సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై ఫోకస్ పెట్టాలన్న సీఎం.. ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించగలగాలని సీఎం పేర్కొన్నారు.
పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టు పనుల ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయన్న అధికారులు.. సెప్టెంబరు కల్లా డ్రెడ్జింగ్, రెక్లిమేషన్ పనులు పూర్తవుతాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను అధికారులు వివరించారు.
చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా?
శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు.. సౌత్ బ్రేకింగ్ వాటర్ పనులు ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ నిర్మాణ పనుల ప్రగతిని కూడా సీఎంకు అధికారులు వివరించారు.
10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం సమీక్ష
తొలి దశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. జువ్వలదిన్నెలో 86 శాతం పనులు పూర్తి, నిజాంపట్నంలో 62 శాతం, మచిలీపట్నంలో 56.22 శాతం, ఉప్పాడలో 55.46శాతం పనులు పూర్తి కాగా, జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ మరో 40 రోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment