ఉచిత విద్యుత్‌పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు | Peddireddy Ramachandra Reddy appeal to farmers | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు

Published Mon, Aug 8 2022 4:07 AM | Last Updated on Mon, Aug 8 2022 2:43 PM

Peddireddy Ramachandra Reddy appeal to farmers - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్‌ అమలుపై ఆదివారం విద్యుత్‌ శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఏ చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. 

పైసా చెల్లించక్కర్లేదు 
ఉచిత విద్యుత్‌ పథకంలో లబ్ధిదారులైన రైతులెవరూ కరెంట్‌ బిల్లుల కోసం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నెలవారీ విద్యుత్‌ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, వారి ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు బిల్లులు చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ఆ డిస్కంలను డిమాండ్‌ చేసే హక్కు రైతులకు లభిస్తుందన్నారు.

విద్యుత్‌ సంస్థలకు వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలను రైతులపైకి నెట్టేయకుండా నిరోధించేందుకు మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు. ఒక రైతుకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఉండాలనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించదని స్పష్టం చేశారు. అనధికార, అధిక లోడ్‌ కనెక్షన్లు కూడా క్రమబద్దీకరిస్తామన్నారు. కౌలు రైతులకు కూడా దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు.

మీటర్ల ఏర్పాటుకు రైతులు అనుకూలం
మీటర్ల ఏర్పాటు, నగదు బదిలీ పథకానికి అనుకూలంగా రాష్ట్రంలో లక్షలాదిమంది రైతులు(97 శాతం) ఇప్పటికే అంగీకార పత్రాలను అందజేశారని అధికారులు మంత్రికి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టిన నగదు బదిలీ పథకం విజయవంతమైందని, ఆ జిల్లాలో మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు.  

ఈ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. 30 ఏళ్ల పాటు ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ప్రత్యేకంగా వ్యవసాయం కోసమే 7 వేల మెగా వాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. సమీక్షలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీట్రాన్స్‌కో సీఎండీ  శ్రీధర్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement