బొగ్గే బంగారమాయే
బొగ్గు మాఫియా బరితెగింపు
పోర్టు కేంద్రంగా కీలక నేత అక్రమసామ్రాజ్యం
భారీగా దారిమళ్లుతున్న మేలురకం బొగ్గు
విశాఖపట్నం మొదట ఇసుక మాఫియా... తరువాత మద్యం మాఫియా... తాజాగా బొగ్గు మాఫియా... ఇదీ అధికార టీడీపీ ప్రజాప్రతినిధుల అక్రమార్జనకు తాజా కేంద్ర బిందువు ఇదీ. కొన్నేళ్లుగా పోర్టులో వ్యాపార కార్యకలాపాలతో సంబంధాలు ఉన్న ‘కీలక నేత’ దీనికి కేంద్ర బిందువుగా మారారు. భారీగా దిగుమతి అవుతున్న బొగ్గును ఈ మాఫియా కొల్లగొడుతోంది. కీలక నేత సమీప బంధువు పర్యవేక్షణలో ఓ బృందం పోర్టులో స్థావరం ఏర్పాటు చేసుకుంది. నెలకు రూ.4.50కోట్లు కొల్లగొడుతున్న ఈ మాఫియా కథకమామిషు ఇదిగో ఇలా ఉంది... సెయిల్, మరికొన్ని పెద్ద సంస్థలు దిగుమతి చేసుకునే మేలురకం బొగ్గు టన్ను ధర దాదాపు రూ.18వేలు. కానీ స్థానికంగా కొన్ని ప్రైవేటు సంస్థలు దిగుమతి చేసుకునే నాసిరకం స్టీమ్డ్ బొగ్గు ధర టన్నుకు కేవలం రూ.4వేలు. ఈ రెండు ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్నే అనుకూలంగా మలచుకుని అధికార పార్టీ మాఫియా చెలరేగిపోతోంది. సెయిల్, మరికొన్ని పెద్ద సంస్థల కోసం నెలకు సగటున 15 షిప్‌ల ద్వారా బొగ్గు దిగుమతి అవుతోంది. ఒక్కో షిప్‌మెంట్ ద్వారా దాదాపు 65వేల మెట్రిక్ టన్నుల మేలురకం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. టన్ను రూ.18వేల చొప్పున ఒక షిప్‌మెంట్ విలువ దాదాపు రూ.100కోట్లు. ఇంత మేలురకం బొగ్గునిల్వల్లో కొంతవరకు దారిమళ్లిస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న వే బ్రిడ్జీలు , బీవోటి బ్రిడ్జిల వద్ద మతలబు చేస్తున్నారు.
ఇందుకు కొందరు కిందిస్థాయి అధికారుల సహకారం కూడా ఉంది. దాదాపు ఒక్కో షిప్‌మెంట్‌కు 500 టన్నుల మేలురకం బొగ్గును దారిమళ్లిస్తున్నారు. ఆ స్థానంలో నాసిరకం స్టీమ్డ్ బొగ్గును కల్తీ చేసి కనికట్టు చేస్తున్నాయి. రూ.4వేలు టన్ను ధర ఉన్న బొగ్గును కలిపి రూ.18వేలు ధర ఉన్న బొగ్గును అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో షిప్‌మెంట్ ద్వారా 500టన్నుల మేలరకం బొగ్గును దారిమళ్లిస్తున్నాయి. నెలకు పోర్టుకు సగటున 15 షిమ్‌మెంట్‌ల బొగ్గు దిగుమతి అవుతోంది. అంటే నెలకు 7, 500టన్నుల మేలరకం బొగ్గును అధికార పార్టీ మాపియా గుప్పిటపడుతోంది.
అంతా నాదే..: బొగ్గు మాఫియాలో అంతా తన కనుసన్నల్లోనే సాగేలా కీలక నేత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇసుక, మద్యం మాఫియాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పలువురు భాగస్వాములుగా ఉన్నారు. కానీ బొగ్గు మాఫియా మాత్రం అంతా తన గుప్పిట్లోనే ఉండేలా కీలక నేత చక్రం తిప్పుతున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు కొందరు అధికారులు యత్నించినప్పటికీ రాజకీయ ఒత్తిడితో వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ బొగ్గు మాఫియాను కట్టడి చేయాలంటే సీబీఐ రంగంలోకి దిగాల్సిందేనని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సొమ్మే సొమ్ము
ఇలా దారి మళ్లించిన బొగ్గును ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వివిధ సంస్థలకు విక్రయిస్తున్నారు. మేలురకం బొగ్గు ధర టన్నుకు రూ.18వేలు. దొంగచాటుగా దారిమళ్లించిన బొగ్గును టన్ను రూ.10వేల నుంచి రూ.12వేలకే విక్రయిస్తున్నారు. ఆ లెక్కన షిప్‌మెంట్‌కు 500టన్నులు అంటే రూ.50లక్షలకు విక్రయిస్తున్నారు. అందులో వీరు కలిపిన నాసిరకం బొగ్గు విలువ 500 టన్నులకు రూ.20లక్షలు పోగా బొగ్గు మాఫియా నికరంగా ఒక షిప్‌మెంట్‌కు రూ.30లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. నెలకు 15 షిమ్‌మెంట్‌లకు రూ.4.50కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.54కోట్లు కొల్లగొడుతున్నారు.