సాక్షి, అమరావతి: రెండు వేల జనాభా ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్ధితులకు తగినట్లుగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సు ఈ క్లినిక్‌లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయడం లక్ష్యంగా... ప్రతీ గ్రామ, వార్డు సచివాలయం ఉన్న చోట క్లినిక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ప్రజలకు మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ సేవలు ఉండాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
‘‘ఏ సేవ అయినా డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ రెఫరల్ పాయింట్‌లా ఉండాలి. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్‌లా పనిచేయాలి. రోగికి ఏదైనా జరిగితే వెంటనే అక్కడికి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుందనే భరోసా కల్పించాలి. డబ్బు ఖర్చు కాకుండా వైద్యం ఉచితంగా అందించేందుకే ఈ ప్రక్రియ. చిన్న చిన్న సమస్యలకు అక్కడికక్కడే చికిత్సలు నిర్వహించాలి. అదే విధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 టీచింగ్ హాస్పిటల్స్ ఉండాలి. టీచింగ్ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. డాక్టర్లు, నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. ప్రతి టీచింగ్ హాస్పిటల్‌లో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి’’ అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు. ఈ క్రమంలో... 7 మెడికల్ కాలేజీలకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు...
‘‘1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్ధులకు ఉచిత దంత వైద్యం అందించేందుకు డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు. ప్రతీ విద్యార్థికి టూత్‌పేస్ట్, బ్రష్ ఉచితంగా ఇవ్వాలి. పీహెచ్‌సీలలో డెంటల్ చెకప్ కూడా ఉండాలి. 60 లక్షల మంది చిన్నారులకు స్క్రీనింగ్ చేయడమే లక్ష్యం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు పూర్తిగా అధ్యయనం చేయండి. పక్కాగా ప్రణాళికలు సిద్దం చేయండి. కంటి వెలుగు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో పరిశీలించండి. కంటి వెలుగు తరహాలో ఈ కార్యక్రమం సజావుగా సాగేలా ఉండాలి. ఎక్కడా అడ్డంకులు రాకూడదు. అధికారుల మానిటరింగ్ నిరంతరం ఉండాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జూలై 8న డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు కార్యక్రమం ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment