భవిష్యత్తులో కూడా మేలు జరగాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Agricultural Marketing Intelligence | Sakshi
Sakshi News home page

మార్కెటింగ్‌ ఇంటిలిజెన్స్‌పై  సీఎం జగన్‌ సమీక్ష

Published Thu, Apr 23 2020 7:08 PM | Last Updated on Thu, Apr 23 2020 7:38 PM

CM YS Jagan Review Meeting On Agricultural Marketing Intelligence - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని మార్కెట్లను వికేంద్రీకరించామని.. వీటిని పూర్తిస్థాయిలో మ్యాపింగ్‌ చేసి.. భవిష్యత్తులో కూడా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన వ్యవసాయ మార్కెటింగ్‌ ఇంటిలిజెన్స్‌పై అధికారులతో సమీక్షించారు. రైతులను ఆదుకునే వినూత్న వ్యవస్థల కార్యాచరణ ప్రణాళికపై సీఎం చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాల్సిన పనులపై అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ప్రస్తుతం గుర్తించిన దుకాణాలకు భవిష్యత్తులో కూడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేస్తే.. ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులను ప్రజల ముంగిటకే తీసుకెళ్లడానికి కూడా ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు.
(పరీక్షల సంఖ్య క్రమంగా పెరగాలి: సీఎం జగన్‌)

కచ్చితంగా అలర్ట్‌ రావాల్సిందే..
ఎక్కడైనా రైతు పండించిన పంటకు సరైన ధర లభించలేదంటే.. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా కచ్చితంగా అలర్ట్‌ రావాలని.. అలా అలర్ట్‌ వచ్చే పరిస్థితి వెబ్‌సైట్‌ లో ఉండాలన్నారు. ప్రతిరోజూ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు నిరంతరం తమ గ్రామాల్లోని పంటలు, ఉత్పత్తులు, వాటి ధరలపై సమాచారాన్ని తమకు ఇచ్చిన ట్యాబ్‌ ద్వారా నిరంతరం యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సీఎం సూచించారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కంటైనర్‌ వాహనాన్ని ఉంచడం ద్వారా రైతుల ఉత్పత్తులను తరలించడానికి ఉపయోగపడుతుందని.. అలాగే ఏర్పాటు చేయదలుచుకున్న జనతా బజార్లకు కావాల్సిన నిత్యావసరాలు, వస్తువులను తీసుకురావడానికీ కూడా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల వద్దే  గ్రేడింగ్, ప్యాకేజీ చేసి.. ఇతర మార్కెటింగ్‌ వ్యవస్థల్లోకి, అలాగే జనతా బజార్లకూ తరలించవచ్చన్నారు. ఈ వ్యవస్థలన్నీకూడా సక్రమంగా నడపడానికి నిర్దిష్టమైన ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు.
(ఏపీ: స్కూల్‌ ఫీజు వసూలుపై కీలక ఆదేశాలు)

జూన్‌ 1 నాటికి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కావాలి..
‘‘అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి సమాచారం రాగానే 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ప్రోటోకాల్‌ తయారు చేసుకోవాలి. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు జూన్‌ 1 నాటికి ప్రారంభం కావాలి. అప్పటికి ఈ వ్యవస్థకూడా సజావుగా నడిచేలా చూడాలి. జనతాబజార్లు, గ్రామ స్థాయిలో కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, కంటైనర్‌ వాహనం, ఆర్బీకేలు, మార్కెటింగ్‌ యార్డుల్లో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సదుపాయాలు, కోల్డ్‌ స్టోరేజీలు,  గోదాములు, ఆక్వా ప్రాంతాల్లో ఇండివిడ్యువల్‌ క్విక్‌ ఫ్రీజింగ్‌ సదుపాయాలు ఏర్పాటు కావాలి. వీటిపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో దృష్టిపెట్టాలని’ ’ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

స్వయం సమృద్ధి సాధించాలి..
రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్‌ స్టోరేజీలు, గోదాముల అంశంలో స్వయం సమృద్ధి సాధించాలి. నిధులు ఎంతైనా ఒకసారి పెట్టి... వ్యవసాయరంగాన్ని పట్టాల మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేద్దామని సీఎం తెలిపారు. దీంతోపాటు ధరల స్థిరీకరణ నిధి రైతులకు అండగా నిలబడుతుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement