Peddireddi Ramachandra Reddy
-
ఉచిత విద్యుత్‌పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ అమలుపై ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పైసా చెల్లించక్కర్లేదు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులైన రైతులెవరూ కరెంట్ బిల్లుల కోసం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నెలవారీ విద్యుత్ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, వారి ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు బిల్లులు చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆ డిస్కంలను డిమాండ్ చేసే హక్కు రైతులకు లభిస్తుందన్నారు. విద్యుత్ సంస్థలకు వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలను రైతులపైకి నెట్టేయకుండా నిరోధించేందుకు మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు. ఒక రైతుకు ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉండాలనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించదని స్పష్టం చేశారు. అనధికార, అధిక లోడ్ కనెక్షన్లు కూడా క్రమబద్దీకరిస్తామన్నారు. కౌలు రైతులకు కూడా దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. మీటర్ల ఏర్పాటుకు రైతులు అనుకూలం మీటర్ల ఏర్పాటు, నగదు బదిలీ పథకానికి అనుకూలంగా రాష్ట్రంలో లక్షలాదిమంది రైతులు(97 శాతం) ఇప్పటికే అంగీకార పత్రాలను అందజేశారని అధికారులు మంత్రికి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన నగదు బదిలీ పథకం విజయవంతమైందని, ఆ జిల్లాలో మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. ఈ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. 30 ఏళ్ల పాటు ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ప్రత్యేకంగా వ్యవసాయం కోసమే 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. సమీక్షలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీట్రాన్స్కో సీఎండీ శ్రీధర్ పాల్గొన్నారు. -
జనసేనకు ఝలక్.. వైఎస్సార్సీపీలో చేరిన మాదాసు గంగాధరం
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): ‘చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకూలంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇది నిజం కాదని ఒక్కమాట చెబితే ప్రకటన ఇద్దామని తాను గతంలో పవన్‌కు ఎన్నిసార్లు సూచించినా కనీసం పట్టించుకోలేదు.’ అని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాజీ చైర్మన్ గంగాధరం అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మాదాసు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప, తనకు తానుగా ఏమి చేసుకోలేరని విమర్శించారు. ఆయన్ను నమ్ముకుని కొంతమంది ఉద్యోగాలను కూడా వదులుకుని బయటకు వచ్చారన్నారు. కానీ వారిని నట్టేట ముంచాడన్నారు. నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌ను తప్పదోవ పట్టించేలా మాట్లాడుతూ బాస్‌కు జనం వస్తున్నారులే, గ్రామస్థాయిలో అవసరం లేదనే విధంగా చెప్పుకొచ్చేవారని గుర్తుచేశారు. పార్టీని బలోపేతం చేద్దామని గతంలో పవన్‌కు సూచించినా కనీసం పట్టించుకోలేదన్నారు. కొంతమంది రాసిన వాటిని పట్టుకుని ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు పవన్ చేయడం తనకు నచ్చలేదన్నారు. అందుకే కొద్దినెలలుగా జనసేనకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటా బాలినేని, పెద్దిరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గతంలోనే తనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని మాదాసు తెలిపారు. ఇప్పటికే తన కుమారుడు మాదాసు పవన్ వైఎస్సార్సీపీలో ఉన్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు ఏ బాధ్యత అప్పగించినా, ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. చదవండి: (నారాయణ చరిత్ర: ట్యూషన్ మాస్టర్‌గా మొదలై..) -
బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్: కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి.. బీజేపీకి అడ్రెస్ లేదు.. ఇలాంటి పార్టీలు ఏ అర్హతతో ఓట్లు అడుగుతాయి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అనే బేధం చూడకుండా సంక్షేమం అందిస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు కేటాయించాము. తాగునీటి సమస్య శాశ్విత పరిష్కరం కోసం బ్రహ్మం సాగర్ ద్వారా పనులు చేస్తున్నాం నియోజకవర్గ పరిధిలో ఐదు వేల ఇళ్లు ఇచ్చాం. నియోజకవర్గ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని పెద్దిరెడ్డి తెలిపారు. (చదవండి: టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే) ‘‘సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మా ముఖ్యమంత్రి సమపాళ్లతో అభివృద్ధి చేస్తున్నారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. 75 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చామని అంటున్నారు.. 75 కాదు లక్ష కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఇచ్చాం. అప్పులు ఎక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు, కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా నిలిచాము. నోబెల్ గ్రహీత అమర్థ్య సేన్ చెప్పినట్లు హెలికాప్టర్ మనీ ద్వారా కరోనా సంక్షోభంలో అందరిని ఆదుకున్నాం. కేంద్రం కంటే జీఎస్డీపీలో ముందున్నాం.. జీడీపీలో రాష్ట్రమే ముందుంది. (చదవండి: ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడడమా!) ‘‘ఎన్నికలు సాఫీగా జరుపుకోవాలని బీజేపీకి లేదు. దేవాలయాలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ పార్టీ దేవాదాయశాఖ మంత్రిగా ఉండి విజయవాడలో దేవాలయాలను విధ్వసం చేశారు. మాది సెక్యూలర్ పార్టీ.. మాకు కులాలు, మతాలు లేవు.. హిందు మతం అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది. అన్ని మతాలకు సమంగా చూస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మతమార్పిడిలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఓట్లు లేవు కాబట్టి ఎదో ఒక రచ్చ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజేపీ ప్రయత్నం. దానిలో భాగంగానే బీజేపీ నేత సునీల్ థియోదర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు’’ అని పెద్దిరెడ్డి విమర్శించారు. చదవండి: సమగ్ర భూ సర్వే అమలుకు మంత్రుల కమిటీ -
బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ పాల్గొన్నారు. ఉపఎన్నికల ప్రచారం, ప్రణాళికలపై బూతుస్థాయి నేతలతో సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోంది బద్వేలు ఎన్నికల్లో భారీ విజయం ఖాయమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోంది. నియోజకవర్గ పరిధిలోని అందరూ కలిసికట్టుగా కృషిచేసి భారీ మెజారిటీ అందించాలి. ఇప్పుడు వచ్చే మెజార్టీ రాబోయే ఎన్నికల్లో వచ్చే సీట్లను పెంచే స్థాయిలో ఉండాలి అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. -
సిలికా శాండ్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించండి
సాక్షి, అమరావతి: సిలికా శాండ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం గనుల శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి అవినీతికి తావు లేకుండా గనుల శాఖలో పారదర్శక విధానాలను తీసుకువచ్చామన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు, ఈ–పర్మిట్ విధానం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం గనుల లీజుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గత ఏడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఈ మేరకు అధికారులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఏపీఎండీసీ ద్వారా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులను ప్రారంభించామని, వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని అధికారులు తెలిపారు. సిలికా శాండ్, కాల్సైట్, ఐరన్ ఓర్, గ్రానైట్ ఖనిజాలను వెలికితీయడం ద్వారా రెవెన్యూ వనరులను పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఏపీఎండీసీ జీఎం (మైన్స్) కేదార్‌నాథ్‌రెడ్డి, జీఎం (కోల్) లక్ష్మణరావు, డీజీఎం నతానేయల్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర భూ సర్వే అమలుకు మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష (సమగ్ర భూ సర్వే) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యుటీ సీఎం (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్య కార్యదర్శిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వే మరింత ఉధృతంగా, సమర్థవంతంగా అమలు, పురోగతిపై మంత్రుల కమిటీ వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సర్వే పురోగతితో పాటు ఏమైనా సమస్యలుంటే సమీక్షించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రుల కమిటీకి అప్పగించారు. పురోగతితో పాటు తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
పట్టణాలకు దీటుగా పల్లెలు
సాక్షి, అమరావతి: పట్టణాలకు దీటుగా పల్లెల్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌లు ముందుండి పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8 నుంచి వంద రోజులపాటు చేపట్టే ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఆ రోజు ఈ స్వచ్ఛ సంకల్పం యజ్ఞాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక శంఖారావం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్‌కుమార్, జగనన్న స్వచ్ఛ సంకల్పం ఓఎస్డీ దుర్గాప్రసాద్‌లు తాడేపల్లి కమిషనర్ కార్యాలయం నుంచి పాల్గొనగా.. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆయా మండలంలో సర్పంచులందరూ ఈ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి గ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ తపిస్తున్నందున ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 పల్లెలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని పెద్దిరెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,371 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలని కోరారు. పరిశుభ్రతతో 95 శాతం అంటువ్యాధులు తగ్గాయి గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు 95 శాతం తగ్గినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని సర్పంచ్‌లకు సూచించారు. 11,412 మంది సర్పంచులకు చెక్ పవర్.. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 11,412 మంది సర్పంచులకు సోమవారం నాటికి చెక్ పవర్ బదలాయింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. మరో 1,680 మందికీ ఒకట్రెండు రోజులలోనే బదలాయించనున్నట్లు తెలిపారు. అలాగే, పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,704 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమచేశామన్నారు. మంచి ఫలితాలను సాధించిన సర్పంచ్‌లు, అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. కాగా, వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి సర్పంచ్ ఇందిరెడ్డి స్వాతి, కర్నూలు జిల్లా ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష, నెల్లూరు జిల్లా జమ్మలపాలెం సర్పంచ్ బి. శ్రీదేవి, ప్రకాశం జిల్లా జువ్వలేరు సర్పంచ్ ఎస్. సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. రీచ్‌ల నుంచే నేరుగా జగనన్న కాలనీలకు ఇసుక విజయవాడలో మంత్రి పెద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేరుగా రీచ్‌ల నుంచే జగనన్న కాలనీల్లో కడుతున్న ఇళ్ల వద్దకు ఇసుకను పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల రవాణా చార్జీలు తగ్గడంతోపాటు డిపోల నుంచి ఇసుకను తీసుకెళ్లే హ్యాండ్లింగ్ చార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. లేనిపక్షంలో వీటిని ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. కడుతున్న ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాగా, వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. నెలాఖరులోపు ఈ సీజన్‌కు అవసరమైన ఇసుకను సిద్ధం చేస్తామన్నారు. -
అక్రమ లే అవుట్లపై విజిలెన్స్
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో అనుమతుల్లేకుండా వెలుస్తున్న లే అవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డివిజన్, జిల్లా స్థాయిలో విజిలెన్స్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసింది. కొన్నేళ్లుగా నగరాలు, పట్టణాలకు చుట్టుపక్కల గ్రామ పంచాయతీల పరిధిలోను, మండల కేంద్రాలు, హైవేల పక్కన గ్రామాల్లోను కొందరు వ్యాపారులు అక్రమ లే అవుట్లు వేశారు. వీటివల్ల ఆయా పంచాయతీలు ఆదాయాన్ని కోల్పోతుండడంతో పాటు ఈ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్నవారు తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అనుమతుల్లేని లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలిచ్చేందుకు నిరాకరిస్తుండడంతో చాలామంది మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నట్టు ప్రభుత్వానికి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతుల్లేని లే అవుట్లు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోను లే అవుట్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం జగన్మోహన్రెడ్డి అనుమతితో అనధికారిక లే అవుట్ల క్రమబద్దీకరణకు ఎల్ఆర్ఎస్ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో చాలాచోట్ల పంచాయతీలు.. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్నాయని, లే అవుట్లకు అనుమతుల సందర్భంగా వస్తున్న ఫీజులో సగం పంచాయతీలకు రావాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు మునిసిపాలిటీ అధికారులతో మాట్లాడి రావాల్సిన డెవలప్మెంట్ ఫీజులను పంచాయతీరాజ్‌శాఖ వసూలు చేయాలని సూచించారు. అక్రమ లే అవుట్ల నియంత్రణకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో ప్రత్యేకంగా విజిలెన్స్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఈవోపీఆర్డీతో సహా ముగ్గురితో, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈవో, డీపీవో, జిల్లా టౌన్‌ప్లానింగ్ అధికారితో కూడిన విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. 2015 నాటికే 6,098 అక్రమ లే అవుట్లు.. 2015 నాటికే గ్రామీణ ప్రాంతాల్లో 6,098 అక్రమ లే అవుట్లు ఉన్నట్టు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. తర్వాత కొత్తగా వెలిసిన వాటితో కలిపి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయన్నది విజిలెన్స్ బృందాలు గుర్తిస్తాయని చెప్పారు. ఈ అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ ద్వారానే గ్రామ పంచాయతీలకు రూ.వందల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పాల్గొన్నారు. విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే లే అవుట్లపై విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జిల్లా అధికారులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు. డివిజన్, జిల్లా స్థాయి బృందాలు ఇప్పటికే ఉన్న అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇకమీదట పంచాయతీల్లో అక్రమ లే అవుట్లు ఏర్పాటు కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ లే అవుట్లు గుర్తించినచోట ఆ విషయాన్ని స్థానిక ప్రజలందరికీ తెలిసేలా గ్రామంలో దండోరా వేయించాలని సూచించారు. ప్రతినెలా విజిలెన్స్ బృందాలు సమావేశం కావాలని నిర్దేశించారు. -
ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడడమా!
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అన్నమయ్య సర్కిల్: ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రశాంతంగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని, దొంగ ఓట్ల పేరుతో డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి అపార ప్రజామద్దతు ఉందని, ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరమే తమకు లేదని స్పష్టం చేశారు. తిరుపతికి వచ్చే భక్తులను, పర్యాటకులను దొంగ ఓటర్లనడం దుర్మార్గమన్నారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను మా పార్టీ నుంచి తీసుకొని వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని, అలాంటిది మమ్మల్ని అప్రజాస్వామ్యులనడం విడ్డూరమని, ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు లేదని దుయ్యబట్టారు. ‘తిరుపతిలో 1980 డిసెంబర్ 13న మేం గృహప్రవేశం చేశాం. పీయూసీ నుంచే నేను ఇక్కడే ఉన్నా. స్థానికుడిని. చంద్రబాబుకే ఇక్కడ సొంతిల్లు లేదు. చంద్రబాబు, లోకేశ్ నన్నెలా ప్రశ్నిస్తారు? బస్సుల్లో వెళ్లే భక్తులను చంద్రబాబు అనుకూల మీడియాతో కలసి టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలకు దిగారు. రాజకీయ లబ్ధికోసం వైఎస్సార్సీపీపై అభాండాలు వేస్తున్నారు’ అని పెద్దిరెడ్డి మండిపడ్డారు. దొంగ ఓట్ల సంస్కృతి చంద్రబాబుదే: నారాయణస్వామి చంద్రబాబుదే దొంగ ఓట్ల సంస్కృతి అని, వ్యవస్థలను, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చరిత్ర కూడా ఆయనదేనని డీప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. బెంగళూరు, కుప్పం పరిసర ప్రాంతాల్లో సుమారు 40 వేలకుపైగా దొంగ ఓట్లతో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నారని, ఇక ఆ ఆటలు సాగవని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా కుప్పంలో భారీ ఓటమి చవిచూశారని, అప్పటినుంచి మంత్రి పెద్దిరెడ్డి అంటే చంద్రబాబు కలవరపాటుకు గురవుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా ఇంతవరకు జరగని విధంగా నీతి, నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుపతి ఉప ఎన్నిక జరిగిందన్నారు. ఓటమికి భయపడే చిల్లర డ్రామాలు: మిథున్‌రెడ్డి టీడీపీ నాయకులు ఓటమికి భయపడే వైఎస్సార్సీపీపై నిందలేస్తూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. శనివారం పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక టీడీపీ నాయకులు చంద్రబాబు డైరెక్షన్లో డ్రామాలు ఆడుతున్నారన్నారు. పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఐదువేల మంది దొంగ ఓటర్లు ఉన్నారని, మూసివేసిన గేట్ల ముందు చంద్రబాబు అనుకూల మీడియాతో ఆందోళన చేయించడం దారుణమన్నారు. పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఐదుగురు కూడా లేరన్న విషయాన్ని ఆయన మీడియా సాక్షిగా కళ్లకు కట్టారు. తిరుపతి యాత్రికుల స్థలమని, వేలాదిమంది భక్తులు వచ్చిపోతుంటారని, టీడీపీ నాయకులు బస్సుల్లోకి ఎక్కి మహిళలను, వృద్ధులను అవమానిస్తూ దొంగ ఓట్లు వేయడానికి వచ్చారా? అంటూ ప్రశ్నించడం సబబు కాదని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. -
తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండమే
తిరుపతి అన్నమయ్య సర్కిల్ (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామాకు సిద్ధమని, టీడీపీ ఓడితే ఎంపీ రఘురామకృష్ణరాజుతో సహా టీడీపీ ఎంపీలు ముగ్గురూ రాజీనామాకు సిద్ధమేనా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం వైఎస్ జగన్ ప్రచారసభ రద్దయిందని తెలిపారు. జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ఆదివారం తిరుపతిలో ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ఉనికి చాటుకునేందుకు ఆలయాలపై దాడులు చేసి, రోడ్లపైకి వచ్చి అరాచకాలు సృష్టిస్తూ ప్రభుత్వంపై నిందలు మోపడం హేయమైనచర్య అని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని, అందుకే శ్రీవారి సాక్షిగా మోదీ చెప్పిన ప్రత్యేక హోదా హామీపై వారు స్పందించలేదని చెప్పారు. పవన్‌కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా మారారని, అందుకే పాచిపోయిన లడ్డూలు తాజాగా మారాయని విమర్శించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలపై విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీచేసే సంస్కృతి లేదని, అందుకే ఎన్నికలొస్తే పొత్తు గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ పథకాలను అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రతి ఇంటికీ అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి తానే స్వయంగా పోస్టు ద్వారా ప్రజలకు లేఖలు పంపారని తెలిపారు. ఓటర్లు 90 శాతం పోలింగ్ నమోదు చేసేందుకు సహకరించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు రెడ్డెప్ప, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బాబురావు, పార్టీ నాయకులు పోకల అశోక్‌కుమార్, ఎంఆర్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టూరిజం కంట్రోల్ రూమ్‌లు ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా నదీతీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. శుక్రవారం రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించారు. నదీతీర ప్రాంతాలైన శింగనపల్లి ( పశ్చిమ గోదావరి), గండి పోచమ్మ (తూర్పు గోదావరి), పేరంటాలపల్లి( పశ్చిమ గోదావరి), పోచవరం( పశ్చిమ గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), రుషికొండ ( విశాఖపట్నం), నాగార్జునసాగర్( గుంటూరు), శ్రీశైలం( కర్నూలు), బెర్మ్ పార్క్ (విజయవాడ)లలో టూరిజమ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కంట్రోల్ రూమ్స్ వద్దనున్న కలెక్టర్లను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చదవండి: రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు ఈ సందర్భంగా విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ పీసీ మాట్లాడుతూ.. రుషికొండ వద్ద పర్యాటకుల బోటింగ్‌లపై నిరంత పర్యవేక్షణకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూమ్‌లో టికెట్ కౌంటర్, కంప్యూటీకరణ ద్వారా ఆపరేషన్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వైర్ లెస్, ప్రమాదాల నివారణ, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. నదిలోకి వెళ్లే ప్రతి బోటు యొక్క ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్ ద్వారా నియంత్రించబడతాయి. ఇకనుంచి పర్యాటకులకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. రుషికొండ కంట్రోల్ రూమ్‌లో వివిధ శాఖలకి చెందిన ఆరుగురు అధికారులని నియమించాం' అని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. చదవండి: కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు -
జనవరి 2 నుంచి.. ఇంటికే ఇసుక
సాక్షి, అమరావతి : ఇక నుంచి ఇసుకను ఇంటి వద్దకే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి 2 నుంచి కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయాలని, జనవరి 7 నుంచి ఉభయ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అమలు చేయాలని సూచించారు. ఇసుక పాలసీ అమలవుతున్న తీరు, డోర్ డెలివరీపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇసుక సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా సాగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలోని 200 పైచిలుకు స్టాక్ యార్డులకు గాను.. 13 యార్డుల్లో బుకింగ్ ఓపెన్ చేసిన కాసేపట్లోనే ఇసుక అయిపోతోందని అధికారులు చెప్పగా.. సమీపంలోని యార్డుల్లో బుకింగ్‌కు అవకాశం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ మేరకు వెబ్సైట్లో మార్పులు, చేర్పులు చేయాలని, వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు. రవాణా ఛార్జీలు తగ్గుతాయనే కారణంతో చాలామంది ఆ 13 స్టాక్ యార్డుల నుంచే బుక్ చేస్తున్నారని, ఆ మేరకు ఇసుక లభ్యతను మరింత పెంచుతామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. సగటున రోజుకు 80 వేల టన్నుల ఇసుక విక్రయిస్తున్నామని, సెప్టెంబరు 5 నుంచి ఇంత వరకు 43.7 లక్షల టన్నుల ఇసుకను బుక్ చేసుకున్నారని, స్టాకు యార్డుల్లో 9.63 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు. జనవరి 20 కల్లా చెక్‌పోస్టుల ఏర్పాటు పూర్తవ్వాలి వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున తవ్వి నిల్వ చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నాలుగు నెలల్లో నెలకు 15 లక్షల టన్నులు చొప్పున వర్షాకాలం అవసరాల కోసం రిజర్వ్ చేయాలని, 60 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసుకోవాలన్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేస్తున్న చెక్పోస్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వచ్చే నెల 20కల్లా చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఇసుక డోర్ డెలివరీ ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇప్పటికే 349 చెక్‌పోస్టుల ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పగా.. అక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ కమాండ్ కంట్రోల్ రూంకు అందుబాటులో ఉండాలన్నారు. మిగిలిన చెక్‌పోస్టులు వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇసుకను సరఫరా చేస్తున్న అన్ని వాహనాలకూ జీపీఎస్ పెట్టారా? లేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. 9,020 వాహనాలకు జీపీఎస్ అమర్చామని సమాధానమిచ్చారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఏపీఎండీసీ ద్వారా డోర్ డెలివరీ: మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో ఇసుకను ఎపీఎండీసీ ద్వారా డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక డోర్ డెలివరీపై సమీక్షా సమావేశంలోని నిర్ణయాలను సచివాలయంలో ఆయన మీడియాకు వివరించారు. టెక్నాలజీని వాడుకుని కొందరు మాత్రమే ఇసుకను బుక్ చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో వినియోగదారులకే నేరుగా ఇసుక అందించాలనే లక్ష్యంతో డోర్ డెలివరీని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. రవాణా చార్జీలతో కలిపి వినియోగదారుడి నుంచి ఇసుక రేటును ఏపీఎండీసీ వసూలు చేస్తుందని.. రవాణా కోసం అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఇసుకను అక్రమ ఆదాయంగా చూసిన చంద్రబాబు సర్కార్ విధానాలకు భిన్నంగా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయిస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ అక్రమాల వల్ల ఎన్జీటీ ఏకంగా రూ. 100 కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేశారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి ఇసుక విధానానికి రూపకల్పన చేశారని, కేంద్ర ప్రభుత్వ అధికారులను కూడా తీసుకువచ్చి ఈ విధానాన్ని వివరించనున్నట్ల తెలిపారు. ఇసుక రవాణా చార్జీల వివరాలు 20 కిలోమీటర్ల లోపు దూరమైతే ప్రతి కిలోమీటర్‌కు టన్నుకు రూ.6.60 చొప్పున, 20 నుంచి 30 కిలోమీటర్ల లోపు కిలోమీటరుకు టన్నుకు రూ.6లు, 30 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు టన్నుకు రూ.4.90 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. డోర్ డెలివరీ విధానంలో ఏపీఎండీసీ నేరుగా వినియోగదారుల నుంచి ఈ రవాణా చార్జీలను వసూలు చేసి ఆ తర్వాత వాహన యజమానులకు చెల్లిస్తుంది. నగరాల్లో రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 గంటల వరకూ, మిగిలిన ప్రాంతాల్లో 24 గంటలపాటు ఇసుక డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆర్థిక మాంద్యం లేదు
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాదిరే మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఆదాయం కొంత మేర తగ్గింది తప్పితే, ఆర్థిక మాంద్యం (రెసిషన్) వంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో మంత్రి జవాబిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాదిలో కేవలం 8 శాతం మాత్రమే ప్రభుత్వ ఆదాయం తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగని కారణంగా కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు నిలిచిపోయాయని, ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెవెన్యూ లోటు రూపంలో కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఆదాయం తగ్గిందని చెప్పారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయంలో మాత్రం గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆ కాలానికి కేవలం నాలుగు శాతం మాత్రమే తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వానికి దాదాపు రూ. 60 వేల కోట్ల బిల్లుల బకాయిలు పెట్టిపోయిందని చెప్పారు. ఈ ఆరు నెలల్లో తమ ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల బకాయిలు చెల్లించిందని చెప్పారు. రాష్ట్ర కాగా, తమ సూచనలు వినాలని నాలెల్జ్ తెచ్చుకోవాలని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన మండిపడ్డారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల గురించి అప్పటి విపక్ష సభ్యులు అప్పటి సీఎంను కలిస్తే, తమ పార్టీ వాళ్లు కాదని, నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారని తెలిపారు. రంగులపై మీరా విమర్శించేది?: పెద్దిరెడ్డి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్మశానం గోడలకూ ఆ పార్టీ రంగులు వేయించిందని.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు సచివాలయ భవనాల రంగులపై తమ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు జాతీయ జెండాకు ఎక్కడా వైఎస్సార్సీపీ రంగు వేయలేదని వివరించారు. సర్పంచుల ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని, సచివాలయ భవనాలలోనూ సర్పంచికి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. మార్చిలోగా ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు: అంజాద్ బాషా అర్హత గల ఇమామ్‌లు, మౌజన్లకు వచ్చే ఏడాది మార్చిలోగా ఇళ్ల స్థలాలను కేటాయించి, రిజిస్టర్ చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా శాసనమండలిలో చెప్పారు. రాష్ట్రంలో సుమారు 9,000 మంది ఇమామ్‌లు, మౌజన్లు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో కొత్తగా హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం రెండు మూడు స్థలాలు పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. -
‘హోదా’ బతికుందంటే వైఎస్ జగనే కారణం
సాక్షి, విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఇంకా బతికుందంటే అందుకు కారణం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషేనని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచీ పోరాడుతున్నామని.. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పారని విమర్శించారు. హోదా కోసం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతలు అలుపెరగని పోరాటం చేస్తుండటంతో వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు హోదా కావాలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాం కానీ, అన్నాడీఎంకే ఎంపీలతో సభ సజావుగా జరగకుండా చేశారని మండిపడ్డారు. సమావేశాలు ముగియడంతో మా ఎంపీలు రాజీనామాలు చేయడంతో పాటు ఆమరణ దీక్ష చేశారు. చంద్రబాబు మాత్రం రాజీనామాల మాట ఎత్తకుండా డ్రామాలాడారంటూ పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. నాలుగేళ్ల నుంచి హోదా కోసం పోరాడుతున్నామని, వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి వస్తున్న మద్దతును చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వైఎస్సార్సీపీ నేత కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు అఖిలపక్షాన్ని పిలిస్తేనే ఏ పక్షం రాలేదని ఎద్దేవా చేశారు. హోదా సంజీవని కాదంటూ ప్యాకేజీని చంద్రబాబు ఒప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు జంతర్ మంతర్ లేదా ప్రధాని మోదీ నివాసం వద్ద దీక్ష చేయాలని సూచించారు. -
42 సమస్యలు చర్చించడానికి 13 రోజులా?
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, అమరావతి: ‘మొత్తం 42 సమస్య లున్నాయి. ఈ సమస్యలు చర్చించేందుకు కనీసం నెలరోజుల సమయం పడుతుంది. అందుకే మరో పదిరోజులు సమయం ఇవ్వాల్సిందిగా పదేపదే కోరాం. అందుకు శాసనసభ వ్యవహారాలమంత్రి యనమల రామకృష్ణుడు ఒప్పుకోలేదు. ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వం మాట్లాడిన మాటలుగానే భావించాల్సి ఉంటుంది’ అని పుంగనూరు, రాయచోటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం బీఏసీ సమావేశం ముగిసిన తరువాత వారు వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అనేక సమస్యలున్నాయి.. మాట్లాడాలని చెబితే మాకు ఇంతకంటే సమస్యలున్నాయని నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. 42 అంశాలపై చర్చించే ధైర్యం మీకుంటే సభను మరో 20 రోజులు పెంచి జరిపించాలి అని సూచించారు. ప్రభుత్వంలో అవినీతి ఉందనటానికి ఓటుకు కోట్లు కేసే ఉదాహరణ అని పేర్కొన్నారు. తప్పులు చేయలేదనుకున్నప్పుడు కోర్టుకు వెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారో సమాధానం చెప్పాలని వారు నిలదీశారు. -
తాత్కాలికానికి ఇంత దుబారా?
⇒ రూ.220 కోట్ల అంచనాల సచివాలయానికి రూ. 1,200 కోట్లు ఖర్చు పెట్టారు ⇒ అసెంబ్లీ నిర్మాణ పనులు పరిశీలించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: తాత్కాలిక సచివాలయం అంటూనే వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి రూ. 220 కోట్ల అంచనాలతో మొదలుపెట్టి ఇప్పటికి రూ.1,200 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బూడి ముత్యాలనాయుడు బృందం మంగళవారం సచివాలయంలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ, శాసన మండలి హాలును పరిశీలించారు. అనంతరం పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించి రావాలన్న తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో తాము వచ్చినట్టు చెప్పారు. తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మా ణానికి రూ. 1,200 కోట్లు ఎలా ఖర్చు పెట్టా రని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో విపక్ష నాయకుడికి కనీసం పేషీ కూడా కేటాయించ లేదని విమర్శించారు. ఈ విషయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ సీఎం చంద్రబాబు పునరాలోచించాలన్నారు. ‘హైదరాబాద్‌లో బాబుకు ఖరీదైన ఇల్లు’ ఇక్కడ అక్రమ నిర్మాణంలో ఉంటున్న బాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వందల కోట్లు పెట్టి సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారని ఆర్కే చెప్పారు. విపక్ష నేత వైఎస్ జగన్ నెలలో 20 రోజులకు పైగా రాష్ట్ర ప్రజల మధ్య గడుపుతున్నారని ఆర్కే వివరించారు. విజయవాడలో బృందాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్ కలిశారు. కాగా విపక్ష ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. వారి కదలికలను వీడియో తీసింది. -
' పల్లె బాట' ను ప్రారంభించిన పెద్దిరెడ్డి
చిత్తూరు: గ్రామ సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన పల్లె బాట కార్యక్రమాన్ని పుంగునూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. జిల్లాలోని సోదుం మండలంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రజల కష్టసుఖాలను దగ్గరగా తెలుసుకోవడానికి వీలుంటుందని వైఎస్సార్సీసీ నాయకులు తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా 16 పంచాయతీల్లోని 40 గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. (సోదుం) -
పేదలకు అన్యాయం చేస్తే పతనమే
సోమల: పేదలకు అన్యాయం చేస్తే వారి ఉసురు తగిలి ప్రభుత్వాలు పతనం కాక తప్పదని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని సోమల, ఇరికిపెంట, నెల్లిమంద పంచాయతీల్లో పర్యటించారు. గ్రామాల్లో ప్రజలతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. సోమల గ్రామస్తులతో మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబునాయుడు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఇప్పుడు వాటి అమలు గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. పేదల సంక్షేమం కోసం దివంగత సీఎం వైఎస్.రాజశేఖరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు నీరు గారుస్తున్నారని తెలిపారు. రాజకీయ కక్షల నేపథ్యంలో మండలంలో వెయ్యి మందికి పైగా వృద్ధులకు, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు పింఛన్లు రద్దు చేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వందలాది మందికి ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి, జిల్లాలోని పడమటి మండలాలను సస్యశ్యామలం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు ద్వారకనాథరెడ్డి, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి దుర్గారాజారెడ్డి, మండలాధ్యక్షుడు గంగాధరం రాయల్, మహిళాధ్యక్షురాలు ఝాన్సీలక్ష్మి, రైతు విభాగం అధ్యక్షుడు వెంకటప్పనాయుడు, యూత్ విభాగం అధ్యక్షుడు కుమార్‌రాజా, మైనారిటీ విభాగం అధ్యక్షుడు బాషా, షాహీద్ పాల్గొన్నారు.