సాక్షి, అమరావతి : ఇక నుంచి ఇసుకను ఇంటి వద్దకే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి 2 నుంచి కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయాలని, జనవరి 7 నుంచి ఉభయ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అమలు చేయాలని సూచించారు. ఇసుక పాలసీ అమలవుతున్న తీరు, డోర్ డెలివరీపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇసుక సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా సాగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.
రాష్ట్రంలోని 200 పైచిలుకు స్టాక్ యార్డులకు గాను.. 13 యార్డుల్లో బుకింగ్ ఓపెన్ చేసిన కాసేపట్లోనే ఇసుక అయిపోతోందని అధికారులు చెప్పగా.. సమీపంలోని యార్డుల్లో బుకింగ్‌కు అవకాశం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ మేరకు వెబ్‌సైట్‌లో మార్పులు, చేర్పులు చేయాలని, వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు. రవాణా ఛార్జీలు తగ్గుతాయనే కారణంతో చాలామంది ఆ 13 స్టాక్ యార్డుల నుంచే బుక్ చేస్తున్నారని, ఆ మేరకు ఇసుక లభ్యతను మరింత పెంచుతామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. సగటున రోజుకు 80 వేల టన్నుల ఇసుక విక్రయిస్తున్నామని, సెప్టెంబరు 5 నుంచి ఇంత వరకు 43.7 లక్షల టన్నుల ఇసుకను బుక్ చేసుకున్నారని, స్టాకు యార్డుల్లో 9.63 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు.
జనవరి 20 కల్లా చెక్‌పోస్టుల ఏర్పాటు పూర్తవ్వాలి
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున తవ్వి నిల్వ చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నాలుగు నెలల్లో నెలకు 15 లక్షల టన్నులు చొప్పున వర్షాకాలం అవసరాల కోసం రిజర్వ్ చేయాలని, 60 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసుకోవాలన్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేస్తున్న చెక్‌పోస్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వచ్చే నెల 20కల్లా చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఇసుక డోర్ డెలివరీ ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇప్పటికే 349 చెక్‌పోస్టుల ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పగా.. అక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ కమాండ్ కంట్రోల్ రూంకు అందుబాటులో ఉండాలన్నారు. మిగిలిన చెక్‌పోస్టులు వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇసుకను సరఫరా చేస్తున్న అన్ని వాహనాలకూ జీపీఎస్ పెట్టారా? లేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. 9,020 వాహనాలకు జీపీఎస్ అమర్చామని సమాధానమిచ్చారు.
సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
ఏపీఎండీసీ ద్వారా డోర్ డెలివరీ: మంత్రి పెద్దిరెడ్డి
రాష్ట్రంలో ఇసుకను ఎపీఎండీసీ ద్వారా డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక డోర్ డెలివరీపై సమీక్షా సమావేశంలోని నిర్ణయాలను సచివాలయంలో ఆయన మీడియాకు వివరించారు. టెక్నాలజీని వాడుకుని కొందరు మాత్రమే ఇసుకను బుక్ చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో వినియోగదారులకే నేరుగా ఇసుక అందించాలనే లక్ష్యంతో డోర్ డెలివరీని అమలు చేయబోతున్నట్లు తెలిపారు.
రవాణా చార్జీలతో కలిపి వినియోగదారుడి నుంచి ఇసుక రేటును ఏపీఎండీసీ వసూలు చేస్తుందని.. రవాణా కోసం అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఇసుకను అక్రమ ఆదాయంగా చూసిన చంద్రబాబు సర్కార్ విధానాలకు భిన్నంగా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయిస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ అక్రమాల వల్ల ఎన్జీటీ ఏకంగా రూ. 100 కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేశారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి ఇసుక విధానానికి రూపకల్పన చేశారని, కేంద్ర ప్రభుత్వ అధికారులను కూడా తీసుకువచ్చి ఈ విధానాన్ని వివరించనున్నట్ల తెలిపారు.
ఇసుక రవాణా చార్జీల వివరాలు
20 కిలోమీటర్ల లోపు దూరమైతే ప్రతి కిలోమీటర్‌కు టన్నుకు రూ.6.60 చొప్పున, 20 నుంచి 30 కిలోమీటర్ల లోపు కిలోమీటరుకు టన్నుకు రూ.6లు, 30 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు టన్నుకు రూ.4.90 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. డోర్ డెలివరీ విధానంలో ఏపీఎండీసీ నేరుగా వినియోగదారుల నుంచి ఈ రవాణా చార్జీలను వసూలు చేసి ఆ తర్వాత వాహన యజమానులకు చెల్లిస్తుంది. నగరాల్లో రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 గంటల వరకూ, మిగిలిన ప్రాంతాల్లో 24 గంటలపాటు ఇసుక డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment