ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | CM Ys Jagan Meeting With Sujatha Rao Committee Key Points | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం

Published Wed, Sep 18 2019 4:49 PM | Last Updated on Wed, Sep 18 2019 7:27 PM

CM Ys Jagan Meeting With Sujatha Rao Committee Key Points - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించి..ఆ మేరకు జీతాలు పెంచాల్సిందిగా సూచించిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వైద్యుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌కు.. నివేదికలోని అంశాలను సుజాతారావు వివరించారు. ఈ క్రమంలో కమిటీ చేసిన 100కు పైగా సిఫారసుల గురించి సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని పలు లోపాలను కూడా కమిటీ బయటపెట్టింది. ఈ క్రమంలో ఈ విషయాలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వృత్తివిద్యా కోర్సు ఏదైనా సరే.. చివరి ఏడాది వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలని.. అప్రెంటిస్‌ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలని పేర్కొన్నారు. చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలని..ఈ అంశంపై సూచనలు చేయాల్సిందిగా నిపుణుల కమిటీకి సూచించారు. ఆయన కొనసాగిస్తూ... ‘ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుంది. రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలి. బెడ్లు, దిండ్లు, బెడ్‌షీట్లు, బాత్‌రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడా మార్చాలి. ఫ్యాన్లు, లైట్లు అన్నీకూడా సరిగ్గా పనిచేయాలి. అవసరమైన చోట ఏసీలు ఏర్పాటు చేయాలి. ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రజల దృక్పథం మారుతుందని సంబంధిత అధికారులతో పేర్కొన్నారు.

సమీక్ష సమావేశంలో కొన్ని సీఎం జగన్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు 

  • హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు-నవంబర్‌ 1 నుంచి ప్రారంభం
  • డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం
  • ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు
  • జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజక్ట్‌ అమలు
  • మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు
  • వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
  • ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు
  • లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక
  • ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం
  • ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం
  • కాగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్‌ను  విస్తరించడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇక తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేల పెన్షన్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ  క్రమంలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికి కూడా నెలకు రూ. 5వేలు ఇవ్వాలని..ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలు

  • ఆరోగ్య రంగంలో ప్రభుత్వం దృక్పథం మారాలి
  • దీర్ఘకాలిక వ్యాధులపై దృషిపెట్టాలి
  • ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు పెద్దగా రావడంలేదు
  • జాతీయస్థాయితో పోలిస్తే చాలా తక్కవ మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు:
  • ఆరోగ్యరంగంలో బడ్జెట్‌ చాలా వరకు జీతాలకే సరిపోతుంది
  • పెద్దసంఖ్యలో ఉన్న సిబ్బంది సేవలను సమర్థవంతగా వాడుకోవాలి
  • ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలను కల్పించాలి
  • మందుల కొనుగోలు, వ్యాధినిర్దారణ పరీక్షలు ప్రజలకు భారంగా మారాయి
  • ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో స్పష్టత, బాధ్యత రెండూ లేవు
  • సరైన సమీక్ష, పర్యవేక్షణఉండడంలేదు
  • రోజువారీ పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి
  • ఒకరు చేసే పనిని ఇంకొకరు చేస్తున్నారు, డూప్లికేషన్‌ అధికంగా ఉంది
  • ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పాతబడ్డాయి
  • ఇది నాది అన్న భావన ఉండడం లేదు
  • పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి
  • వ్యాధి నిరోధకతపై దృష్టిపెట్టాలి
  • 30 శాతం మంది హృద్రోగ, క్యాన్సర్‌లాంటి వ్యాధుల అంశాలతో బాధపడుతున్నారు
  • మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి
  • ప్రతి 5వేలమందికి ఒక సబ్‌ సెంటర్‌ఉండాలి
  • ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి
  • ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలి
  • చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి
  • రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు
  • వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి
  • యూత్‌ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి
  • సబ్‌సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది
  • ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి
  • ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి
  • ఒక కౌన్సెలర్‌ లేదా సోషల్‌ వర్కర్‌ ఉండాలి
  • దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి
  • ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి
  • 2 బెడ్‌ ఐసీయూ సదుపాయం ఉండాలి
  • ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించాలి..వారి బేసిక్‌ శాలరీని పెంచాలి
  • ప్రభుత్వ డాక్టరుచేత ప్రైవేటు హాస్పటిల్‌లో ఆరోగ్య శ్రీ కేసు చేయిస్తే సీరియస్‌గా తీసుకుని, ఆ ఆస్పత్రిని జాబితా నుంచి తప్పించాలి
  • ప్రతి లక్ష జనాభాకు కమ్యూనిటీ హాస్పటల్‌ ఉండాలి
  • కచ్చితంగా ఫ్యామిలీ మెడిసిన్‌లో ఎండీ చేసిన వారి పర్యవేక్షణలో ఆస్పత్రి
  • సామాజిక ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేయడానికి సదుపాయాలు
  • ఆప్తమాలజీ, ఈఎన్‌టీ కేర్‌ స్పెషలిస్టులు ఉండాలి
  • అన్ని మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండాలి
  • టీచింగ్, నాన్‌ టీచింగ్‌ కేటగిరీలను వేర్వేరుగా చేయాలి
  • హెచ్‌ఆర్‌ బాధ్యతలనుంచి వైద్యులను తప్పించాలి
  • ఏడాదికి రెండు వారాలు హెచ్‌ఆర్‌లో శిక్షణ ఇవ్వాలి..ఖాళీలను భర్తీ చేయాలి
  • నర్సింగ్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి
  • మరిన్ని కాలేజీలను ఏర్పాటు చేయాలి
  • రాష్ట్రంలో నర్సింగ్‌ విద్య పటిష్టంగా లేదు
  • నర్స్‌ ప్రాక్టీషినర్స్‌కు ప్రత్యేక కేడర్‌ ఏర్పాటు చేయాలి
  • నర్సింగ్‌కు దేశవ్యాప్తంగా, విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది
  • ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలను, వసతులను పెంచాలి
  • జిల్లా ఆస్పత్రుల స్థాయిని 500 బెడ్లకు పెంచాలి
  • బోధనాసుపత్రుల్లో 2వేల బెడ్లవరకూ పెంచాలి
  • 30 మహిళా ఆరోగ్య కేంద్రాలను 500 బెడ్లతో ఏర్పాటు చేయాలి
  • ప్రసవాలకోసం, మహిళల ఆరోగ్యం కోసం ఈ కేంద్రాలను వినియోగించవచ్చు
  • డ్రగ్‌ రెగ్యులేటరీ కమిటీ ఉండాలి, దాన్ని బలోపేతం చేయాలి
  • కనీసం 150 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి
  • ప్రతి మందుల దుకాణంలో అమ్ముతున్న మందుల కంప్యూటరీ కరణ ఉండాలి
  • ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందుకున్న రోగికి ఏ సేవలు అందాయన్నదానిపై ఒక రశీదు ఇవ్వాలి
  • ఎంత విలువైన వైద్యం ఉచితంగా అందిందన్న దానిపై ఆ రశీదులో పేర్కొనాలి 
  • వైద్యం మీద ప్రజల ప్రస్తుతం 62శాతం ఖర్చు చేస్తున్నారు దాన్ని 2025 నాటికి 30 శాతానికి తగ్గించాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement