ఈఎన్‌సీలో మంత్రి హరీశ్ తనిఖీ
ఉద్యోగుల సమయపాలన పై పరిశీలన
హైదరాబాద్: రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌రావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా లేదా ప్రజా సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ఎలా సాగుతోంది తదితర అంశాలను ఆయన పరిశీలించారు. బుధవారం ఉదయం 10.10కి ఈఎన్‌సీ కార్యాలయానికి వచ్చిన హరీశ్ ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్న సమయాలను సెక్షన్ల వారీగా ఆరా తీశారు.
మంత్రి సందర్శన సమయంలో ఇంటర్ స్టేట్ బోర్డు విభాగంలో ఆరుగురు ఉద్యోగులకు ముగ్గురే హాజరవగా, లైబ్రరీ గదిలో ఉండే ఇద్దరు డీఈలు, ఇతర విభాగాల్లోని కొంతమంది ఏఈలు హాజరుకాని విషయాన్ని గుర్తించారు. దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఉద్యోగులంతా విధిగా సమయపాలన పాటించి, ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా పని చేయాలని సూచించారు.