సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కోడి పందేలాట... ఆ పేరు వింటేనే పశ్చిమ గోదావరి జిల్లా గుర్తుకు వస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ పల్లెపల్లెనా కోడి పందేలు జాతరను తలపిస్తాయి. వినోదం మాటున సాగే జూదమది. కోళ్లకు కత్తులు కట్టి లక్షలకు లక్షలు బెట్టింగ్ కాసే సంస్కృతి మన జిల్లాకూ పాకింది. స్వయానా టీడీపీ ఎమ్మెల్యే తన సొంత ఊళ్ల్లోనే ఈ పందేరానికి తెరలేపారు. కోడి పందేలాటకు ఆయనే సారథ్యం వహించి... దగ్గరుండి మరీ పందెం రాయుళ్ల పోటాపోటీని కళ్లారా చూసి పండుగ జరుపుకున్నారు.
ఏకంగా భీమవరంను తలపించేలా జిల్లాలోని ఎలిగేడు మండలం శివపల్లిలో సంక్రాంతి పండుగ రోజున కోడి పందేలు జోరుగా సాగాయి. గతంలోనూ ఇక్కడ కోడి పందేలు ఆనవాయితీగా నిర్వహిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ... ఈ సారి ఆంధ్రాతో పోటీ పడ్డట్లుగా పందెంరాయుళ్లు బరిలోకి దిగడం... వేలకు వేల నోట్ల కట్టలు కుమ్మరించిన తీరు అందరినీ విస్మయపరిచింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, శివపల్లికి సర్పంచ్‌గా ఉన్న ఆయన సోదరుడు శ్యాంసుందర్‌రావు దగ్గరుండి ఈ పోటీల నిర్వహణలో పాలు పంచుకున్నారు.
ఏకంగా బడా నేతలే బరిలో ఉండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం సైతం అటువైపు కన్నెత్తి చూడలేదు. స్వయానా ఎమ్మెల్యే సారథ్యం వహించడంతో తమకు అడ్డూ అదుపేం లేనట్లు పందెంరాయుళ్లు రెచ్చిపోయారు. దీంతో భారీ మొత్తంలోనే బెట్టింగ్‌లు జరిగాయి. కనీసం రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకు పందెం కాసేందుకు పందెంరాయుళ్లు పోటీ పడ్డారు. ఆ ఒక్కరోజునే కోటి రూపాయలకు పైగా చేతులు మారినట్లు అంచనాలున్నాయి. పక్కాగా సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ... ఉన్నతాధికారుల నుంచి అప్పటికప్పుడు వచ్చిన ఆదేశాలతో మార్గమధ్యం నుంచే వెనుదిరిగినట్లు తెలిసింది. దీంతో పందెం రాయుళ్లకు పొద్దంతా ఆడినంత ఆటగా పందేలాట కొనసాగింది.
కాళ్లకు కత్తులు కట్టిన కోళ్లు... నెమలి, పర్ల పేర్లతో కోడిపుంజులు... చేతిలో వెయ్యి రూపాయల నోట్ల కట్టలతో పందెంరాయుళ్లు.. ఎటు చూసినా అదే కోలాహలం. వేలాది మంది పందెం రాయుళ్లు.. పోటీలకు చూసేందుకు వచ్చిన జనంతో శివపల్లిలో జాతర వాతావరణం కనిపించింది. గ్రామ శివారులో మూడు చోట్ల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. ఒక్కో బరిని వెయ్యి మందికి పైగా చుట్టుముట్టారు. పిల్లలు మొదలు పెద్దలు... ఉద్యోగులు మొదలు రాజకీయ నాయకులందరూ ఈ పోటీలకు ఎగబడ్డారు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో పందెం రాయుళ్లు తరలివచ్చారు.
ఎమ్మెల్యే సాక్షిగా కోడి పందేలాట
Published Thu, Jan 16 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement