పేదలకు అన్యాయం చేస్తే పతనమే
సోమల: పేదలకు అన్యాయం చేస్తే వారి ఉసురు తగిలి ప్రభుత్వాలు పతనం కాక తప్పదని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని సోమల, ఇరికిపెంట, నెల్లిమంద పంచాయతీల్లో పర్యటించారు. గ్రామాల్లో ప్రజలతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. సోమల గ్రామస్తులతో మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబునాయుడు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఇప్పుడు వాటి అమలు గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. పేదల సంక్షేమం కోసం దివంగత సీఎం వైఎస్.రాజశేఖరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు నీరు గారుస్తున్నారని తెలిపారు.
రాజకీయ కక్షల నేపథ్యంలో మండలంలో వెయ్యి మందికి పైగా వృద్ధులకు, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు పింఛన్లు రద్దు చేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వందలాది మందికి ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి, జిల్లాలోని పడమటి మండలాలను సస్యశ్యామలం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు ద్వారకనాథరెడ్డి, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి దుర్గారాజారెడ్డి, మండలాధ్యక్షుడు గంగాధరం రాయల్, మహిళాధ్యక్షురాలు ఝాన్సీలక్ష్మి, రైతు విభాగం అధ్యక్షుడు వెంకటప్పనాయుడు, యూత్ విభాగం అధ్యక్షుడు కుమార్‌రాజా, మైనారిటీ విభాగం అధ్యక్షుడు బాషా, షాహీద్ పాల్గొన్నారు.