గ్యాస్‌ లీకేజీ: బాధితుల అ​కౌంట్లలోకి రూ. 20 కోట్లు | CM YS Jagan Video Conference With Vizag LG Polymers Gas Leakage Victims | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీకేజీ: బాధితులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Published Mon, May 18 2020 1:38 PM | Last Updated on Mon, May 18 2020 2:58 PM

CM YS Jagan Video Conference With Vizag LG Polymers Gas Leakage Victims - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీకేజీ చాలా బాధాకరమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌కు తమ ప్రభుత్వ హయాంలో ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని... 13 వేల టన్నుల స్టైరీన్‌ను రెండు షిప్పుల ద్వారా వెనక్కి పంపినట్లు తెలిపారు. విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులతో సీఎం జగన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అమరావతి నుంచి బటన్ నొక్కిన సీఎం వైఎస్ జగన్.... ఒకేసారి సుమారు 20 వేల మందికి గ్యాస్‌ లీకేజీ బాధితుల అకౌంట్లలో పది వేల రూపాయిల చొప్పున  మొత్తం 20 కోట్లు జమ చేశారు. విశాఖ కలెక్టరేట్‌ నుంచి మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజ్, పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జీవీఎంసి కమీషనర్ సృజన, జేసీ వేణుగోపాలరెడ్డి, అరుణ్ బాబు, విశాఖ పశ్చిమ ఇన్ ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, బాధితులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.(22న సీఎం చేతుల మీదుగా)

2 గంటల్లో గ్రామాలు ఖాళీ చేయించారు
ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలో..  నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను.  ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయారు. ఆ ప్రమాదంలో ప్రమాదంలో సంస్థ రూ. 20 లక్షలు,.. కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం 2 లక్షలు అందించాయి. ఘటన జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటామని.. కంపెనీలకు హెచ్చరిక ఉండేలా ప్రభుత్వాలు స్పందించాలి. ఓఎన్జీసీ ఘటనలో బాధితులకు రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలని కోరాను. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనూ నాకు అదే గుర్తొచ్చింది. అందుకే ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించింది. కలెక్టర్, కమిషనర్‌తో పాటు 110 అంబులెన్స్‌లు కూడా ఘటనా స్థలికి చేరుకున్నాయి. 2 గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అధికారులు స్పందించిన తీరును అభినందనీయం ’’ అని ప్రశంసించారు.

మానవతా దృక్పథంతో ముందుకు సాగాం..
‘‘మనం అధికారంలోకి వచ్చాక ఎల్జీ పాలిమర్స్‌కు ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. ఆ సంస్థకు అనుమతి గాని, విస్తరణ గాని... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. అయినా ఎక్కడా మనం రాజకీయ ఆరోపణలు చేయలేదు. మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని మాత్రమే ప్రయత్నించాం.10 రోజుల్లోపే పరిహారంతో పాటు వైద్య సేవలను పూర్తిగా అందించాం. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజల ఆందోళన చెందకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. ప్రభావిత గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి రూ.10 వేలు ఆర్థికసాయం. వెంటిలేటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షలు ఆర్థికసాయం రెండ్రోజులకు పైగా ఆస్పత్రుల్లో ఉన్నవారికి రూ.లక్ష... ప్రాథమిక చికిత్స చేయించుకున్నవారికి రూ.25 వేలు ఆర్థికసాయం అందించాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఫిర్యాదులు ఉంటే స్వీకరించండి
ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై అధ్యయనానికి వేసిన కమిటీలు ఇచ్చే నివేదికల ద్వారా తప్పు ఎవరివల్ల జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కంపెనీకి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభావిత ప్రాంతాల్లో.. ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక శానిటేషన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. బాధితులకు ప్రత్యేక వైద్యసదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాబోయే నెలరోజుల పాటు గ్రామాల్లోనే.. వైద్యులను, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అంతేగాక తాత్కాలికంగా విలేజ్ క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో వైద్య సేవలందిస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement