మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పక్కన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అన్నమయ్య సర్కిల్: ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రశాంతంగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని, దొంగ ఓట్ల పేరుతో డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకి అపార ప్రజామద్దతు ఉందని, ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరమే తమకు లేదని స్పష్టం చేశారు. తిరుపతికి వచ్చే భక్తులను, పర్యాటకులను దొంగ ఓటర్లనడం దుర్మార్గమన్నారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను మా పార్టీ నుంచి తీసుకొని వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని, అలాంటిది మమ్మల్ని అప్రజాస్వామ్యులనడం విడ్డూరమని, ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు లేదని దుయ్యబట్టారు. ‘తిరుపతిలో 1980 డిసెంబర్ 13న మేం గృహప్రవేశం చేశాం. పీయూసీ నుంచే నేను ఇక్కడే ఉన్నా. స్థానికుడిని. చంద్రబాబుకే ఇక్కడ సొంతిల్లు లేదు. చంద్రబాబు, లోకేశ్ నన్నెలా ప్రశ్నిస్తారు? బస్సుల్లో వెళ్లే భక్తులను చంద్రబాబు అనుకూల మీడియాతో కలసి టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలకు దిగారు. రాజకీయ లబ్ధికోసం వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేస్తున్నారు’ అని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
దొంగ ఓట్ల సంస్కృతి చంద్రబాబుదే: నారాయణస్వామి
చంద్రబాబుదే దొంగ ఓట్ల సంస్కృతి అని, వ్యవస్థలను, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చరిత్ర కూడా ఆయనదేనని డీప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. బెంగళూరు, కుప్పం పరిసర ప్రాంతాల్లో సుమారు 40 వేలకుపైగా దొంగ ఓట్లతో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నారని, ఇక ఆ ఆటలు సాగవని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా కుప్పంలో భారీ ఓటమి చవిచూశారని, అప్పటినుంచి మంత్రి పెద్దిరెడ్డి అంటే చంద్రబాబు కలవరపాటుకు గురవుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా ఇంతవరకు జరగని విధంగా నీతి, నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుపతి ఉప ఎన్నిక జరిగిందన్నారు.
ఓటమికి భయపడే చిల్లర డ్రామాలు: మిథున్‌రెడ్డి
టీడీపీ నాయకులు ఓటమికి భయపడే వైఎస్సార్‌సీపీపై నిందలేస్తూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. శనివారం పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక టీడీపీ నాయకులు చంద్రబాబు డైరెక్షన్‌లో డ్రామాలు ఆడుతున్నారన్నారు. పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఐదువేల మంది దొంగ ఓటర్లు ఉన్నారని, మూసివేసిన గేట్ల ముందు చంద్రబాబు అనుకూల మీడియాతో ఆందోళన చేయించడం దారుణమన్నారు. పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఐదుగురు కూడా లేరన్న విషయాన్ని ఆయన మీడియా సాక్షిగా కళ్లకు కట్టారు. తిరుపతి యాత్రికుల స్థలమని, వేలాదిమంది భక్తులు వచ్చిపోతుంటారని, టీడీపీ నాయకులు బస్సుల్లోకి ఎక్కి మహిళలను, వృద్ధులను అవమానిస్తూ దొంగ ఓట్లు వేయడానికి వచ్చారా? అంటూ ప్రశ్నించడం సబబు కాదని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment