మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, చిత్రంలో.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామాకు సిద్ధమని, టీడీపీ ఓడితే ఎంపీ రఘురామకృష్ణరాజుతో సహా టీడీపీ ఎంపీలు ముగ్గురూ రాజీనామాకు సిద్ధమేనా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం వైఎస్ జగన్ ప్రచారసభ రద్దయిందని తెలిపారు. జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ఆదివారం తిరుపతిలో ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ఉనికి చాటుకునేందుకు ఆలయాలపై దాడులు చేసి, రోడ్లపైకి వచ్చి అరాచకాలు సృష్టిస్తూ ప్రభుత్వంపై నిందలు మోపడం హేయమైనచర్య అని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని, అందుకే శ్రీవారి సాక్షిగా మోదీ చెప్పిన ప్రత్యేక హోదా హామీపై వారు స్పందించలేదని చెప్పారు. పవన్‌కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా మారారని, అందుకే పాచిపోయిన లడ్డూలు తాజాగా మారాయని విమర్శించారు.
విభజన హామీలు, ప్రత్యేక హోదా, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలపై విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీచేసే సంస్కృతి లేదని, అందుకే ఎన్నికలొస్తే పొత్తు గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ పథకాలను అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రతి ఇంటికీ అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి తానే స్వయంగా పోస్టు ద్వారా ప్రజలకు లేఖలు పంపారని తెలిపారు. ఓటర్లు 90 శాతం పోలింగ్ నమోదు చేసేందుకు సహకరించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు రెడ్డెప్ప, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బాబురావు, పార్టీ నాయకులు పోకల అశోక్‌కుమార్, ఎంఆర్‌సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment