సాక్షి, విజయవాడ : పేదవారు సైతం వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగినపుడే పోలీసు వ్యవస్థ మీద గౌరవం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నా అని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించి... ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణకై చైనా సైన్యం దాడిలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన పోలీసు అధికారి కరణ్‌సింగ్ సహా పదిమంది సీఆర్పీఎఫ్ సిబ్బంది త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. అలాంటి అమరవీరులు అందరికీ ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నా అన్నారు.
ఇక మెరుగైన పోలీసు వ్యవస్థ కోసం ప్రతీ పోలీసు సోదరసోదరీమణులు నిరంతరం కృషి చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటివారికైనా మినహాయింపు ఉండకూడదు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఎంతవారినైన చట్టం ముందు నిలబెట్టమని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశంలోనే చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఉండకూడదు. చట్టం అనేది అందరికి ఒకటే.. అది కొందరికి చుట్టం కాకూడదు. పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు.
తొలి రాష్ట్రం మనదే..
సీఎం జగన్ తన ప్రసంగం కొనసాగిస్తూ.. ‘పోలీసులు సెలవులు లేకుండా కష్టపడుతున్నారని నాకు తెలుసు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించాం. అలా చేసిన తొలి రాష్ట్రం మనదే. వారంలో ఒకరోజు పోలీసులు తమ కుటుంబంతో గడిపితే మానసికంగా బలంగా ఉంటారు. లంచగొండితనం, అవినీతి, రౌడీయిజంపై నిజాయితీగా మీరు యుద్ధం చేయాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డుల జీతాలను రూ. 18 వేల నుంచి రూ. 21 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. హోంగార్డులు మరణిస్తే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తొలి రాష్ట్రం కూడా మనదేనని గర్వంగా చెబుతున్నా. విధి నిర్వహణలో హోంగార్డులు మరణిస్తే రూ. 30 లక్షలు, పోలీసులు మరణిస్తే 40 లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజ్ సదుపాయాన్ని తీసుకొచ్చాం. రిటైర్డు సిబ్బందికి కూడా బీమా వర్తిస్తుంది. ఇందుకుగానూ కృషి చేసిన హోం మంత్రి, డీజీపీ సవాంగ్‌కు అభినందనలు’ అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం పోలీసులు కృషి చేయాలని.. అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కన్నీళ్లు వస్తున్నాయి: హోం మంత్రి సుచరిత
పోలీసులు త్యాగానికి నిలువుటద్దం అని.. వారి త్యాగాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించే హోం మంత్రిగా తనకు సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగాలు కల్పించి పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బాలికలు, మహిళ సంరక్షణ కోసం మహిళ మిత్ర ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మెరుగైన సమాజానికి కృషి చేయండి: సీఎం జగన్
Published Mon, Oct 21 2019 9:05 AM | Last Updated on Mon, Oct 21 2019 2:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment