వైఎస్‌ జగన్‌: తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం | YS Jagan Visits East Godavari District Mummidivaram on 21st Nov, Tour Schedule - Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్‌

Published Wed, Nov 20 2019 11:02 AM | Last Updated on Wed, Nov 20 2019 2:49 PM

CM YS Jagan Visit Mummidivaram On Thursday - Sakshi

సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో మత్స్యకారులకు పలు హామీలు ఇచ్చారు. వీటి అమలుకు సీఎం ఆ రోజు శ్రీకారం చుట్టనున్నారు. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జీఎస్‌పీసీ) కార్యకలాపాల ఫలితంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆ సంస్థ ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం జరగడంతో.. ఆ మొత్తాన్ని తమ ప్రభుత్వమే ఇస్తుందని పాదయాత్రలో వాగ్దానం చేశారు. ఆమేరకు రూ.78.22 కోట్లు మత్స్యకారులకు అందజేయనున్నారు. అలాగే ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి, ఎదుర్లంక ఎస్సీ లంక భూముల్లో రూ.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 

21న సీఎం పర్యటన సాగనుందిలా.. 
ఉదయం 9.45 : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో ముమ్మిడివరం మండలం గాడిలంక చేరుకుంటారు. 
ఉదయం 9.50 : రోడ్డు మార్గంలో బయలుదేరి ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామం చేరుకుంటారు. పశువుల్లంక నుంచి వలసలతిప్ప హై లెవెల్‌ బ్రిడ్జి (వైఎస్సార్‌ వారధి) ప్రారంభిస్తారు. 
ఉదయం 10.20 : ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సభాస్థలికి చేరుకుంటారు. దివంగత ముఖ్యమంతి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పస్తారు. జ్యోతి వెలిగించి, వందేమాతరం గేయం ఆలపిస్తారు. 
ఉదయం 10.40 – 11.00 : మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగిస్తారు. 
ఉదయం 11.00 – 11.45 : మత్స్యకార భరోసా, జీఎస్‌పీసీ బకాయి రూ.78.22 కోట్ల నిధులు అందజేస్తారు. 
11.45 : సభా ప్రాంగణం నుంచి గాడిలంక హెలిప్యాడ్‌కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు యానాం చేరుకుంటారు. 
మధ్యాహ్నం 12.25 : పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి చేరుకుంటారు. ఇటీవల దివంతులైన కృష్ణారావు తండ్రి మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లిలోని తన నివాసానికి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.

ట్రాఫిక్‌ మళ్లింపు
కాకినాడ సిటీ: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐ.పోలవరం, ముమ్మిడివరం, యానాం పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ ట్రాఫిక్‌ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మి మంగళ వారం తెలిపారు. అమలాపురం వైపు నుంచి కాకినాడ వెళ్లే లైట్‌ మోటార్‌ వాహనాలు (4 చక్రాలు), భారీ వాహనాలు (4 చక్రాల కన్నా ఎక్కువ ఉన్నవి) ఈదరపల్లి, అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం మీదుగా వెళ్లాలి. కాకినాడ వైపు నుంచి అమలాపురం వైపు వెళ్లే లైట్‌ మోటార్‌ వాహనాలు, భారీ వాహనాలు యానాం, పిల్లంక, గోపులంక, రావులపాలెం మీదుగా వెళ్లాలి. ట్రాఫిక్‌ మళ్లింపునకు అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement