సాక్షి, అమరావతి : తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. వెంటనే పూర్తి వివరాలు కనుక్కుని సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి.
తమ కుటుంబాన్ని వెలివేశారని, బడిలో కూడా తమతో ఎవరూ మాట్లాడటం లేదని పుష్ప లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో బడిలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు ఫోన్ చేసి విషయం గురించి ఆరా తీశారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి వివరాలు కనుక్కొని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment