మార్పు దిశగా తొలి అడుగు | Public Appreciation of all Communities for Commitment of CM YS Jagan | Sakshi
Sakshi News home page

మార్పు దిశగా తొలి అడుగు

Published Wed, Mar 11 2020 3:52 AM | Last Updated on Wed, Mar 11 2020 4:17 AM

Public Appreciation of all Communities for Commitment of CM YS Jagan - Sakshi

డబ్బు ప్రభావం, మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు అధికార పార్టీ ముందుకు రావడం శుభ పరిణామం. మాటలకే పరిమితం కాకుండా దాన్ని ఆచరించడం సాహసోపేత నిర్ణయం.. అంటున్న వివిధ వర్గాల మేధావులు, సంఘాలు  

సాక్షి, అమరావతి: గ్రామ స్థాయి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించడం పట్ల సమాజంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఓ సదవకాశంగా తీసుకుని వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామంగా ప్రజలు పరిగణిస్తున్నారు. ఎన్నికల సమూల ప్రక్షాళనకు ఉపక్రమించడాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు అంటేనే విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లడం.. మద్యం ఏరులై పారించడం.. ఓటర్లను ప్రలోభపెట్టడం.. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం.. అన్న అభిప్రాయం సర్వత్రా స్థిరపడిపోయింది.

ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. అందుకే ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు నడుం బిగించారు. అందుకోసం ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓ వైపు చట్టపరమైన సవరణల ద్వారా ఎన్నికల వ్యవస్థను పటిష్టపరుస్తోంది. తద్వారా ప్రజలకు మేలు చేసేలా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తోంది. మరోవైపు ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎన్నికల అక్రమాల కట్టడికి సిద్ధపడింది. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకువస్తున్న విప్లవాత్మకమైన మార్పుల పట్ల రాజకీయ పరిశీలకులు, వివిధ వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  

వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వమే చుక్కాని.. 
ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వమే చొరవ తీసుకుని ఆదర్శంగా నిలవాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంకల్పం పట్ల రాజకీయ పరిశీలకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా అధికారాన్ని అవకాశంగా చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించాలని అధికార పార్టీలు భావిస్తుంటాయి. రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే ఎన్నికల సంస్కృతి కొనసాగుతోంది. అందుకు భిన్నంగా వైఎస్‌ జగన్‌ ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఉద్యుక్తులయ్యారు. పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రిగా తాను, అధికార పార్టీగా వైఎస్సార్‌సీపీ చొరవ తీసుకుంటే ఓ మంచి సందేశాన్ని అందించినట్టు అవుతుందని ఆయన భావించారు. ఈ నేపథ్యంలోనే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.  

ఎన్నికల అక్రమాల అడ్డుకట్టకు ‘నిఘా’ యాప్‌ 
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. 
- ఇందులో భాగంగా ప్రత్యేకంగా ‘నిఘా’ యాప్‌ను రూపొందించింది. 
- ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థకు అదనంగా ఈ యాప్‌ను రూపొందించడం ద్వారా ప్రభుత్వం ప్రజల చేతికే ఓ అద్భుతమైన అస్త్రాన్ని అందించింది. 
- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల ఆవిష్కరించిన ఈ యాప్‌ను ప్రజలు తమ మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  
- తమ ప్రాంతాల్లో డబ్బులు పంచుతున్నట్టుగానీ, మద్యం పంపిణీ చేస్తున్నట్టుగానీ, బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నట్టుగానీ ప్రజల దృష్టికి వస్తే వెంటనే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.  
- ఆ ఫిర్యాదు వెంటనే ‘సెంట్రల్‌ కంట్రోల్‌ రూం’కు చేరుతుంది. జీపీఎస్‌ పరిజ్ఞానం ద్వారా ఏ ప్రాంతంలో ఎన్నికల అక్రమాలు జరుగుతున్నాయన్నది కూడా అధికారులకు తెలుస్తుంది. 
- దాంతో సెంట్రల్‌ కంట్రోల్‌ రూంలోని అధికారులు సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి నిమిషాల్లోనే ఆ ప్రాంతానికి పోలీసు, రెవెన్యూ అధికారులను పంపించి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తారు.  

అక్రమాలకు పాల్పడితే పదవులు పోతాయ్‌..  
- పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఓ ఆర్డినెన్స్‌నే జారీ చేయడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.  
- ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా, ఓటర్లను ప్రలోభపెట్టినా ఏకంగా పదవులే కోల్పోయేలా ఈ ఆర్డినెన్స్‌లో కఠిన నిబంధనలను విధించారు. 
ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగితే అక్రమాలకు అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం.. నోటిఫికేషన్‌ విడుదల అయిన 18 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించాలని నిర్ణయించింది.  
- ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టినా, బెదిరించినా ఇతర అక్రమాలకు పాల్పడినా సంబంధిత నేతలపై కేసులు నమోదు చేసేలా నిబంధనలను విధించింది.  
- బాధ్యులపై మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించేలా చట్టంలో మార్పులు చేసింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. 

మద్యంపై పూర్తి నియంత్రణ  
- ఎన్నికల ప్రలోభాల్లో అత్యంత ప్రధానమైన మద్యం ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు 
ఉపక్రమించింది.  
- గ్రామాల్లో ప్రశాంత పరిస్థితులు నెలకొల్పే విధంగా మద్య విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది.  
- ఈ దిశగా ఇప్పటికే గ్రామాల్లో బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా తొలగించింది. దశల వారీ మద్య నిషేధంలో భాగంగా తొలి ఏడాది 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది.  
- గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ, విక్రయాలు అన్నవి లేకుండా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.  
- రాష్ట్ర సరిహద్దుల నుంచి కూడా మద్యం అక్రమ రవాణాను కట్టడి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. 
- విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం నిల్వలపై దాడులు చేయాలని ఆదేశించారు.  
- అందుకోసం ఎక్సైజ్, పోలీసు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు, 
ఇతర వ్యవస్థలను కూడా ఇందుకోసం వినియోగించాలని చెప్పారు.  

శుభ పరిణామం
రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా మద్యం, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. మద్యం, డబ్బు ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే వీలులేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేవడం శుభ పరిణామం. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మంచి అవకాశం కల్పించారు. మిగతా రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలి. 
    – ఎం శ్యామ్‌ ప్రసాద్, మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర కార్యదర్శి 

అసలు సిసలైన ప్రజాస్వామ్య ఎన్నికలు 
ఇది చరిత్రాత్మక నిర్ణయం. నగదు, మద్యం పంపిణీకి తావు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే అసలు సిసలైన ప్రజాస్వామ్యం ఆవిష్కృతమవుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు తొలి సంస్కరణగా భావిస్తున్నా. ఓటరు మనోభావానికి అనుగుణంగా ఎన్నుకునే నూతన సంప్రదాయాన్ని తీసుకురావడం గర్వకారణం. విలువలు గల రాజకీయాలకు శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగిన పరిణామం. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీ మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం ఇప్పటిదాకా చూశాము. కానీ ఇందుకు భిన్నమైన పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో తొలిసారి చూస్తున్నాం.  
– ప్రొఫెసర్‌ వై.వెంకట్రామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యుడు, అనంతపురం

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మంచి అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం వచ్చింది. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చు. ఎన్నికల రోజు సెలవురోజుగా భావించకుండా ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయాలి. మద్యం, డబ్బు, ఇతరత్రా ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని ప్రభుత్వమే చెబుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. 
    – మాగులూరి నాగేశ్వరరావు, ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్, ఒంగోలు

నిజాయితీపరుల ఎంపికకు మార్గం
స్థానిక సంస్థల ఎన్నికలను సక్రమంగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు మద్యం, నగదు పంపిణీని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతి ఓటరూ ఇదే కోరుకుంటున్నారు. మా పార్టీ సుదీర్ఘకాలంగా ఎన్నికల సంస్కరణలను కోరుతోంది. ఇప్పటికైనా ఆ దిశగా అడుగు పడినందుకు సంతోషం.  స్థానిక సంస్థలలో నిజాయితీ పరుల ఎన్నికకు, స్వేచ్ఛగా ప్రజాసేవ చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.      
 – కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

అందరూ ఆదర్శంగా తీసుకోవాలి
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం అమ్మకాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా పట్టించుకోకుండా ‘క్వాలిటీ ఆఫ్‌ ఓట్‌’ కోసం కొత్త విధానానికి నాంది పలికింది. 
– వీఎస్‌ శివకుమార్, విశ్రాంత తహసీల్దార్, పెన్షనర్ల సంఘం చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు.

ఎన్నికల సంస్కరణలకు తొలి అడుగు
గ్రామ స్వరాజ్యం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, ధన పంపిణీ ఆగాల్సిందే. మా పార్టీ సుదీర్ఘ కాలంగా ఈ డిమాండ్‌ చేస్తోంది. ఎన్నో వేదికలపై కూడా చెప్పింది. అయితే ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఈ విధానాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.  ఎన్నికల సంస్కరణలు రావాలి. అందుకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నాం. ఓటర్ల ప్రలోభ పర్వానికి ఇప్పటి నుంచైనా తెర పడాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మంచిదే.
– వై వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

గ్రామాలకు మంచి రోజులు
మద్యం, డబ్బు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో నెగ్గుకురాగలరు అనేది సమాజంలో నాటుకుపోయింది. అలాంటి వాటికి చెక్‌ పెట్టడం చాలా మంచి నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల గ్రామాలు బాగుపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం చాలా సంతోషదాయకమైనది. ఇది సక్రమంగా అమలయ్యేట్లు ఎన్నికల కమిషన్‌ మరింత శ్రద్ధ తీసుకోవాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి. 
– కుదమ తిరుమలరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రాజాం, శ్రీకాకుళం జిల్లా

గ్రామాల్లో గొడవలు తగ్గుతాయి
అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనీ, మద్యం పంపకాలు లేకుండా ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. ఈ నిర్ణయానికి మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ మద్దతు తెలపాల్సిందే. ఎన్నికల సందర్భంగా ఎన్నో గొడవలు, హత్యలు జరగడం చూశాం. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామాల్లో గొడవలు తగ్గుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.     
– జి.సోమేశ్వరరావు, బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement