పేదలకు స్థలాలివ్వడమే కాదు.. ఇళ్లూ కట్టిస్తాం | CM YS Jagan in Video Conference with District Collectors and SP | Sakshi
Sakshi News home page

పేదలకు స్థలాలివ్వడమే కాదు.. ఇళ్లూ కట్టిస్తాం

Published Wed, Jan 1 2020 3:58 AM | Last Updated on Wed, Jan 1 2020 5:01 AM

CM YS Jagan in Video Conference with District Collectors and SP - Sakshi

బుధవారం(ఈ రోజు) ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతుంది. 2020లో ఇదే తొలి కార్యక్రమం. ప్రజా ప్రతినిధులు డిపోల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలి. 50 వేలకు పైగా ఉన్న కార్మిక కుటుంబాల దీర్ఘకాలిక కలను నెరవేర్చాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇది తనకు మాత్రమే కాకుండా కలెక్టర్లందరికీ ప్రతిష్టాత్మక కార్యక్రమమని చెప్పారు. ఇందుకోసం ఇంకా 15 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని చెబుతూ.. కలెక్టర్లు మరింత గట్టిగా పని చేయాల్సి ఉంటుందన్నారు. రెండు నెలల్లోగా భూ సేకరణ పూర్తి కావాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 22,76,420 మంది లబ్ధిదారుల గుర్తింపు జరిగిందని, అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించామని అధికారులు వివరించారు. ప్రతి జిల్లాలో కనీసం మూడు సార్లు పర్యటించాలని, జిల్లా అధికారులతో సమావేశమై ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం సూచించారు. దేవాలయాలు, ఇతర మతాల ప్రార్థనా మందిరాలు, విద్య, ఆరోగ్య సంస్థలకు సంబంధించిన స్థలాలు కాకుండా ఇతర భూములను ఇళ్ల పట్టాల కోసం పరిశీలించాలని చెప్పారు. 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
వైఎస్సార్‌ నవశకం కింద 60 శాతం దరఖాస్తులు ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్‌కార్డులకు సంబంధించినవే వస్తున్నాయని సీఎం చెప్పారు. కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు ఫిబ్రవరి ఒకటి నుంచి పంపిణీ చేయాలని, తమకు ఓటు వేయని వారు కూడా అర్హులైతే పథకాలను వర్తింప చేయాలని సూచించారు. 

ఆరోగ్యశ్రీ, అమ్మఒడికి సంబంధించి అర్హుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శిస్తున్నామని అధికారులు తెలిపారు. అన్ని పథకాలకు సంబంధించిన అర్హతలతో పాటు లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్రాంతి నాటికి ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఆరోగ్యశ్రీ, సబ్‌ సెంటర్లు, తీవ్ర వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు
ఫిబ్రవరి నెలాఖరుకు 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జనవరి 3వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని, ఆ రోజు 1.5 లక్షల కార్డులు పంపిణీ చేస్తున్నామని అధికారులు వివరించారు. జనవరి 3 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందుతుందని సీఎం చెప్పారు. మిగతా జిల్లాల్లో 1,259 రోగాలకు ఆరోగ్యశ్రీ సేవలను పెంచి చికిత్స అందిస్తామని, ఏప్రిల్‌ నుంచి ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు సేవలను విస్తరించుకుంటూ వెళతామని చెప్పారు. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తారని, తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి నెలకు రూ.5 వేలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేలు, తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేయించుకున్న వారికి రూ.5 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తామన్నారు. జనవరి చివరి నాటికి ఐదు వేల సబ్‌సెంటర్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలుస్తారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామాల మధ్యలో సబ్‌సెంటర్ల నిర్మాణానికి జనవరి 6వ తేదీకల్లా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. 
మంగళవారం సచివాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రైతు ఆత్మహత్యలపై వెంటనే స్పందించండి
2014 నుంచి 2019 జూన్‌ వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 556 మందికి ఇంకా పరిహారం అందలేదని, గతంలో వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని సీఎం తెలిపారు. వీరందరికీ ఫిబ్రవరి 12న ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలన్నారు. 2019 జూన్‌ నుంచి ఇప్పటి దాకా ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో పలువురి కుటుంబాలకు డబ్బులు అందలేదని, ఈ కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని  ఆదేశించారు. వీటిని అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేయాలని, ఈ డబ్బు మీద అప్పుల వాళ్లు, బ్యాంకులు ఎలాంటి క్లెయిం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కలెక్టర్‌ వారి ఇళ్లకు పోయి.. పరిహారం ఇవ్వాలని చెప్పారు. కలెక్టర్లు వద్ద డబ్బు అయిపోతే వెంటనే అడగాలని, ఏదైనా రైతు కుటుంబానికి జరగరానిది జరిగితే వారం రోజుల్లోగా కలెక్టర్లు స్పందించాలని ఆదేశించారు.  

రైతు భరోసా కేంద్రాలతో ఎంతో ఉపయోగం
ఫిబ్రవరి 1న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. 11,150 కేంద్రాలు ఏప్రిల్‌ నాటికి  సిద్ధమవుతాయన్నారు. వీటి కోసం ఎక్కడెక్కడ భవనాలు, స్థలాలు కావాలో గుర్తించాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 1న 3,300 రైతు భరోసా కేంద్రాలు తొలి దశలో ప్రారంభమవుతాయని, వీటివల్ల వ్యవసాయ రంగంలో సమూల మార్పులు వస్తాయన్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఈ కేంద్రాల్లో గ్యారెంటీతో లభిస్తాయని, అలాగే డిజిటల్‌ కియోస్క్‌ కూడా రైతు భరోసా కేంద్రంలో ఉంటుందని తెలిపారు. భూసార పరీక్షలు, భవిష్యత్తులో రైతుల ఉత్పత్తుల కొనుగోలు, విత్తన పంపిణీ కూడా ఈ భరోసా కేంద్రాల ద్వారానే జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంపైనా  రైతులకు శిక్షణ లభిస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను ఈ కేంద్రాలు బలోపేతం చేస్తాయన్నారు. వీటిని విజయవంతం చేయాలని సీఎం సూచించారు. 

జనవరి 2వ తేదీన రైతు భరోసాకు 
సంబంధించి చివరి విడత డబ్బు పంపిణీ చేయాలి. 46,50,629 రైతు కుటుంబాలకు ఈ డబ్బు అందుతుంది. ఈ మేరకు గ్రామ వలంటీర్లు జనవరి 3వ తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రశీదు ఇవ్వాలి. వచ్చే ఖరీఫ్‌ నాటికి మళ్లీ రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడంపై కూడా అధికారులు దృష్టి పెట్టాలి. 

ఎవరైనా రైతులు బలవన్మరణానికి 
పాల్పడితే కలెక్టర్లు, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి రూ.7 లక్షలు సాయం అందించాలని 2019 జూన్‌లో మార్గదర్శకాలు రూపొందించాం. ఇందుకోసం ప్రతి కలెక్టర్‌ 
వద్ద కోటి రూపాయలు ఉంచాం. అయినా తాత్సారం జరుగుతోంది. ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని పదేపదే చెబుతున్నా. 

ప్రతి నెలా 15 లక్షల టన్నుల చొప్పున ఫిబ్రవరి నుంచి నాలుగు నెలలపాటు ఇసుక నిల్వ చేయాలి. జూన్‌లో వర్షాలు మొదలయ్యే నాటికి 60 లక్షల టన్నులు స్టాక్‌ ఉండాలి. గత ప్రభుత్వం ఈ పని చేసి ఉంటే.. మొన్న ఇసుక కొరత వచ్చి ఉండేదే కాదు. ఈ విషయంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 

దిశ చట్టం అమలుపై కలెక్టర్లు, ఎస్పీలు దృష్టి పెట్టాలి 
మహిళలు, చిన్నారులపై దారుణాలకు పాల్పడడం, లైంగిక వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలను తీవ్రంగా తీసుకోవాలి.
ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి తాము చేసిన ఈ చట్టాన్ని రాష్ట్రపతి సంతకం కోసం పంపాం. ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలి. 
- జిల్లా ఎస్పీలు ఓనర్‌షిప్‌ తీసుకుంటే మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగుతాయి. చర్యల విషయంలో అంకిత భావాన్ని ప్రదర్శించాలి.  
ప్రతి జిల్లాలో మహిళా పోలీస్‌స్టేషన్‌ను బలోపేతం చేస్తున్నాం. ముగ్గురు ఎస్‌ఐలు, అదనపు ఎస్‌ఐలను అక్కడ పెడుతున్నాం. వీటిపై బాగా ప్రచారం చేయాలి. 
బోధనాసుపత్రుల్లోని ఒన్‌ స్టాప్‌ సెంటర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. దీనిపై బాగా ప్రచారం చేయాలి. ఆ సెంటర్లలో కూడా ఒక ఎస్‌ఐని ఉంచుతాం. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులు కలిసి పనిచేయాలి.
దిశ చట్టం అమలు కోసం ఒక ఐపీఎస్‌ అధికారిని ప్రత్యేకంగా పెడుతున్నాం. మహిళా సంక్షేమ శాఖ నుంచి ఐఏఎస్‌ అధికారి ఉంటారు. 
- జిల్లాకు ఒక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను కూడా పెడుతున్నాం. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. విశాఖ, తిరుపతిలో కొత్త ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
ప్రత్యేక కోర్టుల కోసం ఒక్కో కోర్టుకు రూ.2 కోట్లు చొప్పున రూ. 26 కోట్లు ఇస్తున్నాం. ఈ డబ్బును డిపాజిట్‌ చేస్తున్నాం. వీటి గురించి ప్రచారం చేయాలి. 
తప్పు చేసిన వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టి, బాధితులకు న్యాయం కలిగిస్తున్నామన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలి.
- దిశ కాల్‌ సెంటర్, యాప్‌ ఏర్పాటు చేయాలి. 
- నెల రోజుల్లోగా వీటన్నింటినీ సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి.
సమస్యను ఎన్నిరోజుల్లోగా పరిష్కారం చేస్తామన్న దానిపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి.
ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ స్పందన కొనసాగుతుంది.

‘అమ్మఒడి’ ప్రతిష్టాత్మకం
జనవరి 9వ తేదీన అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఇది చాలా పెద్ద కార్యక్రమమని ముఖ్యమంత్రి చెప్పారు. సోషల్‌ ఆడిట్‌ తర్వాత జనవరి 2వ తేదీన తుది జాబితా విడుదల చేయాలని ముఖ్యమంత్రి చెప్పగా, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 81,72,224 మంది పిల్లల డేటాను పరిశీలించామని అధికారులు తెలిపారు. 46,78,361 మంది తల్లుల్లో అర్హులైన తల్లుల సంఖ్య 42,80,823 కాగా, రీ వెరిఫికేషన్‌లో మరో 3,97,538 మంది తల్లులు ఉన్నట్లు చెప్పారు. జనవరి 1 నాటికి రీ వెరిఫికేషన్‌ పూర్తవుతుందని అధికారులు చెప్పగా, త్వరగా అర్హుల సంఖ్యను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సీఎం ఆరా తీశారు. అమ్మ ఒడి కార్యక్రమం సందర్భంగా విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్కూళ్లలో జనవరి 4, 6, 7, 8 తేదీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగాలని, జనవరి 9వ తేదీన పిల్లలు, వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలతో కలిపి అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. నాలుగు అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఇలా నిర్వహించాలన్నారు. 
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వివిధ జిల్లాల అధికారులు  

ఒకటవ అంశం : అమ్మఒడి  
ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా చేయడం లేదు. మనం చేస్తున్న కార్యక్రమాలు విద్యారంగం ముఖచిత్రాన్ని మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యా కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. స్కూళ్ల నిర్వహణలో వారి పాత్ర కీలకం.

రెండో అంశం : మధ్యాహ్న భోజనం
సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో మార్పులు తీసుకొస్తున్నాం. నాణ్యతతో కూడిన ఆహారం అందిస్తాం. ఇందుకోసం అదనంగా రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

మూడో అంశం : ఇంగ్లిష్‌ మీడియం
ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం అమలుకు పలు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పిల్లలకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తున్నాం.  

నాలుగో అంశం : స్కూళ్లలో మౌలిక సదుపాయాలు
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించాం. నాడు–నేడు కింద చేపడుతున్న కార్యక్రమాల గురించి తల్లిదండ్రులు, విద్యా కమిటీలు, పిల్లలకు అవగాహన కల్పించాలి. 

ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు 
ఇసుక డోర్‌ డెలివరీ చేయాలనే విషయంలో కొంత మంది రవాణాదారులు అడ్వాంటేజ్‌ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందిందని ముఖ్యమంత్రి తెలిపారు. వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా చేయడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నామని, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కడా ఉండకూడదన్నారు. బుక్‌ చేసుకున్న వెంటనే ఇసుక ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా జిల్లాలో జనవరి 2వ తేదీన పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, జనవరి 10న విశాఖ, పశ్చిమగోదావరి, వైఎస్సార్‌ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తామని అధికారులు చెప్పారు. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ చేస్తామని వివరించారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలని, జనవరి 20 నాటికి 389 చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఉంటాయని, వంద మొబైల్‌ పార్టీలు పని చేస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు 50,348 టన్నుల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నామని, 4,644 వాహనాలు సీజ్‌ చేశామని అధికారులు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జూన్‌ నుంచి 2,976 కేసులు, డిసెంబర్‌లో 248 కేసులు నమోదు చేశామని వివరించారు.

2020 చరిత్రాత్మక సంవత్సరం కావాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల విజయవంతానికి అధికారులంతా అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరారు. స్పందనలో వస్తున్న విజ్ఞాపన పత్రాల పరిష్కారంలో నాణ్యత కోసం ఇప్పటికే విధివిధానాలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, సోషల్‌ ఆడిట్, అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలనే దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ తయారు చేశామన్నారు. వీటిని అన్ని గ్రామ సచివాలయాలకు, విభాగాలకు పంపిస్తామని తెలిపారు. స్పందన విషయంలో అందరూ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. చరిత్రలో ఎన్నడూలేని చరిత్రాత్మక కార్యక్రమాలు చేపడుతున్నామని, 2020 రాష్ట్రానికి చరిత్రాత్మక సంవత్సరం కావాలని ఆయన ఆకా>ంక్షించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement