ఎన్నికల్లో అక్రమాలకు.. మొబైల్‌ యాప్‌తో 'చెక్‌' | CM YS Jagan To Launch Mobile App For Local Body Election | Sakshi

ఎన్నికల్లో అక్రమాలకు.. మొబైల్‌ యాప్‌తో 'చెక్‌'

Mar 7 2020 4:39 AM | Updated on Mar 7 2020 4:39 AM

CM YS Jagan To Launch Mobile App For Local Body Election - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసింది. మొబైల్‌ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు ఎవరైనా తమ కళ్ల ముందు జరిగే ఎన్నికల అక్రమాలను వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. నిఘా పేరుతో పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించిన ఈ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం లాంఛనంగా ఆవిష్కరిస్తారని ఆ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను బెదిరింపులు లేదా ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే అటువంటి వ్యక్తులు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగటానికి వారిని అనర్హులుగా పరిగణించడంతో పాటు ఆరేళ్లపాటు తిరిగి పోటీచేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాక.. వారికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.పదివేల వరకు జరిమానా విధిస్తారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఈ యాప్‌ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. 

యాప్‌ ఉపయోగాలివీ..
- డబ్బు లేదా ఇతర బహుమతులు, మద్యం పంపిణీ చేస్తున్నా.. యజమాని అనుమతి లేకుండా వారి ఇంటికి పోస్టర్లు, బ్యానర్లు వంటి అతికించినా.. ఆయుధాలతో ఎవరైనా తిరిగినా.. ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా ప్రచారం కొనసాగించినా.. పరిమితికి మించిన శబ్దంతో మైక్‌లను ఉపయోగించినా.. కులమతాల ప్రసంగాలు వంటి అంశాలపై ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 
- కళ్ల ముందు జరిగే అక్రమాలకు సంబంధించి ఫొటో, వీడియో లేదా ఆడియోను ఈ యాప్‌లోనే రికార్డు చేసి పంపించొచ్చు.  
ఫిర్యాదు చేసే వారు తమ వ్యక్తిగత సమాచారం ఇష్టం ఉంటేనే తెలియజేయవచ్చు. 
- ఫిర్యాదుదారులు పంపించిన ఫొటో, వీడియోలు ఏ ప్రాంతంలోనివో జీపీఎస్‌ ద్వారా గుర్తించి అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. 
- ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసే వారు ఆ సమాచారం సరిగ్గా ఉందో లేదోనని మొబైల్‌కు మెసేజ్‌ రూపంలో తెలిసిపోతుంది. 
అంతేకాక.. ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
యాప్‌ను తమ మొబైల్‌ ఫోనులో డౌన్‌లోడ్‌ చేసుకునే వారు మొదట తమ ఫోను నంబర్‌ను రిజస్టర్‌ చేస్తే,  ఆ తర్వాత ఆ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ నంబర్‌ను యాప్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ చేస్తే.. తర్వాత యాప్‌ను ఎప్పుడైనా సులభంగా ఉపయోగించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement