క్రిటికల్ కేర్, కోవిడ్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందరికీ.. కోవిడ్–19 అనేది తెలియని వ్యాధి. డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రుల్లో పని చేసే వారికి ఈ వ్యాధి సోకే అవకాశముందని తెలిసినా సేవలందిస్తున్నారు. వారి కష్టానికి సెల్యూట్ చేస్తున్నా. తెలియని భయం ఉన్నా.. నిస్వార్థంగా పని చేస్తున్నారు. అందుకు సెల్యూట్ చేస్తున్నా. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, పారిశుధ్య సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య రంగాల్లో వివిధ స్థాయిల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఆశా వర్కర్లు, ఐఎంఏ అసోసియేషన్ ఆఫ్ అనస్థీషియా, పల్మనాలజిస్టులు, ట్రైనీ నర్సులు, ఆయుష్, డెంటల్ డాక్టర్లు, పీజీ విద్యార్ధులు, వలంటీర్లు, కోవిడ్– వారియర్స్.. తదితరుల హృదయ పూర్వక సేవలకు నా కృతజ్ఞతలు.
మనలాగే ఆర్గనైజ్డ్‌గా, క్రమశిక్షణతో అన్ని రాష్ట్రాలు పని చేస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలు... హైదరాబాద్, బెంగళూరు, చెన్నైవంటి అభివృద్ధి చెందిన నగరాల్లో గొప్ప మౌలిక వసతులున్న ఆసుపత్రులతో పోటీ పడే ఆసుపత్రులు మన దగ్గర లేవు. అయినప్పటికీ మన వద్ద ఉన్న మంచి డాక్టర్లు, సిబ్బంది వారితో పోటీ పడుతూ అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు, మన రాష్ట్రానికి మధ్య తేడా ఇదే.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మీద యుద్ధంలో వైద్యులు, పారా మెడికల్, పారిశుధ్య సిబ్బంది, నర్సులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య రంగాల్లో సేవలందిస్తున్న ఉద్యోగులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. జిల్లా కలెక్టర్లు, కోవిడ్ ఆసుపత్రుల వైద్యులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘క్లిష్ట సమయంలో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని ప్రశంసించకుండా ఉండలేను. ఏ ఒక్కరూ మీ సేవలను ప్రశంసించకుండా ఉండలేరు. అంత ఎక్కువగా కష్టపడుతున్నారు. అంత ఎక్కువగా సేవలు అందిస్తున్నారు’ అని అభినందించారు. మొత్తం మీద పరిస్థితి అదుపులోనే ఉందనే చెప్పుకోవచ్చన్నారు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నానని చెప్పారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. అందరం సమష్టిగా కృషి చేసి కరోనా వైరస్‌ను సమర్థవంతంగా నిలువరిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..
► కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భాగంగా 4 బెస్ట్ క్రిటికల్‌కేర్ ఆసుపత్రులను గుర్తించాం. ఇక్కడకు ఐదు శాతం మంది సీరియస్‌గా ఉన్న పరిస్థితుల్లో వస్తారు.
► ప్రపంచ సగటు ప్రకారం.. 13 జిల్లాల్లో 13 కోవిడ్ కేర్ ఆసుపత్రులకు 14 శాతం మంది రోగులు వచ్చే అవకాశముంది. క్రిటికల్ కేర్ కాకపోయినా కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారు ఇక్కడికొస్తారు. ఇందుకోసం మనం ప్రతి జిల్లాల్లో 2,000 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. వీరందరికీ అక్కడ చికిత్స అందిస్తారు. మిగతా 81 శాతం మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తారు.
► ఢిల్లీ నుంచి వచ్చిన కేసులు, వారి ప్రైమరీ కాంటాక్టు కేసుల పరీక్షలు అయిపోయాయి. సెకండరీ కాంటాక్ట్ పరీక్షలు కొద్దిగా ఉన్నాయి. లోకల్ కమ్యూనిటి కేసులు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment