
‘బరి’లో రంగ హరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముక్కనుమనాడూ జిల్లాలో విచ్చలవిడిగా కోడిపందేలు కొనసాగాయి. భోగి పండగ ఉదయం నుంచి సంక్రాంతి, కనుమ వరకు మూడురోజుల పాటు పందేలకు అనధికారిక అనుమతులు తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్కనుమ ఆదివారం కూడా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించాలని ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఫలితంగా ఖాకీలు పట్టించుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో ఎప్పుడూలేని విధంగా ముక్కనుమ రోజూ పందెం కోళ్లకు రెక్కలు తెగాయి. ఆదివారం జిల్లావ్యాప్తంగా కోడిపందేలతో పాటు పేకాట, గుండాట, కోతాట విచ్చలవిడిగా కొనసాగాయి.
ఒక్క ముక్కనుమ రోజే సుమారు రూ.100 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. భీమవరం ప్రాంతంలో ఒక్క ఆదివారం రోజే కోడిపందేల్లో రూ.50 కోట్లకు పైగా చేతులు మారినట్టు తెలుస్తోంది. వెంప, గొల్లవానితిప్ప, దిరుసుమర్రు, గూట్లపాడు, లోసరి, చినఅమిరం, మత్య్సపురి పాలెం, కొణితివాడ గ్రామాల్లో కోడిపందేలతో పాటు, గుండాట, కోతాటలు జోరుగా సాగాయి. ఉండి నియోజకవర్గంలో ఆదివారం సుమారు 10 రూ.కోట్ల రూపాయల మేర చేతులు మారాయని తెలిసింది. ఆకివీడు మండలం ఆకివీడు, అయిభీమవరం, దుంపగడప, చెరుకుమిల్లి, అప్పారావుపేట తదితర గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి.
కాళ్ల మండలం కాళ్ల, కాళ్లకూరు, సీసలి, పెదమిరం, మాలవానితిప్ప, పాలకోడేరు మండలం శృంగవృక్షం, పెన్నాడ, వేండ్ర, మోగల్లు, కోరుకొల్లు, కుముదవల్లి గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించగా అన్ని గ్రామాల్లో పేకాట కేంద్రాలు వెలిశాయి. దెందులూరు నియోజకవర్గం దెందులూరు, గంగన్నగూడెం, జోగన్నపాలెం, పోతునూరు, బి.సింగవరం, పెదపాడు మండలంలో పెదపాడు, అప్పనవీడు గ్రామాల్లో ఆదివారం పొద్దుపోయేవరకు కోడిపందాలు, పేకాట, గుండాట యథేచ్ఛగా సాగాయి. చిన్నపాటి పందేలైతే గ్రామగ్రామాన జరిగాయి. ఇప్పటివరకు పోలీసులు ఆ నియోజవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. నరసాపురం మండలం వేములదీవి, పసలదీవి, కొప్పర్రు, చిట్టవరం, పీతానిమెరక గ్రామాల్లోనూ, మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీపాలెం, శేరేపాలెం, పేరుపాలెంలో ఆదివారం విచ్చలవిడిగా పందేలు జరిగాయి.
టీపీ గూడెంకు బెంగళూరు నుంచి..
తాడేపల్లిగూడెం పట్టణం, పెంటపాడు గూడెం మండలాలలో ఆదివారం కూడా పందేలు జోరుగా సాగాయి. రాయలసీమ ప్రాంతానికి చెందినవారితో పాటు బెంగళూరు ప్రాంతానికి చెందినవారు ఈ పందేలలో పాల్గొన్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు మూడు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఆచంట నియోజక వర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో, కొవ్వూరు మండలంలో పశివేదల, తొగుమ్మి, వేములూరు, సీతంపేట,ఐ.పంగిడి గ్రామాల్లో పందాలు నిర్వహించారు. చాగల్లు మండలంలో మీనానగరం, ఉనగట్ల, చిక్కాల, మార్కోండపాడులో నిర్వహించారు. తాళ్లపూడి మండలంలో తాళ్లపూడిలో రెండు శిబిరాలు, మలకపల్లి, పెద్ధేవం, వేగేశ్వరపురం, గజ్జరం, రావూరుపాడుల్లో యథేచ్ఛగా సాగాయి.
మన్యంలోనూ జోరుగా
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం మండలంలో ఆదివారం కోడిపందేలు కొనసాగాయి. గుండాట, పేకాట, అక్రమంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. గుంజవరం, గూటాల, కోయ్యలగుడెం, రామానుజపురం, దుద్దుకూరు, భూసరాజుపల్లి, నందాపురం వీరన్నపాలెం, వేలేరుపాడులోని కమ్మరగుడెం, భూదేవిపేట, జీలుగుమిల్లిలోని తాటియాకులగుడెం, కామయ్యపాలెం, ములగలగుడెం, పి. అంకంపాలెం, రాచన్నగుడెం, కుక్కునూరులోని చీరవల్లి, టి.నర్సాపురంలోని తిరుమలదేవిపేట ప్రాంతాల్లో నాలుగురోజులుగా నిరంతరాయంగా కొనసాగాయి.
మెట్టలోనూ..
మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి మెట్ట ప్రాంత గ్రామాల్లో కూడా ముక్కనుమ నాడు కోడిపందేలు నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలం కలరాయనగూడెం, ములగలంపాడు , కామవరపుకోట మండలం వెంకటాపురం, కళ్లచెర్వు, బొర్రంపాలెం అడ్డరోడ్డు, జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు పందేలు నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం, గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామాలలో మధ్యాహ్నం వరకూ పందేలు జరిగాయి.
ఇక న్యాయ పోరాటం.. లాయర్ రాయల్
మునుపెన్నడూ లేనివిధంగా ముక్కనుమ నాడు కూడా బరితెగించి కోడిపందేలు సాగించిన నిర్వాకంపై న్యాయపోరాటం చేస్తామని ఏలూరుకు చెందిన న్యాయవాది పీడీఆర్ రాయల్ వెల్లడించారు. ఇప్పటికే పలువురు సీఐలు, ఎస్సైలకు లీగల్ నోటీసులు పోస్ట్ చేశామని చెప్పారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వరుసగా నాలుగురోజుల పాటు పోలీసులు అనధికారిక అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. ఇప్పటికే తాము ఎవరెవరు కోడిపందేలు ఆడారు.. ఎక్కడెక్కడ ఆడించారు అనే వీడియో క్లిప్పింగ్స్ తెప్పించామని చెప్పారు. నిర్వాహకులు, పందెంగాళ్లపై కోర్టు ధిక్కార కేసులు నమోదు చేస్తామని రాయల్ తెలిపారు.