
పేకాటను కట్టడి చేయాల్సిన పోలీసులే కాపు కాస్తున్నారు.. అరికట్టాల్సింది వారే ఆటాడిస్తున్నారు.. భయపెట్టాల్సి వారే ముడుపుల ముందు మోకరిల్లుతున్నారు. అధికార పార్టీ ఆగడాలను ఆడ్డుకోవాల్సిన వారే అన్యాయాలకు రక్షణ కంచె కడుతున్నారు. ఇదే అదనుగా నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కోడి పందేలు, పేకాట నిర్వహిస్తూ టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అమాయక నిరుపేదలను జూదానికి బలి చేసి పచ్చని కుటుంబాల్లో కన్నీటి చిచ్చు రేపుతున్నారు. పర్యవేక్షించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు కళ్లుమూసుకుని పోలీసు చట్టాలను వల్లె వేస్తున్నారు.
నరసరావుపేట టౌన్: నరసరావుపేట డివిజన్‌లో జూదం మళ్లీ పురుడు పోసుకుంది. కొంత మంది అవినీతి అధికారుల పుణ్యమా అంటూ జూదం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఫలితంగా అనేక కుటుంబాలు రోడ్డున పడాల్సిన దుíస్థితి నెలకొంది. నివారణకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసు సిబ్బందిలో కొందరు జూదంలో ప్రత్యక్షంగా, మరి కొందరు ముడుపులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కోడి పందేలకు రంగం సిద్ధం
నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లొ పేకాట జోరుగా కొనసాగుతుంది. దీనికి తోడు ఏడాది చివరి రోజు వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కోడి పందేలు నిర్వహించేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. నరసరావుపేట, రొంపిచర్ల మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఓ సరివి తోటలో సోమవారం రాత్రి కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికిగాను ఓ పోలీస్ అధికారి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు, కొందరు పోలీసుల అండతో ఇతర ప్రాంతాల నుంచి కూడా పేకాట రాయుళ్లు వస్తున్నారు. ప్రస్తుతం డివిజన్‌లో పోలీసుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూదంపై పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడింది. దీన్ని ఆసరాగా చేసుకొన్న అక్రమార్కులు కొంత మంది పోలీసు సిబ్బందికి ముడుపులు చెల్లించి జూదం కొనసాగిస్తున్నారు.
ఉత్తుత్తి దాడులే..
మండలంలోని లింగంగుంట్ల కాలనీ శివారులో గత బుధవారం రాత్రి దాడులు 8 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి 8 ద్విచక్రవాహనాలు, సుమారు రూ.లక్షా నలభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అనేక సార్లు లింగంగుంట్ల పరిసరాల్లో పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి జూదం నిర్వహిస్తూ అనేక మార్లు పట్టుబడినా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
ఉప్పు అందిస్తున్న సిబ్బంది
దాడులు చేసేందుకు పోలీసులు లింగంగుంట్లకు వెళ్లే లోపే కొందరు పోలీసులు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. దీంతో పేకాట రాయుళ్లు పరారవుతున్నారు. గత బుధవారం అధికారులు దాడులకు వెళ్లే కొద్ది నిమిషాల వ్యవధిలోనే అప్పటి వరకు లక్షల్లో పందేలు కాసిన సుమారు 20 మంది జారుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో దీర్ఘకాలికంగా పని చేస్తున్న సిబ్బంది ఒకరు ముందస్తుగా ఉప్పు అందించినట్లు సమాచారం.
పట్టుబడ్డ వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు
లింగంగుంట్లలో జూదం ఆడుతూ పట్టుబడ్డవారిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండటం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్‌లో రెండు నెలల క్రితం ఓ కానిస్టేబుల్ పట్టుబడ్డారు. పట్టుబడ్డ కానిస్టేబుళ్లలో ఒకరు జిల్లా రూరల్ ఎస్పీ టీంలో విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు.
కొరవడిన పర్యవేక్షణ..
నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావును వారం రోజుల క్రితం తిరుపతికి బదిలీ చేసి ఆయన స్థానంలో సత్తెనపల్లి డీఎస్పీ వీ కాలేషావలిని ఇన్‌చార్జిగా నియమించారు. డివిజన్ స్థాయి అధికారి పర్యవేక్షణ లేకపోవటాన్ని ఆసరాగా చేసుకున్న కొంత మంది అవినీతి అధికారులు, సిబ్బంది పేకాట నిర్వహించుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా నాదెండ్ల మండలం, లింగంగుంట్ల కాలనీ, కోటప్పకొండ, పమిడిపాడు, రెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు, పేకాట, జూదం ఎక్కువగా సాగుతున్నాయి.
జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు
పేకాటలో పట్టుబడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులకు నివేదించాం. పేకాట, కోడి పందేల నిర్వహణపై సమాచారం ఉంటే తెలియజేయాలి. అక్రమార్కులకు సహకరిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు. జూదగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం.
–కాలేషావలి, డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment