మీ బిడ్డే ముఖ్యమంత్రి.. అన్యాయం జరగనివ్వను | CM YS Jagan video conference with victims of gas leakage accident | Sakshi
Sakshi News home page

మీ బిడ్డే ముఖ్యమంత్రి.. అన్యాయం జరగనివ్వను

Published Tue, May 19 2020 3:25 AM | Last Updated on Tue, May 19 2020 3:25 AM

CM YS Jagan video conference with victims of gas leakage accident - Sakshi

ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులకు పరిహారం విడుదల చేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు ఆళ్లనాని, కన్నబాబు   

మన పనితీరు పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని గర్వంగా చెప్పగలను. ఇలాంటి దుర్ఘటనల్లో ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలనేది చూపించాం. ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ.. పది రోజుల్లో పరిహారాన్ని నేరుగా బాధితుల చేతుల్లో పెట్టడం గొప్ప కార్యక్రమం. ఇందుకు అధికారులకు అభినందనలు.

మీ బిడ్డనే సీఎంగా ఉన్నారు. బాధితులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అన్ని రకాలుగా అండగా ఉంటుంది. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికతో పాటు, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, సందేహాలను కంపెనీకి ఇచ్చి.. వివరణ తీసుకుందాం. ఆ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తాం. బాధ్యులైన వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. 

ఈ దుర్ఘటనలో మరణించిన 12 కుటుంబాల వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగం ఇద్దాం. కనీసం గ్రామ సచివాలయాల్లో అయినా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇందుకు అవసరమైతే నిబంధనలు మారుద్దాం.

సాక్షి, అమరావతి: ‘మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వను’ అని విశాఖ గ్యాస్‌ లీక్‌ బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనకు బాధ్యులెవరైనా సరే వదిలి పెట్టబోమని,  కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంపెనీలో మరోసారి అలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే కంపెనీని తరలిస్తామని, ఇప్పటికే 13 వేల టన్నుల స్టైరీన్‌ను కొరియాకు పంపించామని స్పష్టం చేశారు. గ్యాస్‌ ప్రభావిత ఐదు గ్రామాలు, ఎనిమిది కాలనీల్లో 19,893 మందికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సోమవారం ఆయన కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విశాఖ కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఇది బాధాకరం.. అందుకే ఇంత పరిహారం
ఎల్‌జీ పాలిమర్స్‌ సంఘటన దురదృష్టకరం. ఎక్కడైనా సరే ఇలాంటివి జరిగితే ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలనేది అధికార యంత్రాంగం చేసి చూపించింది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 22 మంది చనిపోయారు. ఆప్పుడు నేను ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా చూశాను. ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఓఎన్‌జీసీ రూ.20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఇచ్చింది. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున వచ్చింది. 
► అలాంటి దుర్ఘటన జరిగినపుడు ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలి? కంపెనీకి ఎలాంటి శిక్ష విధిస్తే ప్రమాదాలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటాయి? అని అలోచించాను.
► ఇలాంటి ఘటనలు విదేశాల్లో జరిగితే, ఎలా పరిహారం ఇస్తారో.. ఇక్కడా అలాగే ఇవ్వాలని కోరాను. పెనాల్టీ భారీగా, షాక్‌ కొట్టేలా ఉంటుందని ఆ కంపెనీకి భయం ఉంటే, అవి చాలా జాగ్రత్త తీసుకుంటాయని చెప్పి.. కోటి రూపాయలు చొప్పున ఇవ్వాలని నేను ఆ రోజే డిమాండ్‌ చేశాను. 
► ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు ఓఎన్‌జీసీ సంఘటన గుర్తుకొచ్చింది. అందుకే దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చింది.  

సత్వరమే స్పందనకు అభినందనలు
► కంపెనీ నుంచి స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ తెల్లవారుజామున చోటుచేసుకుంది. అ సమయంలో  అధికార యంత్రాంగం చూపించిన సత్వర స్పందన దేశంలోనే గతంలో ఎక్కడా చూసి ఉండం. 4.30 గంటలకే అధికారులంతా సంఘటనా స్థలికి చేరుకున్నారు. 
► 110 అంబులెన్స్‌లు వచ్చాయి. రెండు గంటల వ్యవధిలోనే ఊర్లలో అస్వస్థతకు గురైన వందలాది మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. కలెక్టర్, కమిషనర్, పోలీసులు, వైద్య సిబ్బంది, వైద్యులు.. ఇలా అధికార యంత్రాంగం అందరికీ అభినందనలు. 

పలు కమిటీలతో అధ్యయనం
► ఈ దుర్ఘటనపై పలు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే పది మంది వైద్య నిపుణులతో కమిటీ వేశాం. బాధితులకు తగిన వైద్య పరీక్షలు, చికిత్స చేసేందుకు ఆదేశాలు ఇచ్చాం. ఇందుకు అవసరమైన ఉపకరణాలు సమకూర్చాం.
► ఇలాంటి దుర్ఘటనల్లో కంపెనీలపై ఏవైనా చర్యలు తీసుకోవాలంటే ముందు నిజమేమిటో తెలియాలి. అదేమిటో తెలుసుకోవడానికి, అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయడానికి ఏం చేయాలనే విషయమై పలు కమిటీలు వేశాం.  
► ప్రమాదానికి కారణమైన స్టైరీన్‌ గ్యాస్‌.. కంపెనీలో ఉండకూడదనే ఉద్దేశంతో 13 వేల టన్నులను రెండు షిప్‌ల ద్వారా దక్షిణ కొరియాకు తిరిగి పంపించేశాం.  

అనుమతులన్నీ బాబు హయాంలోనే
► ఈ కంపెనీకి ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా మన ప్రభుత్వం ఇవ్వలేదు. 1996లో ఎల్‌జీ కెమికల్స్‌ సంస్థ పాలిమర్స్‌ కంపెనీని టేకోవర్‌ చేయడం నుంచి మొదలు 2015లో ఇచ్చిన కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్స్‌ సర్టిఫికెట్, కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సర్టిఫికెట్‌ వరకూ రెన్యువల్స్‌ కానీ, విస్తరణ ప్రాజెక్టు కానీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చినవే.
► ప్రమాదం జరిగిన తర్వాత ఇవన్నీ వారే చేశారని ఒక్క మాట కూడా అనకుండా సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు విశాఖలోనే ఉండి సహాయ, పునరావాస కార్యక్రమాలన్నీ పర్యవేక్షించారు. 

మానవతా దృక్పథంతో ఆదుకున్నాం
► బాధితులను ఆదుకునేందుకు ఎంతో మానవతా దృక్పథం ప్రదర్శించాం. చనిపోయిన 12 మంది కుటుంబాలకు పది రోజుల వ్యవధిలోనే దేశంలో మరెక్కడా లేనివిధంగా రూ.కోటి చొప్పున ఇచ్చాం. 
► ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఎక్కడా స్ట్రెస్‌కు గురికాకూడదనే ఉద్దేశంతో పెద్దలు, పిల్లలనే భేదం లేకుండా 19,893 మందికి రూ.10 వేల చొప్పున ఇచ్చాం. 
► ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం పొందినా సరే రూ.25 వేల చొప్పున, రెండు రోజులకు మించి ఆసుపత్రుల్లో వైద్యం పొందినవారికి రూ.లక్ష చొప్పున, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు సహాయంగా ఇచ్చాం.   

అధికారులు బాగా పని చేశారు 
► ‘గుడ్‌ జాబ్‌ వినయ్‌ (విశాఖ కలెక్టర్‌).. మీరంతా చాలా బాగా పని చేశార’ని సీఎం అభినందించారు. ‘అ«ధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు చక్కగా పని చేశారు. గ్రామంలో పడుకుంటానని మంత్రి కన్నబాబు స్వయంగా ముందుకు వచ్చారు. ఇది ఎందరికో స్ఫూర్తి దాయకం. నా మంత్రివర్గంలో ఇంత మంచి వారున్నారని నిజంగా సంతోషపడ్డాను. అధికారులకు కృతజ్ఞతలు. అక్కడ ఉన్న వారందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అన్నారు.
► మంత్రి కె.కన్నబాబు స్పందిస్తూ.. ‘మీరు (సీఎం) చరిత్రలో నిలిచిపోతారు. మీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాము. మానవీయ కోణంలోనూ మీకెవ్వరూ సాటిరారు’ అన్నారు.
► ‘ఇంకా 12 ఇళ్లలోని వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు అందాల్సి ఉందని విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులతో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. 

మంత్రులు, అధికారుల స్పందన బాగుంది
గ్యాస్‌ లీకేజి ప్రమాదం జరిగినప్పటి నుంచి నేటి వరకు అధికారులు, మంత్రుల స్పందన బాగుంది. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ మాలాంటి పేద ప్రజలకు ధైర్యం చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన ప్రకారం మంత్రులు, అధికారులు సత్వర రీతిలో చర్యలు తీసుకుని మాలో భయాందోళన తగ్గిపోయేలా చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ధైర్యం పెంచారు. స్థానిక గ్రామాల్లోని ప్రజలు ఇప్పడు ఎంతో సంతోషంగా ఉన్నారు.
– మామిడి రామకృష్ణ, నందమూరినగర్‌

కుటుంబ పెద్దలా ఆదుకున్నారు 
ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంలో బాధితులందరికీ సీఎం జగన్‌ కుటుంబ పెద్దలా సాయపడ్డారు. తల్లికి కొడుకులా, ఇంటికి పెద్దలా ఆలోచించారు. ఎవరూ ఊహించని విధంగా ఆదుకున్నారు. పాలిమర్స్‌ కంపెనీ బాధిత కుటుంబాలకు పెద్ద దిక్కయ్యాడు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఎవరూ ఊహించలేనిది. చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, రూ.లక్ష, రూ.25 వేలు ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వారందరికి తలో రూ.10 వేలు ఇచ్చారు. ఇది మాకెంతో మేలు చేస్తోంది. ఇప్పటికే అమ్మఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్‌.. తదితర ఎన్నో పథకాల ద్వారా పేదలను ఆదుకుంటున్నారు. ఇంత చేస్తున్న నాయకుడికి అండదండగా నిలిచి రుణం తీర్చుకుంటాం. 
– యల్లపు చంద్రమణి, ఆర్‌ఆర్‌వీ పురం

కొండంత భరోసాగా అనిపిస్తోంది
కుటుంబాన్ని కోల్పోయి బాధల్లో ఉన్న నాకు మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. కొండంత భరోసాగా అనిపిస్తోంది. నా భర్త చనిపోవడంతో చాలా బాధపడ్డాను. కుటుంబ పెద్దను కోల్పోయి ఒంటరి అయ్యాను. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురాడానికి మేము 20 ఏళ్లు చాలా కష్టపడ్డాము. మాకు జరిగిన అన్యాయానికి ఊహించని విధంగా రూ.కోటి ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన నాకు రూ.లక్ష నా ఖాతాలో వేశారు. కుటుంబానికి అండగా నిలిచారు. నా పెద్ద కుమార్తె కొడుకు, నా మనవడు ఎంటెక్‌ పాసయ్యాడు. ఇతనికి ఉద్యోగం ఇప్పిస్తే నాకు తోడుగా ఉంటాడు. మీ పరిపాలన చాలా బాగుంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 
– మేక సుశీల (మృతుడు మేక కృష్ణమూర్తి భార్య), వెంకటాపురం, వెంకటాద్రి గార్డెన్స్‌ 

మీరున్నారనే ధైర్యం వచ్చింది
ఘటన జరిగిన వెంటనే మాకు ఏమీ అర్థం కాలేదు. అర గంట పాటు ఏం జరిగిందో కూడా తెలియదు. పరుగులు తీసి స్పృహ కోల్పోయి పడిపోయాం. తర్వాత అధికారులొచ్చి మమ్మల్ని ఆస్పత్రుల్లో చేర్చారు. మాలో కొండంత ధైర్యాన్ని నింపారు. మా కుటుంబాలకు అండగా నిలిచారు. మాకు బెహరా కాలేజీలో బస ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటన్న భయం మమ్మల్ని వెంటాడింది. అయితే ఊహించని విధంగా మీరు నష్ట పరిహారం ప్రకటించారు. మీరిచ్చిన భరోసా మాలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికే నాకు అమ్మ ఒడి పథకంలో రూ.15 వేలు వచ్చింది. నా భర్త ఆటోడ్రైవర్‌. అతనికి రూ.10 వేలు వచ్చాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మా కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.40 వేలు ఇచ్చారు. మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. భవిష్యత్తులో ఏమి జరిగినా మీరున్నారన్న ధైర్యం వచ్చింది. మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి. 
– పొట్నూరి పరమేశ్వరి ఎస్సీ, బీసీ కాలనీ

రోడ్డున పడకుండా ఆదుకున్నారు
ఆ రాత్రి గ్యాస్‌ లీక్‌ కాగానే పోలీసులు వచ్చారు. సైరన్‌ మోగించారు. మమ్మల్ని అప్రమత్తం చేశారు. ఆ వెంటనే అధికారులు వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ఆస్పత్రుల నుంచి శిబిరానికి తరలించి మంచి ఆహారం పెట్టారు. చిన్న పిల్లలకు కోడిగుడ్లు కూడా పెట్టారు. మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి మా యోగ క్షేమాలు విచారించారు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. అక్కడి నీళ్లు తాగొద్దని, మంచినీరు సరఫరా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం ప్రకటించారు. గతంలో కొంత పరిహారం ప్రకటించినా, అది ఎప్పుడిస్తారో.. ఎవరిని కలవాలో కూడా తెలిసేది కాదు. కానీ మీరు ప్రకటించిన పరిహారాన్ని మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు మంత్రులు, అధికారులు మా వద్దకు వచ్చి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు.    
– గంగరాజు, పద్మనాభపురం

కొంతమంది భయపెట్టారు..
గ్యాస్‌ లీకేజీ ప్రమాదం జరిగాక, మా లాంటి వారిని ఎవరు ఆదుకోరేమో అని భయపడ్డాము. కొంత మంది అయితే మళ్లీ మా గ్రామాలకు వెళ్లొద్దని చెప్పి భయభ్రాంతులకు గురిచేశారు. ఏం చేయాలో అర్థం కాక ఆందోళనకు గురయ్యాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసాతో మాలో ధైర్యం వచ్చింది. మంత్రులు, అధికారులను రాత్రుళ్లు గ్రామాల్లో బస చేయించడంతో మాలో మానసిక స్థైర్యం మరింత పెరిగింది. వారు మా గ్రామాల్లో బసచేసి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీంతో మాకందరికీ ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. దీంతో స్థానికంగా కొంత మంది చెబుతున్న మాటలు వినడం మానేశాం. మేము ఊహించని విధంగా సాయం చేసిన సీఎంకు ధన్యవాదాలు.    
– మామిడి గౌరి, నందమూరి నగర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement