‘మనబడి నాడు–నేడు’కు సంబంధించి పాఠశాల నమూనా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. స్కూళ్లను చక్కటి సదుపాయాలతో తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 45,329 ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన బోధన అందించేందుకు ఉద్దేశించిన ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం నేడు ప్రారంభం కాబోతోంది. బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
తొలిసారిగా చదువులపై భారీ వ్యయం
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా వ్యయం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యారంగంపై చేసే వ్యయం సామాజిక పెట్టుబడిగా మారి మానవ వనరుల అభివృద్ధి జరగనుంది. దీని ద్వారానే మెరుగైన సమాజం సాధ్యమని ముఖ్యమంత్రి జగన్ దృఢంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘మనబడి నాడు– నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
విప్లవాత్మక నిర్ణయం
మూడేళ్లలో మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమానికి రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అంచనాలు ఇంకా పెరగవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక సీఎస్ పీవీ రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్లపై వ్యయం చేయడం అంటే ఇదంతా సామాజిక పెట్టుబడేనని తెలిపారు. తద్వారా ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో విశ్వాసం పెంచాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాలు విద్యను ప్రైవేట్ పరం చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం వెనుక సామాజిక బాధ్యత స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
స్కూళ్ల అభివృద్ధి ఇలా
- నాడు–నేడు తొలి దశ కార్యక్రమం కింద 15,715 స్కూళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.3.627 కోట్లు అవసరమని అంచనా వేశారు. – తొలిదశలో గ్రామీణ, గిరిజన, పట్టణ, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధి.
- జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కలెక్టర్లు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపడతారు.
- ఇప్పటికే రాష్ట్రంలోని 45,329 సూళ్ల పరిస్థితికి సంబంధించి 20.19 లక్షల ఫొటోలను కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు.
- మౌలిక వసతుల కల్పన అనంతరం స్కూళ్ల ఫొటోలు మరోసారి తీసి తాజాగా ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలిసేలా వెబ్ పోర్టల్‌లో పొందుపరుస్తారు.
- మన బడి పేరుతో నాడు–నేడు కింద చేపట్టనున్న పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు పబ్లిక్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment