సాక్షి, విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఇంకా బతికుందంటే అందుకు కారణం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కృషేనని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచీ పోరాడుతున్నామని.. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పారని విమర్శించారు. హోదా కోసం వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు అలుపెరగని పోరాటం చేస్తుండటంతో వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు హోదా కావాలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాం కానీ, అన్నాడీఎంకే ఎంపీలతో సభ సజావుగా జరగకుండా చేశారని మండిపడ్డారు. సమావేశాలు ముగియడంతో మా ఎంపీలు రాజీనామాలు చేయడంతో పాటు ఆమరణ దీక్ష చేశారు. చంద్రబాబు మాత్రం రాజీనామాల మాట ఎత్తకుండా డ్రామాలాడారంటూ పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.
నాలుగేళ్ల నుంచి హోదా కోసం పోరాడుతున్నామని, వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి వస్తున్న మద్దతును చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ నేత కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు అఖిలపక్షాన్ని పిలిస్తేనే ఏ పక్షం రాలేదని ఎద్దేవా చేశారు. హోదా సంజీవని కాదంటూ ప్యాకేజీని చంద్రబాబు ఒప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు జంతర్ మంతర్ లేదా ప్రధాని మోదీ నివాసం వద్ద దీక్ష చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment