sudden visit
-
రూయా చిన్న పిల్లల ఆసుపత్రి.. భేష్
సాక్షి, తిరుపతి: రూయా చిన్నపిల్లల ఆసుపత్రిని జాతీయ బాలల హక్కుల కమిషన్(NCPCR) సభ్యులు డాక్టర్ ఆర్.జి ఆనంద్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అక్కడి సేవలు, సిబ్బంది పని తీరుపై అభినందనలు గుప్పించారు. శనివారం సాయంత్రం స్థానిక రుయా ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగంలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ వార్డును ఆకస్మిక తనిఖీ చేశారు ఆర్జీ ఆనంద్. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లలకు అందుతున్న సేవలను వారి తల్లులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారాయన. ఈ సందర్భంగా.. అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన చికిత్స విధానం, అక్కడి పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఏర్పాటు చేసిన వార్డులలో చికిత్స పొందుతున్న పోషకాహార లోపం గల పిల్లలు, ఎదుగుదల లేని పిల్లలకు అందిస్తున్న చికిత్స విభాగాన్ని.. సంబంధిత విభాగపు హెచ్‌వోడి డా. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. అందులో రోజు వారీగా అందిస్తున్న మెనూ చార్టు, కిచెన్ పరిశీలించి అందులో పిల్లలకు అందిస్తున్న ఎన్ఆర్సీ లడ్డు ను రుచి చూసి చాలా నాణ్యత గల పౌష్టికాహారం అందిస్తున్నందుకు అధికారులను అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం, విద్యా, బాలల శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఆసుపత్రి విభాగాలలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నందుకు వారికి వారి సిబ్బందిని అభినందించారు. పిల్లలకు కౌన్సెలింగ్ రూము, ఆట పాటలకు ఎన్ఆర్సి విభాగంలో ఏర్పాటు బాగుందని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం జగన్.. ఇద్దరూ వైద్య ఆరోగ్యానికి, ఆసుపత్రుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కు బాలల శ్రేయస్సు కు పెద్ద పీట వేస్తున్నారని, ఇది శుభ పరిణామం అని పేర్కొన్నారాయన. ఆసుపత్రికి సంబంధించిన బాలలకు ఉపయోగపడే మెరుగైన విధానాల అమలుకు ఏమైనా సహకారం కావాలంటే అందిస్తామని తెలిపారు. ఆసుపత్రి పనితీరు, పరిసరాల పరిశుభ్రత, వైద్య సదుపాయాలు చాలా బాగా ఉన్నాయని కితాబిచ్చారు. తొందరలోనే పూర్తి స్థాయి సభ్యులతో వచ్చి సందర్శిస్తామని తెలిపారు. తనిఖీ సందర్భంగా ఆయన వెంట రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థ సారథి రెడ్డి, సి ఎస్ ఆర్ ఎంఓ లక్ష్మా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, పి ఆర్ ఓ కిరణ్ ఇతర వైద్యాధికారులు ఉన్నారు. -
Joe Biden: అమెరికా అధ్యక్షుడి బిగ్ సర్ప్రైజ్
కీవ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ సైతం చేశారు. మరికొద్ది రోజుల్లో(ఫిబ్రవరి 24వ తేదీ) ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలై ఏడాది పూర్తి కానుంది. ఈ దరిమిలా ముందుగానే ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించినట్లు స్పష్టం అవుతోంది. ఏడాది కిందట పుతిన్ ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టినప్పుడు.. ఉక్రెయిన్ బలహీనమైందని, పాశ్చాత్య దేశాలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయని భావించాడు. అతను మమ్మల్ని అధిగమించగలడని అనుకున్నాడు. కానీ అతను పెద్ద తప్పిదం చేశాడు. ఈ ఏడాది కాలంలో అట్లాంటిక్, ఫసిపిక్ పరిధిలో ఉన్న అన్ని దేశాలు ఉక్రెయిన్ పోరాటానికి కావాల్సిన అన్నిరకాల సాయాన్ని అందిస్తూ వస్తున్నాయి. అందుకు అమెరికా ఒక సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసింది అని ట్వీట్ చేశారాయన. అలాగే.. ఏడాది కాలం దగ్గర పడుతున్న తరుణంలో కీవ్‌లో పర్యటిస్తున్నట్లు.. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల మా(అమెరికా) తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించినట్లు బైడెన్ ట్వీట్లు చేశారు. As we approach the anniversary of Russia’s brutal invasion of Ukraine, I'm in Kyiv today to meet with President Zelenskyy and reaffirm our unwavering commitment to Ukraine’s democracy, sovereignty, and territorial integrity. — President Biden (@POTUS) February 20, 2023 ఇక యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు.. ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. కిందటి ఏడాది డిసెంబర్లో అమెరికా పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. యూఎస్ చట్టసభలో ప్రసగించి.. యుద్ధంలో మద్దతు కోరారు. ఇక ఈ ఏడాది జనవరిలో యూఎస్ సెనేటర్ల బృందం ఒకటి కీవ్‌లో పర్యటించింది. వాస్తవానికి ఆయన పోలాండ్‌లో పర్యటిస్తారని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ల్యాండ్ అయ్యి సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. A video of Joe Biden's visit to Ukraine. 1/4 - The moment when Biden arrived and was welcomed by Zelenskyi and his wife. Shortly after he met with Ukrainian officials. pic.twitter.com/3iIxmiD32T — NOËL 🇪🇺 🇺🇦 (@NOELreports) February 20, 2023 -
ఆకస్మికంగా వచ్చి.. ఆవేదన తెలుసుకుని
వంగర: శనివారం రాత్రి 9.20 గంటలు. ఎం.సీతారాంపురం నిశ్శబ్దంగా ఉంది. ప్రజలంతా నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో గ్రామంలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. కాన్వాయ్ వచ్చి ఆగడంతో ఏమై ఉంటుందోనని అంతా గుమిగూడడం మొదలుపెట్టారు. అంతలో కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ కారు దిగడంతో అంతా ఆశ్చర్యపోయారు. జిల్లా కేంద్రంలో రాత్రి పొద్దుపోయే వరకు వరుస సమావేశాలతో బిజీగా గడిపిన కలెక్టర్ పల్లె నిద్ర చేయాలని నిర్ణయించుకుని అప్పటికప్పుడు ఎం. సీతారాంపురం గ్రామాన్ని ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా శ్రీకాకుళం నుంచి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహానికి వచ్చారు. తహసీల్దార్ డి.ఐజాక్ అప్పటికప్పుడు చేరుకుని కలెక్టర్ ను స్వాగతించారు. సమాచారం అందుకున్న మండల ప్రత్యేకాధికారి డాక్టర్ బొత్స జయ ప్రకాష్, ఎంపీడీఓ డొంక త్రినాథ్, డీఎస్పీ శ్రావణి కూడా అక్కడకు చేరుకున్నారు. కలెక్టర్ రాకను తెలుసుకు న్న కొందరు అధికారులు శ్రీకాకుళం, రాజాం, పా లకొండ నుంచి వాహనాలపై హడావుడిగా ఎం. సీతారాంపురం చేరుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ కళావతి ఆధ్వర్యంలో స్థానికులు వచ్చి కలెక్టర్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు. ►ప్రధానంగా తాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. స్థానికుల ఆవేద న చూసి కలెక్టర్ చలించిపోయారు. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ►సచివాలయ వ్యవస్థ, ఉద్యోగుల సేవలపై ఆరా తీయగా.. కొందరు సమయపాలన పాటించడం లేదని, ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని బదులిచ్చారు. ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించగా.. అన్నీ బాగున్నాయన్నారు. వైద్య సిబ్బంది సేవలపై కూడా జనం సంతృప్తి వ్యక్తం చేశారు. ►వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, కిమిడి ఉమామహేశ్వరరావు తోటపల్లి కుడి ప్రధాన కాలువలో జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరగా.. నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ చెప్పారు. కిమ్మి–రుషింగి వంతెన పనులు పూర్తి చేయాలన్నారు. ► వంగరలో సచివాలయ నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని సర్పంచ్ ప్రతినిధి కనగల పారినాయుడు కోరారు. ఎం.సీతారాంపురానికి ఆధార్ కేంద్రం మంజూరు చేయాలని స్థానికులు కోరా రు. అనంతరం అక్కడే రాత్రి భోజనం చేశారు. బొత్స ప్రవీణ్‌కుమార్ అనే సచివాలయ ఉద్యోగి తన ఇంటి నుంచి సామగ్రిని తీసుకువచ్చి కలెక్టర్ నిద్రకు హాస్టల్లోని ఓ గదిని సిద్ధం చేశారు.11 గంటలకు ఆయన నిద్రకు ఉపక్రమించారు. గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ నిద్రకు ఉపక్రమిస్తున్న కలెక్టర్ -
సెల్యూట్.. బ్రేవ్ హార్ట్స్!
లేహ్/న్యూఢిల్లీ: విస్తరణ వాదానికి కాలం చెల్లిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన చైనాకు స్పష్టమైన సందేశమిచ్చారు. ఇది ప్రగతి వాద యుగమని అర్థం చేసుకోవాలన్నారు. ప్రపంచమంతా అభివృద్ధి వైపే పయనిస్తోందన్నారు. విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో, పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోందన్నారు. సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరించారు. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడుతూ.. సరిహద్దుల్లోని వీర జవాన్ల ధైర్య సాహసాలను ఇప్పుడు దేశమంతా ఘనంగా చెప్పుకుంటోందంటూ ఆ బ్రేవ్ హార్ట్స్‌కు సెల్యూట్ చేశారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ప్రధాని మోదీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ సందర్భంగా ‘నిము’లో ఉన్న ఫార్వర్డ్ పోస్ట్ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి దాదాపు అరగంట పాటు ఉద్వేగపూరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణల్లో అసువులు బాసిన అమర జవాన్లకు మరోసారి ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాన్ని దేశం తరతరాలు గుర్తు పెట్టుకుంటుందని శ్లాఘించారు. భరతమాత శత్రువుకు భారతీయుల ఆగ్రహావేశాలను రుచి చూపించారని ‘14 కార్ఫ్స్’ సైనికులపై ప్రశంసలు గుప్పించారు. ‘పిరికివారు, బలహీనులు శాంతిని సాధించలేరు. శాంతి నెలకొనేందుకు ముందుగా ధైర్యసాహసాలు అత్యంతావశ్యకం’ అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆ ధైర్య సాహసాలు భారత జవాన్ల వద్ద పుష్కలంగా ఉన్నాయన్నారు. భారత సాయుధ దళాల శక్తి, సామర్థ్యాలను ప్రపంచం గమనించిందని, గల్వాన్ లోయ ఘటనను పరోక్షంగా ప్రస్తావించారు. ‘మీ ధైర్య సాహసాలు మీరు గస్తీ కాస్తున్న ఈ పర్వతాల కన్నా సమున్నతమైనవి. దేశ రక్షణ మీ చేతుల్లో భద్రంగా ఉందన్న భరోసా నాకే కాదు.. దేశ ప్రజలందరిలోనూ ఉంది. మీరంతా మాకు గర్వకారణం’ అని కొనియాడారు. ‘లేహ్, లద్దాఖ్, కార్గిల్, సియాచిన్.. ఈ సరిహద్దుల్లోని ఎత్తైన మంచు పర్వతాలు, ఇక్కడి నదుల్లో ప్రవహించే చల్లని నీరు భారతీయ జవాన్ల వీరత్వానికి మౌన ప్రేక్షకులుగా నిలుస్తాయ’ని అభివర్ణించారు. సింధూ నది ఒడ్డున.. ప్రధానితో పాటు ఈ ఆకస్మిక పర్యటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పాల్గొన్నారు. ‘నిము’ 11 వేల అడుగుల ఎత్తున సింధు నది ఒడ్డున ఉన్న కఠిన భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న ఆర్మీ ఫార్వర్డ్ పోస్ట్. దీని చుట్టూ జన్స్కర్ పర్వతాలున్నాయి. అక్కడ భారత జవాన్లతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్మీ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి కమాండర్లు ఆయనకు వాస్తవాధీన రేఖ స్థితిగతులను వివరించారు. ప్రపంచం మీ గురించే మాట్లాడుకుంటోంది గల్వాన్ ఘర్షణల్లో గాయపడి, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధాని పరామర్శించారు. శత్రువుకు సరైన గుణపాఠం చెప్పారని వారిని ప్రశంసించారు. వారి ధైర్యసాహసాలను, వారు చిందించిన రక్తాన్ని దేశం మర్చిపోదన్నారు. గల్వాన్‌లో భారతీయ జవాన్లు చూపిన సాహసం గురించి ప్రపంచం మాట్లాడుకుంటోందన్నారు. వారి గురించి, వారికి అందించిన శిక్షణ గురించి, వారి నిబద్ధత గురించి తెలుసుకోవాలనుకుంటోందన్నారు. ‘మీ ధైర్య సాహసాలు భారతదేశ యువతకు స్ఫూర్తినిస్తున్నాయి’ అన్నారు. ఏడు వారాలుగా ప్రతిష్టంభన గత ఏడు వారాలుగా భారత, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంట తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. జూన్ 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. చరిత్ర చూడు ‘ప్రపంచ యుద్ధాల సమయంలో కానీ, శాంతి సమయంలో కానీ.. మీ సేవలను ప్రపంచం ఏనాడో గుర్తించింద’ని భారత సైనికులను ప్రధాని ప్రశంసించారు. ‘వేణువూదే కృష్ణుడినే కాదు.. శత్రువుపై సుదర్శన చక్రం ప్రయోగించే కృష్ణుడినీ మనం పూజిస్తామ’న్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, స్నేహం, ధైర్యం.. శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో భాగమైన విధానాన్ని ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. ప్రగతిదాయక శాంతియుత భారతదేశాన్ని కకావికలు చేసే అన్ని కుయత్నాలను విజయవంతంగా అడ్డుకుని, తగిన గుణపాఠం చెప్పిన చరిత్ర భారత్‌కు ఉందన్నారు. ‘అందరితో శాంతిపూర్వక స్నేహ సంబంధాలనే భారత్ కోరుకుంటుంది. అలా అని, అది భారతదేశ బలహీనతగా భావించవద్దు’ అని హెచ్చరించారు. సాయుధ దళాల అవసరాలకు తన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన కోసం గతంలో కన్నా మూడురెట్లు ఎక్కువగా నిధులను కేటాయించామన్నారు. సాయుధ దళాల సహకారంతోనే స్వావలంబ భారత్ లక్ష్యం సాకారమవుతుందన్నారు. ‘మన శక్తిసామర్థ్యాలు, దేశ రక్షణ కోసం మనం చేసే ప్రతిజ్ఞ.. హిమాలయాలంత సమున్నతమైనవి’ అన్నారు. స్ఫూర్తిదాయక ప్రసంగం: బీజేపీ లద్దాఖ్‌లో సాయుధ దళాల్లో స్ఫూర్తి నింపేలా ప్రధాని మోదీ ప్రసంగించారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయుల భావాలను ప్రధాని వ్యక్తం చేశారని నడ్డా ట్వీట్ చేశారు. రాజ్యం వీర భోజ్యం అని అర్ధం వచ్చేలా ‘వీర భోగ్య వసుంధర’ అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత్‌కు జపాన్ బాసట చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు జపాన్ నుంచి గట్టి మద్దతు లభించింది. వివాద ప్రాంతంలో యధాతథ స్థితిని మార్చే ఏ ఏకపక్ష చర్యలనైనా వ్యతిరేకిస్తామని జపాన్ స్పష్టం చేసింది. చర్చల ద్వారా శాంతియుతంగా ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు భారత్‌లో జపాన్ రాయబారి సతోషి సుజుకి అన్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లాతో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు. వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితిని ష్రింగ్లా ఆయనకు వివరించారు. బలమైన భారత్‌కు బలహీన ప్రధాని: కాంగ్రెస్ బలమైన భారత్‌కు ఇంత బలహీన ప్రధాని ఏమిటని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇటీవలి తన ప్రసంగాల్లో కనీసం చైనా పేరును కూడా ఉచ్ఛరించలేనంత బలహీన ప్రధాని అని మోదీని విమర్శించింది. ప్రధాని భారతదేశం పట్ల కన్నా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పట్ల ఎక్కువ విశ్వసనీయంగా ఉంటున్నారని ఎద్దేవా చేసింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లద్దాఖ్ ప్రజలు చెబుతుంటే.. ప్రధాని మోదీ మరోలా చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఉద్రిక్తతలు పెంచే పనులొద్దు: చైనా లద్దాఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటనపై చైనా స్పందించింది. మోదీ లద్దాఖ్ అనూహ్య పర్యటన చైనాను ఉలిక్కిపడేలా చేసింది. దాంతో, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలు పెరిగేలా వ్యవహరించకూడదని పేర్కొంది. రెండు దేశాల మధ్య మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో ఉద్రిక్తతలు పెరిగే చర్యలకు రెండు దేశాలు ఉపక్రమించడం మంచిది కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్ వ్యాఖ్యానించారు. భారత్‌లోని వ్యాపారాలకు సంబంధించి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చైనాను విస్తరణ వాద దేశంగా భావించడం అర్థరహితమని భారత్‌లో చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జీ రాంగ్ ట్వీట్ చేశారు. -
ఆ కలెక్టర్ ఇళ్లకూ వచ్చేస్తున్నారు..!
పట్టణంలో శ్రీరామపురంలోని ఓ ఇంటి వద్ద శుక్రవారం కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులు, సిబ్బందితో సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. అక్కడి ప్రజలు తేరుకునేలోగానే నవశకం సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. వలంటీర్లు సర్వే చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన భీమవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో నవశకం, పట్టణంలో డంపింగ్‌యార్డుకు అవసరమైన భూమి సేకరణపై సమీక్ష నిర్వహించారు. సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): పట్టణంలో అధికారులతో సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 20 వరకూ నవశకంపై వలంటీర్లు సర్వే చేస్తారన్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ కానుక కార్డులకు లబ్ధిదారుల సమాచారం పక్కాగా సేకరించడానికి వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారన్నారు. పట్టణంలో 40 వార్డు సచివాలయాలు ఉండగా నాలుగు వార్డులకు ఒకరు చొప్పున 10 మంది సూపర్వైజర్లను నియమించి సర్వే చేయిస్తున్నామన్నారు. సర్వే అనంతరం వార్డు సభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తామన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టణంలో సదరమ్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారని చెప్పారు. అయితే ప్రతి నియోజకవర్గంలో సదరమ్ క్యాంపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. నర్సాపురం సబ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ ఎం.అమరయ్య, అసిస్టెంట్ కమిషనర్ బి,జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దిరుసుమర్రులో తనిఖీలు భీమవరం అర్బన్: మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ రేవు ముత్యాలరాజు పరిశీలించారు. పాఠశాలలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను మౌలిక వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం గ్రామ సచివాలయంకు వెళ్లి పలు పథకాల అమలు, నవశకం సర్వే వివరాల రికార్డులు పరిశీలించారు. అనంతరం భీమవరం వెళ్లిపోయారు. -
గురుకులం నిర్వహణపై కలెక్టర్ కన్నెర్ర
సాక్షి, శ్రీకాకుళం : కలెక్టర్ జి.నివాస్ హఠాత్తుగా కంచిలిలోని ఏపీ బాలయోగి గురుకులంలో ప్రవేశించారు. నేరుగా భోజన శాల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పిల్లలకు ఏం వడ్డించారో స్వయంగా చూసి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్దేశించిన మెనూ అమలు కాలేదని గ్రహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సివుండగా.. వారు ఇళ్లకు వెళ్లినట్టు తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. గురుకులం ప్రిన్సిపాల్, నలుగురు టీచర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఎందుకు వడ్డించలేదని ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్‌ను ప్రశ్నించారు. కేవలం పప్పుచారుతోనే పిల్లలు ఎలా తింటారని నిలదీశారు. దీనికి గల కారణమేంటని ప్రశ్నించగా కూరలు తీసుకురావడం ఆలస్యమైందని ప్రిన్సిపాల్ చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సమయంలో ఉపాధ్యాయులు, మిగ తా సిబ్బంది హాజరును పరిశీలించగా, అప్పటికి నలుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. దీనిపై కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేయకుండా ఇంటికి వెళ్లడం ఏమిటని నిలదీశారు. పిల్లలకు పప్పుచారుపెట్టి .. మీరు మాత్రం మాంసాహా రాలుతినడానికి ఇళ్లకు వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. నాలుగో వంతు పిల్లలు కూడా లేరు కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో 400 మంది పిల్లలకు 70 నుంచి 80 మంది మాత్రమే హాజరు కావడం, వారు కూడా యూనిఫారాలు ధరించకపోవడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ఇదేం క్రమశిక్షణ అని ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రశ్నించారు. కలెక్టర్ పర్యటనలో గురుకుల నిర్వహణ తీరు, విద్యార్థుల వసతి తదితర అంశాలను, రికార్డులను పరిశీలించారు. దాదాపు 40 నిమిషాలపాటు ఆయన తనిఖీలు కొనసాగాయి. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ.. లోపాలకు గల కారణాలను గురుకుల సిబ్బందిని అడిగారు. వారి సమాధానాలకు కలెక్టర్ సంతృప్తి చెందకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన సిబ్బందిలో కన్పించింది. ఈ చర్యలకు బాధ్యులను చేస్తూ గురుకుల ప్రిన్సిపాల్ ఎన్.బాలాజీ నాయక్, ఉపాధ్యాయులు టి.వి.రమణ, పి.సురేష్, జి.జయరాం, పి.అమ్మాయమ్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ జి.నివాస్ ప్రకటించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్‌తోపాటు మండల ప్రత్యేకాధికారి ఆర్.వరప్రసాద్, తహసీల్దార్ కె.డిసెంబరరావు, ఎంపీడీఓ చల్లా శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ముత్తంగిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
సాక్షి, సంగారెడ్డి జిల్లాః కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ముత్తంగి గ్రామంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. గ్రామంలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.12న పల్లె నిద్ర, 13న మెగా శ్రమదానం నిర్వహించాలని సూచించారు. మెగా శ్రమదానం కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతీఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ ప్రత్యేకాధికారి శైలజ (హార్టికల్చర్ ఆఫీసర్) కు షోకాస్ నోటీస్ జారీ చేశారు. -
పీవీపీ షాపుల్లో మంత్రి పుల్లారావు తనిఖీలు
సాక్షి, అమరావతి : విదేశీ కంపెనీలు వస్తువులను అనుమతి లేకుండా అమ్ముతున్న షాపుల్లో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. బుధవారం విజయవాడలోని పీవీపీ మల్టీప్లెక్స్ మాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...18 షాపులను తనిఖీ చేశామని తెలిపారు. విదేశీ కంపెనీలు వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్నాయని, సెలక్ట్ చానల్ పేరుతో ఒకే రకమైన ఉత్పత్తులపై వేర్వేరు రేట్లు ముద్రిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, అనుమతి తేకుండా అమ్ముతున్న షాపులపై కేసులు నమోదు చేస్తామన్నారు. వ్యాపారస్తులు ఇష్టం వచ్చిన ఎమ్మార్పీకి జీఎస్టీని కలపడం వంటివి జరుగకుండా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చట్టంలో మార్పులు తీసుకురావాలని అన్నారు. లోకల్ బ్రాండ్ వాటర్ బాటిల్ రేటు కూడా దారుణంగా పెంచేశారని, గోల్డు షాపుల్లో ఎక్కువ మంది వినియోగదారులు నష్టపోతురన్నారు. అదేవిధంగా పెట్రోలు, గ్యాస్, ఎరువుల తూకాల్లో మోసాలు జరుతున్నాయని, ప్రజలు వీటిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలని సూచించారు. -
ఈ నూనె.. ఆ నూనేనా..?
కాచిగూడ: ‘‘ఈ నూనె ఏ కంపెనీది? ఎన్ని సార్లు వేడి చేశారు? ఈ నూనెతో ఏమేం వండుతున్నారు? మీ ఇంటిని ఇలాగే ఉంచుకుంటారా? హోటల్ని ఇంత అధ్వానంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? రోజు ఇక్కడే టీ తాగుతావా? ఇందులో వాడే పాలు, టీ పొడి నాణ్యమైనవేనా? మీ బేకరీకి పర్మిషన్ ఉందా? సోడాలో వాడే ఐస్ ఎక్కడి నుంచి తెస్తున్నావు’’? అంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆయా వ్యాపారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆహార తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన నారాయణగూడ వైఎంసీఏ రోడ్డులో ఉన్న ఆల్‌సబా రెస్టారెంట్, న్యూ బేక్‌జోన్, శ్రీ సాయికృష్ణ టిఫిన్ సెంటర్ తదితర వాటిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ వాడుతున్న నూనె, పిండి, రంగులు, మటన్, చికెన్, పాలు, చాయ్‌పత్తాతో పాటు మంచినీటిని సేకరించి పరీక్షించారు. పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్ల యజమాన్యాలు వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆహార భద్రత చట్టంలో మార్పులు చేస్తున్నామని పదార్థాల విక్రయదారులు సేప్టీ మేజర్స్ పాటించాలని, అవసరానికి మించి కలర్స్ వాడొద్దని సూచించారు. మంత్రి వెంట ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ కె.శంకర్ ఉన్నారు. -
రోగులను ఇబ్బంది పెట్టొద్దు
వనపర్తి టౌన్ : ‘కేసీఆర్ కిట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సర్కారు దవాఖానాలకు వస్తున్నారు.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలి.. అని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆస్పత్రి ఆవరణలో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలతోపాటు ఓపీకి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపీ, ల్యాబ్ సేవలను సైతం కంప్యూటరీకరణ చేయాలని, రోగులు వారికి వచ్చిన రోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం పక్కాగా ఉండాలన్నారు. వైద్యులు రోగులను పరీక్షించిన తర్వాతే ల్యాబ్‌కు పంపాలని సూచించారు. జిల్లాకు ఎంసీహెచ్‌ఎస్ కేంద్రం మంజూరైందని వెల్లడించారు. ఖాళీ స్థ«లాన్ని, సామూహిక వంటశాలను వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. సీసీ రోడ్లుకు ప్రతిపాదనాలు పంపాలని కన్సల్టెన్సీ ప్రదీప్‌ను సూచించారు. కాన్పులు, ఓపీ, ఇన్పేషంట్కు తగ్గట్టుగా సిబ్బంది నియమించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్ఎంఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు సిద్ధంకండి మార్చిలో నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్షలకు అధికారులు ఇప్పటినుంచే సిద్ధం కావాలని కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, 28 నుంచి 19 వరకు రాతపరీక్షలు ఉంటాయని తెలిపారు. ఫస్టియర్‌లో 7,606, సెకండియర్‌లో 7,280 మొత్తం 14886 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇందుకు గాను జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రయ్య, ఏఎస్పీ సురెందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సింహయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక చేయూత పథకాలపై సోషల్ ఆడిట్ ఆయా సంక్షేమశాఖల ద్వారా ఆర్థిక చేయూతనిచ్చే పథకాల యూనిట్లపై ఫిబ్రవరి 7 నుంచి సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం తన చాంబర్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో గ్రౌండింగ్ చేసిన రుణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2015–16 సంవత్సరంలో యూటిలైజేషన్ ధ్రువపత్రాలు, 2016–17 సంవత్సరంలో యూనిట్ల గ్రౌండింగ్ల రుణాలపై సమీక్షించారు. 2015–16 లో 83 బీసీ యూనిట్లకు గాను కేవలం 5 యూనిట్ల యూసీలు వచ్చాయని, 226 గిరిజన యూనిట్లకు గాను 74 యూసీలు వచ్చాయని మిగతా వెంటనే సమర్పించాలన్నారు. కొత్త యూనిట్ల గ్రౌండింగ్ విషయంలో అందరు చొరవ చూపాలని ఆదేశించారు. -
గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవో సరస్వతిపై వేటు
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవో సరస్వతిపై వేటు పడింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆమెను డీఎంఈకి సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. బుధవారం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి, రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. విధులను నిర్లక్ష్యం చేయటంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోనట్లుగా తేలిన ఆర్ఎంవో, డిప్యూటీ సివిల్ సర్జన్ సరస్వతిని డీఎంఈకి సరెండర్ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. రోగుల విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదని, అలాగే విధుల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడివారు ఎంతటివారినైనా ఉపేక్షించేది లేనది లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసినందుకు సరస్వతిపై వేటు పడినట్లు సమాచారం. ఇటీవలి గాంధీ ఆస్పత్రిలో వీల్ చైర్స్ కొరత, సాయి ప్రవళిక మృతి తదితర అంశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
‘గాంధీ’లో లక్ష్మారెడ్డి తనిఖీ, అధికారులతో భేటీ
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఎక్కడ సమస్య వచ్చినా ఆర్‌ఎంవోలదే బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంత్రి సి.లక్ష్మారెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. నెల రోజుల్లో ఇక్కడ 65 పడకల ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి అధునాతన యంత్ర పరికరాలతో మరో ల్యాబ్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గాంధీలో ప్రస్తుతం 100 బెడ్లు ఉండగా రెండువేలమంది ఇన్ పేషెంట్లకు చికిత్స అందుతోందని వివరించారు. ఇకపై వైద్యులకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 157 పీజీ సీట్లు తెలంగాణకు ఇవ్వడం గొప్ప ఘనత అని చెప్పుకోవచ్చునన్నారు. గాంధీలో కొందరు బయటి వ్యక్తులు పెత్తనం చేస్తున్నారని, ప్రమేయాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు. నర్సుల భర్తీ ఈ వారంలో నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు. సాయి ప్రవళిక మృతిపై ఆయన మాట్లాడుతూ..పాప బతకదని వైద్యులు ముందే డిక్లేర్ చేశారని, కావాలనే ఆ ఘటనను వివాదం చేశారని, మీడియాను కొంత మంది పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమణి, గాంధీ వైద్యశాల ప్రిన్సిపాల్, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ మంజుల తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల అలసత్వంపై ఎస్పీ కొరడా
– అర్ధరాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీ – వన్‌టౌన్ ఏఎస్ఐపై బదిలీ వేటు – ఇద్దరు కానిస్టేబుళ్లు వీఆర్‌కు – ఏఆర్పీసీ పక్కిరయ్యకు చార్జిమెమో కర్నూలు : విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసు సిబ్బందిపై ఎస్పీ ఆకే రవికృష్ణ కొరడా ఝుళిపించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏఆర్ హెడ్ క్వార్టర్, సెక్యూరిటీ గార్డ్ రూమ్స్‌తో పాటు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గస్తీ పాయింట్స్‌ను కూడా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో బీట్ పుస్తకాలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోలింగ్, గస్తీ విధులకు అలాట్ చేసిన కానిస్టేబుళ్లు ఆ విధులు మాని పోలీస్ స్టేషన్లోనే ఉండటంతో వారిని ఎస్పీ విచారించారు. విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్‌టౌన్ ఏఎస్ఐ పి.వి.రామిరెడ్డిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా శ్రీశైలంకు బదిలీ చేశారు. అదే స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎంవీ రమణ(పీసీ 2359), డి.వీరారెడ్డి (పీసీ 1826) విధుల్లో లేకుండా స్టేషన్లోనే ఉండటంతో వీఆర్‌లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. రాత్రిపూట గస్తీ, పెట్రోలింగ్ విధులు నిర్వహించే పోలీసులు ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించే విధంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పెట్రోలింగ్, డే, నైట్ బీట్ చెకింగ్‌కు వెళ్లే సిబ్బంది విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఐ, ఎస్‌లకు సూచించారు. వివిధ ఘటనల్లో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే వారి విషయంలో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. సమర్థంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, వన్‌టౌన్ సీఐ వి.ఆర్.కష్ణయ్య తదితరులు ఎస్పీ వెంట నగరంలో పర్యటించారు. -
పల్స్ సర్వేను పరిశీలించిన జేసీ
తాడేపల్లిగూడెం రూరల్ : పట్టణంలో 32వ వార్డులో నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వే పనితీరును బుధవారం జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వేలో తలెత్తుతున్న ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సర్వే చేపట్టడం వల్ల సర్వర్లు సరిగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని సభ్యులందరి వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ సర్వే పూర్తి చేయవలసి ఉందన్నారు. ఆయన తహసీల్దార్ పాశం నాగమణి, మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, ఆర్ఐ బొడ్డేపల్లి దుర్గారావు ఉన్నారు. -
డిప్యూటీ డీఈఓ ఆకస్మిక తనిఖీలు
యాలాల(రంగారెడ్డి): యాలాల మండలంలోని పగిడియాల, ముద్దాయిపేట ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ డీఈఓ హరీష్ చందర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా విద్యార్థులు ఏ విధంగా వత్తిడిని జయించాలి అనే అంశంపై మాట్లాడారు. దీంతో పాటు డిజిటల్ క్లాసుల ద్వారా ప్రముఖ సైకాలిజిస్టు డా. బి.వి పట్టాభిరామ్.. వత్తిడి సంబంధిత సీడీలను విద్యార్థుల ముందు ప్రదర్శించారు. డీఈవో హరీష్ చందర్ తో పాటు మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఈ ఆకస్మిక తనిఖీలలో పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. -
ఓ మహిళకు క్లాస్ తీసుకున్న మంత్రి...
నల్లగొండ: గుడుంబా, కల్తీ మద్యం విక్రయించినా.. సేవించినా పోలీసులు, అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం చూస్తుంటాం. అదే తీరున గుడుంబా అంశాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గుడుంబా అమ్ముతున్న మహిళతో మాట్లాడిన మంత్రి గుడుంబా విక్రయం ఇకనుంచి మానేయాలని ఆమెను హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం మంత్రి టి. పద్మారావు ఆకస్మిక పర్యటనకు వెళ్లారు. తనిఖీలలో భాగంగా గొల్లగూడలో గుడుంబా అమ్ముతున్న ఓ మహిళతో మాట్లాడారు. అమ్మకం మానేసి వేరే ఉపాధి మార్గం చూసుకోవాలని హెచ్చరించారు. అందుకు ఆ మహిళ మా దగ్గర డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి సారూ.. అని మంత్రి దగ్గర వాపోయింది. ఆ మహిళ బాధల్ని విన్న మంత్రి ఉన్నపలంగా తన వద్ద ఉన్న రూ. 50 వేలు ఆమెకు ఇచ్చి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. -
ఈ పాపం ఎవరిది?
-
ఈఎన్సీలో మంత్రి హరీశ్ తనిఖీ
ఉద్యోగుల సమయపాలన పై పరిశీలన హైదరాబాద్: రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌రావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా లేదా ప్రజా సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ఎలా సాగుతోంది తదితర అంశాలను ఆయన పరిశీలించారు. బుధవారం ఉదయం 10.10కి ఈఎన్సీ కార్యాలయానికి వచ్చిన హరీశ్ ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్న సమయాలను సెక్షన్ల వారీగా ఆరా తీశారు. మంత్రి సందర్శన సమయంలో ఇంటర్ స్టేట్ బోర్డు విభాగంలో ఆరుగురు ఉద్యోగులకు ముగ్గురే హాజరవగా, లైబ్రరీ గదిలో ఉండే ఇద్దరు డీఈలు, ఇతర విభాగాల్లోని కొంతమంది ఏఈలు హాజరుకాని విషయాన్ని గుర్తించారు. దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఉద్యోగులంతా విధిగా సమయపాలన పాటించి, ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా పని చేయాలని సూచించారు.