సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రజలు ఎవరూ కూడా తమకు సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు చేయకూడదని, చేయి ఎత్తకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో జవాబుదారితనం, బాధ్యత ముఖ్యమని వ్యాఖ్యానించారు. సాంకేతికత వినియోగించడం కాదని, వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, సమీక్షించి ఆ మేరకు పర్యవేక్షణ చేయడమన్నది చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అలసత్వం జరక్కుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. (ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు)
‘పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలి. ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అందాలి. ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెన్షన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలి. మొదట వీటిపై దృష్టి పెట్టాలి. ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటిస్తా. అప్పుడు ఎవరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదు.
అలాగే లబ్ధిదారుల జాబితా, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన నంబర్ల జాబితా, ప్రకటించిన విధంగా నిర్ణీత కాలంలో అందే సేవల జాబితా, ఈ ఏడాదిలో అమలు చేయనున్న పథకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచాలి. మార్చి 2021 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సొంత భవనాల నిర్మాణం పూర్తి కావాలి. వాలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చినందున డిజిటిల్ పద్ధతుల్లో వారికి శిక్షణ ఇచ్చే ఆలోచన చేయాలి. వాలంటీర్లు వాటిని అవగాహన చేసుకున్నారా? లేదా? అన్నదానిపై ప్రశ్నావళి పంపాలి. అలాగే వైద్యశాఖలో పోస్టులు, గ్రామ,వార్డు సచివాలయాల్లో పోస్టులు అన్నీ కలిపి వాటికి ఒకేసారి షెడ్యూల్ ఇవ్వాలి. ’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం జగన్ గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ('పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు')
Comments
Please login to add a commentAdd a comment