సాక్షి, తాడేపల్లి : అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్ల పట్టాలను నిరాకరించొద్దని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి లబ్ధిదారులను గుర్తించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అర్హులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. అలాగే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను త్వరలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.
ఉపాధి హామీ నిధులతో స్కూళ్లకు ప్రహరీ గోడలను నిర్మించాల, మినీ గోడౌన్ల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పెన్షన్లను వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు చేరవేయనున్నట్లు తెలిపారు. పెన్షన్లు కోసం ఎదురుచూపులు, వేచి చూసే పరిస్థితి లేకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున వ్యవసాయ రంగంలో పనులు లభిస్తున్నాయని అధికారులు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. మార్చి నాటికి అనుకున్న పని దినాలతో లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు
నూతనంగా మరో 300 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. వీటి ద్వారా మరో 3వేలమందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సచివాలయాల్లో ప్రస్తుతం 15,971 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment