కరోనాతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వచ్చే వరకు కొన్ని నెలలపాటు కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని (కోవిడ్)తో కలిసి ఎలా బతకాలన్న దానిపై అంద రికీ అవగాహన కల్పించాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. అలాగే.. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అన్న వాటిపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలి. 85 శాతం కరోనా కేసులకు ఇంట్లోనే ఉండి వైద్యం పొందవచ్చు. మిగిలిన 15 శాతంలో కూడా కేవలం 4 శాతం కేసులకు మాత్రమే ఐసీయూలో చికిత్స అవసరమవుతుంది. కాబట్టి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదని.. అలా జరగకూడదనే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పలు చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కుటుంబంలో ప్రతిఒక్కరూ చల్లగా ఉండాలన్న లక్ష్యంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సీఎం స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పైలట్ ప్రాజెక్టు విధానాన్ని ఇప్పుడు కొత్తగా మరో ఆరు (విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు) జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అలాగే, మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఈ పథకం కింద అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
నాడు అరకొర సేవలు.. రూ.680 కోట్లు బకాయిలు
ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ మరో అడుగు ముందుకు వేశామని.. దీని పరిధిని విస్తృతంగా పెంచుకుంటూపోతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకంలో కేవలం 1,059 వైద్య సేవలు మాత్రమే అందేవని, అవి కూడా అరకొరగానే ఉండేవని సీఎం వివరించారు. అలాగే, నెట్‌వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.680 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెట్టారని.. తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ చెల్లించేశామన్నారు. ఇంకా ఆయా ఆస్పత్రుల ద్వారా మెరుగైన సేవలందేలా చర్యలు చేపట్టామని వైఎస్ జగన్ చెప్పారు. పేదలు గర్వంగా తలెత్తుకుని చికిత్స చేయించుకుని, సంపూర్ణారోగ్యంతో డిశ్చార్జ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. డాక్టర్లు, ఆసుపత్రులు పేదలను చిన్నచూపు చూడకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన చెల్లింపులన్నీ గ్రీన్ ఛానల్‌లో అందజేస్తున్నామని సీఎం చెప్పారు.
మరిన్ని వైద్య సేవలు..
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకంలో 1,259 వైద్య సేవలు అందుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా పైలట్ ప్రాజెక్టులో మొత్తం 2,200 రకాల సేవలు అందుతున్నాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ 2,200 సేవలను ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నామన్న ఆయన.. నవంబర్ 14 నుంచి మిగిలిన జిల్లాల్లోనూ అమలుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. అంతేకాక.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చామని, వారం క్రితం నాన్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స చేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒకేసారి 1,088 అంబులెన్సులు ప్రవేశపెట్టామని, తద్వారా రాష్ట్రంలోని ప్రతి మండలంలో అత్యంత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
1.42కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు
వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకం అమలుచేస్తున్నామని.. తొలిసారిగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ కార్డులో రోగికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయన్నారు. ఇప్పటికే 1.38 కోట్ల కార్డులను పంపిణీ చేశామని.. మిగిలిన 4 లక్షల కార్డుల ముద్రణా పూర్తయిందని, వీలైనంత త్వరగా వలంటీర్ల ద్వారా వాటిని అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
‘నాడు–నేడు’తో ఆస్పత్రులకు కొత్తరూపు
ఇక ఆరోగ్యశ్రీలో ఓ పక్క మంచి వైద్యం అందిస్తూనే.. మరోపక్క నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులు ఉండగా, కొత్తగా మరో 16 ఏర్పాటుచేస్తున్నామన్నారు. అలాగే.. దాదాపు రూ.16 వేల కోట్ల వ్యయంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు, కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇచ్చి, మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని సీఎం వివరించారు. అన్ని ఆస్పత్రులలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. గతంలో కేవలం 230 రకాల మందులు మాత్రమే ఇస్తుండగా, జనవరి నుంచి 510 రకాల మందులు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
13వేల విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు
గ్రామ సచివాలయాల పక్కనే అన్ని గ్రామాలలో 13 వేల వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. వాటిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు రోజంతా అందుబాటులో ఉంటారని, అవి రెఫరల్ ఆస్పత్రులుగా పనిచేస్తాయని తెలిపారు. వాటిల్లో 54 రకాల మందులు కూడా ఉంటాయని చెప్పారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇస్తున్నామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఇలాంటి వారికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్లు ఇస్తున్నామని.. లెప్రసీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు, పక్షవాతంతో మంచానికి.. వీల్‌చైర్లకు పరిమితమైన వారికి రూ.10 వేల వరకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.
65 లక్షల మంది పిల్లలకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’
రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది పిల్లలకు వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద వైద్య పరీక్షలు చేశామని.. వారిలో 1.58 లక్షల మందికి కళ్లజోళ్లు అవసరమని తేలితే.. 1.29 లక్షల మంది పిల్లలకు వాటిని ఇచ్చామని, మిగిలిన 29 వేల కళ్లజోళ్లు కూడా ఈ నెలాఖరు నాటికి ఇవ్వబోతున్నామని సీఎం వెల్లడించారు. 2,621 మంది పిల్లలకు ఆపరేషన్లు అవసరమని తేలిందన్న ఆయన.. వారికి కూడా స్కూళ్లు తెరిచాక, సెలవులు వచ్చినప్పుడు ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు. ఇది తన మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన అంశమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
కలెక్టర్లకు దిశానిర్దేశం..
ఇప్పుడు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లు ఆరోగ్యశ్రీ పథకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఎటువంటి సమస్యలు లేకుండా ఈ పథకం ద్వారా 2,200 వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ నిర్దేశించారు.
కరోనాపై ప్రత్యేక డ్రైవ్
రాష్ట్రాల సరిహద్దులు తెరుస్తున్నారని, అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని, అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? అన్న దానిపై ప్రజలందరికీ తెలిసేలా కలెక్టర్లు ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్దేశించారు. అలాగే, తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు.. ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజెస్, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి ఇంకా బాగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున్‌తో పాటు, జిల్లాల నుంచి కలెక్టర్లు పలువురు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 87 చికిత్సలు
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సలను చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వం హయాంలో 1,059 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం ఆ సంఖ్యను భారీగా పెంచింది.
► తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన 2,059 చికిత్సలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
► ఆ తర్వాత మరో 54 క్యాన్సర్ చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చారు. తాజాగా 87 చికిత్సలను తెస్తూ జీవో ఇచ్చారు. దీంతో మొత్తం చికిత్సల సంఖ్య 2,200కు చేరింది. ఈ చికిత్సలు పశ్చిమగోదావరితో పాటు జూలై 16 నుంచి మరో ఆరు జిల్లాల్లో (విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు,
వైఎస్సార్) జిల్లాల్లో అమల్లోకి వచ్చాయి.
► తాజాగా అనుమతి ఇచ్చిన 87 చికిత్సల్లో 53 ఇన్‌పేషెంటు చికిత్సలు, 29 స్వల్పకాలిక చికిత్సలు, మరో 5 డే కేర్ (ఔట్‌పేషెంటు తరహా) సేవలు ఉన్నాయి.
► వీటిలో యూరినరీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సర్జరీ, కంటి చికిత్సలు, ఈఎన్‌టీ సమస్యలు, జనరల్ సర్జరీ వంటివి ఉన్నాయి.
► కనిష్టంగా రూ. 1,000 నుంచి రూ. 45 వేల వరకూ ఈ చికిత్సలకు వ్యయమవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
► పశ్చిమగోదావరి జిల్లాలో పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించి ఆరోగ్యశ్రీ సీఈవో నివేదిక ఇచ్చారని, ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment