విధానం, తదుపరి చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు తీసుకున్న, ఇకపై తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. బార్ల సంఖ్యను కుదించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో 38 స్టార్‌ హోటళ్లు, 4 పబ్బులతో సహా మిగతా మొత్తం 839 మంది బార్ల నిర్వహణకు లైసెన్స్‌లు తీసుకున్నారని అధికారులు వివరించారు.

ఆతిథ్య రంగానికి సంబంధించిన స్టార్‌ హోటళ్లు, పబ్బులు మినహాయిస్తే 797 బార్లు నడుస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో సగానికి పైగా బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం సూచించగా.. మద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే 20 శాతం దుకాణాలను తగ్గించామని (4,380 దుకాణాలు 3,500కు కుదింపు), మద్య నియంత్రణ కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతున్నందున బార్ల సంఖ్యను కూడా దశల వారీగా తగ్గించుకుంటూపోతే బాగుంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చివరకు 797 బార్లలో 40 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

797లో 40 శాతం అంటే 319 బార్లు మూసివేయనున్నారు. ప్రస్తుత బార్ల విధానాన్ని రద్దు చేసి, నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పుడున్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గించి, మిగిలిన బార్లకు నూతన విధానం ప్రకారం కొత్తగా లైసెన్స్‌లు జారీ చేస్తారు. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించాలని నూతన విధానంలో చేర్చనున్నారు. అప్లికేషన్, లైసెన్స్‌ ఫీజులు భారీగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతిమంగా మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలన్న మౌలిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని సూచించారు. 

మద్యం సరఫరా వేళల కుదింపు.. ధరల పెంపు
బార్ల సంఖ్యను కుదించడంతోపాటు మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. గత సమీక్షా సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని బార్లలో మద్యం సరఫరా సమాయాన్ని రెండు గంటలు కుదించామని (ఉదయం, రాత్రి గంట చొప్పున) అధికారులు వివరించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం సరఫరాను అనుమతిస్తామని, రాత్రి 11 గంటల వరకు ఆహారాన్ని అనుమతిస్తామని చెప్పారు. స్టార్‌ హోటళ్లలో మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం విక్రయించడానికి అనుమతి ఉంటుందన్నారు. బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి పదును
నాటు సారా తయారీ, మద్యం స్మగ్లింగ్, కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్‌ యజమానులు నియమాలను ఉల్లంఘిస్తే లైసెన్స్‌ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానాతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష విధించే నిర్ణయంపై కూడా చట్ట సవరణకు బిల్లు తీసుకురావాలని చెప్పారు. మద్యం, ఇసుక స్మగ్లింగ్‌లను అరికట్టడానికి చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రిళ్లు కూడా పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఉండాలని సీఎం ఆదేశించారు.

జనవరి 1 నుంచి కొత్త మద్యం విధానం 
రాష్ట్రంలో కొత్త మద్యం విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి తెస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. నూతన మద్యం విధానంపై సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 శాతం బార్లను తగ్గించాక, మిగిలిన బార్లకు నూతన విధానం ప్రకారం రాజకీయ ఒత్తిడులకు తావులేని రీతిలో అనుమతులు ఇస్తామని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement