ఖాకీలు కామ్.. పందేలు ధూమ్‌ధామ్ | Cockfight continues in Andhra Pradesh despite ban | Sakshi
Sakshi News home page

ఖాకీలు కామ్.. పందేలు ధూమ్‌ధామ్

Published Sat, Jan 17 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

ఖాకీలు కామ్.. పందేలు ధూమ్‌ధామ్

ఖాకీలు కామ్.. పందేలు ధూమ్‌ధామ్

 కొద్ది రోజులుగా ‘ఖాకీ’తో జరిగిన పోరులో చివరికి కోడే గెలిచింది. అత్యున్నత న్యాయస్థానాల సూచనలను, పోలీసుల ఆంక్షలను ఏ మాత్రం లెక్క చేయకుండా.. సంప్రదాయం ముసుగులో.. తెరవెనుక నేతలు ఇచ్చిన మద్దతుతో.. కోడి కత్తుల సమరానికి నిర్వాహకులు ఊహించినట్టుగానే ‘బరి’ తెగించారు. పందెగాళ్లపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసులు ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లావ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి.                      
 
 అమలాపురం టౌన్ :సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లాలో ఎక్కడ చూసినా కోడిపందేల సందడే కనిపించింది. మంత్రులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయో తెలీదు కానీ.. భోగి పండగనాటి ఉదయం వరకూ బరుల వద్ద కాపలా కాసిన ఖాకీలు.. చివరకు పత్తా లేకుండా పోయారు. దీంతో పందేల నిర్వాహకులు చెలరేగిపోయారు. వేలాదిగా తరలివచ్చిన జనాలు.. ఖరీదైన కార్లు, బైకులతో గ్రామాలు జాతర్లను తలపించాయి. ముఖ్యంగా కోనసీమ కొబ్బరి తోటల్లోని నల్లరేగడి మట్టి.. కోళ్ల ఎర్రని రక్తంతో తడిసింది. పచ్చని చేలు, కొబ్బరితోటల దారులన్నీ జనంతో కిక్కిరిశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో దాదాపు 45 చోట్ల భారీ పందెంబరులు.. 50 చోట్లకు పైగా ఓ మాదిరి బరులు వెలిశాయి. మొత్తం రూ.25 కోట్ల మేర సొమ్ము పందెంగాళ్ల చేతులు మారిందని అంచనా. ముమ్మిడివరం నియోజకవర్గం ఎదుర్లంక, కేశనకుర్రు, రాజుపాలెం; అమలాపురం నియోజకవర్గం గోడిలంక, గుండెపూడి, ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి; పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, మేడపాడు; రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లిలంక, అప్పనరామునిలంక,  వీవీ మెరక; ఇంకా పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లో పలుచోట్ల కోడిపందేల జోరుగా జరిగాయి. పందేలకు తోడు గుండాట, మద్యం పేరుతో కోట్లలో వ్యాపారం జరిగింది.
 
 రూ.10 లక్షల వరకూ పందెం కొట్టిన పుంజులు
 కొన్నిచోట్ల పందెంకోళ్లు వీరపోరాటం చేసి పందెగాళ్లకు రూ.లక్షల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎదుర్లంక బరిలో ఓ పుంజు పలు పందేల్లో ప్రత్యర్థి పుంజులను మట్టి కరిపించి రూ.10 లక్షల వరకూ పందేలు కొట్టింది. గోడిలంక బరిలో కూడా ఓ పుంజు రూ.5 లక్షల దాకా పందేలను కొట్టింది. ఇంకా వేట్లపాలెం, పల్లిపాలెం, సఖినేటిపల్లి తదితర బరుల్లో కొన్ని పుంజులు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ పందేలు కొట్టాయి.
 
 రూ.కోట్లలో మద్యం, జూదం వ్యాపారాలు
 పలు బరులవద్ద అనధికార మద్యం దుకాణాలు, గుండాట, పేకాట స్థావరాల ద్వారా కూడా రూ.కోట్ల వ్యాపారం సాగింది. మద్యం అక్రమంగా అమ్మితే కేసులు నమోదు చేసే ఎక్సైజ్ అధికారులు బరుల్లో అనధికారికంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసినా పట్టించుకోలేదు. జిల్లాలో పందేల బరుల వద్ద ఏర్పాటు చేసిన మద్యం, జూదాల వల్ల రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ వ్యాపారం సాగిందని అంచనా. పలుచోట్ల రూ.500, రూ.1000 నోట్లే చెలామణి అయ్యాయి. బరులవద్ద మాంసపు పకోడీలు, మిరపకాయ బజ్జీల దుకాణాలు కూడా రూ.లక్షల్లో వ్యాపారం చేశాయంటే పందేలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
 
 కోసకు యమగిరాకీ
 పందేల్లో మరణించిన కోడి మాంసాన్ని ‘కోస’ అంటారు. గత మూడు రోజుల్లో నాలుగు వేలకు పైగా కోళ్లు బరిలో తలపడితే దాదాపు మూడు వేల కోళ్లు నేలకొరిగినట్టు ఒక అంచనా. ఇలాంటి కోళ్ల కోసం కోస మాంసం ప్రియులు వేలాదిగా కాచుకుని ఉంటారు. ఇటువంటి కోళ్లు బరి సమీపంలో.. కొద్ది క్షణాల్లోనే అమ్ముడైపోతాయి. ఈ విధంగా ఒక్కో కోడి రూ.మూడు వేల నుంచి రూ.ఆరు వేల వరకూ ధర పలికింది. ఈవిధంగా గత మూడు రోజుల్లో సుమారు రూ.కోటి మేర ‘కోస’ వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. కోనసీమలోని ఎదుర్లంక, గోడిలంక వంటి ప్రధాన బరుల్లోనే కోస మాంసం వ్యాపారం గత మూడు రోజుల్లో రూ.20 లక్షలకు పైగా సాగినట్టు సమాచారం. కొన్ని బరులవద్ద పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోళ్లను కాల్చి.. మాంసంగా మార్చి కిలో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు విక్రయించారు. పందెంలో విజేతగా నిలిచి కత్తి వేట్లకు పందెం తర్వాత చనిపోయిన కోడికి మరింత డిమాండు ఏర్పడింది. ఇటువంటి కోడి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ పలికింది.
 
 ప్రజాప్రతినిధులు సాక్షిగా..
 పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు సాక్షిగా కోడిపందేలు సాగాయి. పిఠాపురం, అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు తొలి రోజు తమ తమ నియోజకవర్గాల్లో పందేలను లాంఛనంగా ప్రారంభించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పండగ మూడు రోజులూ ఎదుర్లంక బరిలో ఉండి ఆద్యంతం పందేలను తిలకించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పుట్టిన రోజు వేడుకలను అభిమానులు వేట్లపాలెంలోని కోడిపందేల బరిలోనే నిర్వహించారు. ఆయన కూడా పందేలను వీక్షించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వాడ్రేవుపల్లిలో శుక్రవారం జరిగిన కోడిపందేల్లో పాల్గొన్నారు. కొద్దిసేపు దగ్గరుండిమరీ పందేలు ఆడించారు. ఈ సందర్భంగా జరిగిన ఆర్కెస్ట్రాలో గాయకులు పాడిన పాటలకు ఆయన స్టెప్పులు కూడా వేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అనేకమంది దగ్గరుండి మరీ పందేలను పర్యవేక్షించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement