భీమవరంలోని శ్రీరామపురంలో ఓ ఇంటికి వెళ్లి నవశకం సర్వేపై ఆరా తీస్తున్న కలెక్టర్ ముత్యాలరాజు
పట్టణంలో శ్రీరామపురంలోని ఓ ఇంటి వద్ద శుక్రవారం కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులు, సిబ్బందితో సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. అక్కడి ప్రజలు తేరుకునేలోగానే నవశకం సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. వలంటీర్లు సర్వే చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన భీమవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో నవశకం, పట్టణంలో డంపింగ్‌యార్డుకు అవసరమైన భూమి సేకరణపై సమీక్ష నిర్వహించారు.
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): పట్టణంలో అధికారులతో సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 20 వరకూ నవశకంపై వలంటీర్లు సర్వే చేస్తారన్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ కానుక కార్డులకు లబ్ధిదారుల సమాచారం పక్కాగా సేకరించడానికి వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారన్నారు. పట్టణంలో 40 వార్డు సచివాలయాలు ఉండగా నాలుగు వార్డులకు ఒకరు చొప్పున 10 మంది సూపర్‌వైజర్లను నియమించి సర్వే చేయిస్తున్నామన్నారు. సర్వే అనంతరం వార్డు సభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తామన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టణంలో సదరమ్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారని చెప్పారు. అయితే ప్రతి నియోజకవర్గంలో సదరమ్ క్యాంపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. నర్సాపురం సబ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ ఎం.అమరయ్య, అసిస్టెంట్ కమిషనర్ బి,జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దిరుసుమర్రులో తనిఖీలు
భీమవరం అర్బన్: మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ రేవు ముత్యాలరాజు పరిశీలించారు. పాఠశాలలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను మౌలిక వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం గ్రామ సచివాలయంకు వెళ్లి పలు పథకాల అమలు, నవశకం సర్వే వివరాల రికార్డులు పరిశీలించారు. అనంతరం భీమవరం వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment