పరిహారం సంపూర్ణం | CM YS Jagan Jagan Fulfilled Guarantee to LG Polymers Gas Leakage Victims | Sakshi
Sakshi News home page

పరిహారం సంపూర్ణం

Published Mon, May 18 2020 3:18 AM | Last Updated on Mon, May 18 2020 10:09 AM

CM YS Jagan Jagan Fulfilled Guarantee to LG Polymers Gas Leakage Victims - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులందరికీ న్యాయం చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు, ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందచేయగా కంపెనీ పరిసరాల్లోని ఐదు ప్రభావిత గ్రామాలు, ఎనిమిది కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.20 కోట్ల మేర పరిహారాన్ని జమ చేయనున్నారు.

► 12 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని ఇప్పటికే జమ చేశారు. 
► తీవ్ర అస్వస్థతతో కేజీహెచ్‌లో మూడు రోజులకు పైగా చికిత్స పొందిన 319 మందికి, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉన్న 166 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేశారు. వెంటిలేటర్‌పై ఉన్న ఒకరికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించారు.
► అస్వస్థతతో సీహెచ్‌సీల్లో చికిత్స పొందిన 94 మందికి, కేజీహెచ్‌లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన మరో ఐదుగురికి రూ.25 వేలు చొప్పున చెక్కులు అందజేశారు.  
► స్టైరీన్‌ ప్రభావిత ఐదు గ్రామాలు, పరిసర ఎనిమిది కాలనీల్లో  ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామన్న సీఎం హామీ మేరకు అధికారులు తాజాగా ఎన్యూమరేషన్‌ పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో 6,297 ఇళ్లు ఉండగా 20,554 మంది నివాసం ఉంటున్నారు. వారికి పరిహారంగా ప్రభుత్వం రూ.20.55 కోట్లు (రూ.20,55,40,000) మంజూరు చేసింది. 
► డోర్‌ లాక్‌ కారణంగా 163 ఇళ్లల్లో ఎన్యూమరేషన్‌ జరగలేదు. అవి మినహా 6,134 ఇళ్లలోని 20,013 మందికి సోమవారం రూ.20 కోట్లు (రూ.20,01,30,000) అందజేయనున్నారు. 

నేడు బ్యాంకు ఖాతాల్లో జమ
గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాలు, కాలనీల్లో ఎన్యూమరేషన్‌ పూర్తి చేసి అర్హుల జాబితా వార్డు సచివాలయాల్లో ఉంచాం. ప్రతి ఒక్కరి ఆధార్‌ నంబర్‌తోపాటు ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యుడి బ్యాంక్‌ ఖాతా వివరాలను వలంటీర్లు సేకరించారు. దీని ప్రకారం పరిహారం బ్యాంకు ఖాతాలో సోమవారం జమ కానుంది.     – డాక్టరు జి.సృజన, కమిషనర్, జీవీఎంసీ

మిగతా వారికీ అందజేస్తాం...
కొంత మంది ఇప్పటివరకు తమ ఇంటికి తిరిగిరాలేదని ఎన్యూమరేషన్‌లో గుర్తించాం. డోర్‌ లాక్‌ చేసి ఉన్న 163 ఇళ్లల్లోని 541 మందికి కూడా పరిహారం మంజూరైంది. వారు తిరిగి వచ్చిన వెంటనే ఎన్యూమరేషన్‌ పూర్తిచేసి పరిహారాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం.    – వి.వినయ్‌చంద్, కలెక్టర్, విశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement