సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న పనులను ఆయన గురువారం పర్యవేక్షించారు. ప్రాజెక్ట్ మొదటి టన్నెల్, రెండో టన్నెల్ లోపలికి వెళ్లి పనులను పరిశీలించి, ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. (వడివడిగా వెలిగొండ!)
కాగా ప్రకాశం జిల్లా వరప్రదాయని, జీవధార అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జూన్‌కల్లా ఒకటో సొరంగం నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే తలంపుతో సీఎం జగన్ ఇవాళ వెలిగొండ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ వద్దే జిల్లా ఉన్నతాధికారులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. (వెలిగొండ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్)
శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ వరద నీటిని మళ్లించి సాగు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు, వైఎస్సార్ జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు జిల్లాలకు కలిపి 15.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ తయారు చేశారు. (వెలిగొండతో పశ్చిమాన ఆనందం)
Comments
Please login to add a commentAdd a comment