తిరుమలలో గుట్టలుగా పేరుకుపోయిన నాణేలు | Coins Stack Jammed in TTD Officials Negligence | Sakshi
Sakshi News home page

నాణేనికి మరోవైపు..

Published Mon, Aug 27 2018 11:25 AM | Last Updated on Mon, Aug 27 2018 11:25 AM

Coins Stack Jammed in TTD Officials Negligence - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు నాణేల రూపంలో సమర్పించిన కానుకలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. టీటీడీ నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల విలువచేసే స్వదేశీ, విదేశీ నాణేలు చిల్లర పెంకులతో సమానమయ్యాయి. స్వదేశీ నాణేలు 35 టన్నులు, మలేషియాకు చెందిన నాణేలు(రింగిట్‌) 40 టన్నులు వృథాగా మిగిలిపోయాయి. దేశ విదేశాల్లోని భక్తులు ఎంతో భక్తితో పైసా పైసా కూడబెట్టి స్వామివారి హుండీలో వేసిన కానుకలను చెలామణి చేసి దైవ కార్యక్రమాలకు వినియోగిస్తే వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. అయితే భక్తులు ఏ ఉద్దే శంతో అయితే కానుకలను స్వామి వారికి సమర్పించారో అది నెరవేరకుండా పోయిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పేరుకుపోయిన ఈ నాణేలను కరిగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఏళ్ల తరబడి నిల్వ..
టీటీడీ వద్ద సంవత్సరాల తరబడి 25 పైసలు, అంతకంటే తక్కువ విలువ గల ఐదు, పది, ఇరవై పైసలనాణేలు భారీ ఎత్తున నిల్వ ఉన్నాయి. 2011 జూన్‌ 30 నుంచి 25 పైసలు, అంతకంటే తక్కువ విలువైన స్వదేశీ నాణేలను చెలామణి నుంచి తప్పిస్తూ రిజర్వుబ్యాంకు నిర్ణయం తీసుకుంది. బయట చెల్లకున్నా... ఆ నాణేలను బ్యాంకులు 2014 ఫిబ్రవరి దాకా స్వీకరించాయి. గడువు తరువాత బ్యాంకులు ఆ నాణేలను తీసుకోవడం మానేశాయి. అయితే వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకుల్లో జమ చేయకుండా నిల్వ ఉంచింది. దీంతో టీటీడీ వద్ద స్వదేశీ నాణేలు మాత్రమే 35 టన్నుల వరకు నిల్వ ఉండిపోయాయి. తీరా గడువు పూర్తయ్యాక ఆ నాణేలను ఏమి చేయాలనే విషయంపై టీటీడీ ఆర్‌బీఐకి లేఖ రాసింది. బ్యాంకుల ద్వారా వెనక్కు తీసుకున్న చెల్లుబాటులో లేని నాణేలను తమిళనాడు సేలంలోని సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)కు తరలించి అక్కడ కరిగిస్తున్నామని, మీరు కూడా సెయిల్‌ను సంప్రదించమని సూచించింది. ఆర్‌బీఐ సూచన మేరకు టీటీడీ సెయిల్‌ను సంప్రదించింది. అయితే నాణేలను కరిగించగా వచ్చే లోహం విలువకు నగదు రూపంలో చెల్లించలేమని, టీటీడీ ఏవైనా ఆర్డర్లు (యంత్రాలు, పరికరాలు) ఇస్తే ఆ బిల్లులో సర్దుబాటు చేస్తామని తేల్చిచెప్పింది. ఇక చేసేది లేక టీటీడీ సెయిల్‌కు ప్రతిపాదనకు అంగీకరించింది.

మలేషియా నాణేలు ఎలా?
టీటీడీ వద్ద మలేషియా నాణేలు కూడా టన్నుల కొద్ది పేరుకుపోయి ఉన్నాయి. మలేషియా నాణేన్ని అక్కడ (రింగిట్‌) అంటారు. మన డబ్బుతో పోల్చితే మలేషియా నాణెం (రింగిట్‌) విలువ రూ.17. మనకు పావలా, అర్థరూపాయి, రూపాయి నాణేలు ఉన్నట్లు మలేషియాలో 5 సెంట్లు, 10 సెంట్లు, 20 సెంట్లు, 50 సెంట్లు, డాలర్లు, ఇతర నాణేలు ఉండేవి. వివిద దశల్లో విడుదల చేసిన ఈ నాణేల్లో భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని గుర్తించి మలేషియా సెంట్రల్‌ బ్యాంక్‌ 2005 డిసెంబర్‌ 7న నుంచి వాటి చెలా మణి రద్దు చేసింది. ప్రజల వద్ద ఉన్న నాణేలను బ్యాంకులు నిర్ణీత గడువులోపు వెనక్కు తీసుకున్నాయి. ఆ సమయంలో కూడా టీటీడీ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో 40 టన్నుల మలేషియా నాణేలు తిరుమలలో మిగిలిపోయాయి. మన పెద్ద నోట్లను ఏ విధంగానైతే రూ.40 కోట్లను టీటీడీ మూలనపడేసిందో మలేషియా నాణేలను కూడా పడేయాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement