లేహ్/న్యూఢిల్లీ: విస్తరణ వాదానికి కాలం చెల్లిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన చైనాకు స్పష్టమైన సందేశమిచ్చారు. ఇది ప్రగతి వాద యుగమని అర్థం చేసుకోవాలన్నారు. ప్రపంచమంతా అభివృద్ధి వైపే పయనిస్తోందన్నారు. విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో, పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోందన్నారు. సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరించారు. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడుతూ.. సరిహద్దుల్లోని వీర జవాన్ల ధైర్య సాహసాలను ఇప్పుడు దేశమంతా ఘనంగా చెప్పుకుంటోందంటూ ఆ బ్రేవ్ హార్ట్స్‌కు సెల్యూట్ చేశారు.
తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ప్రధాని మోదీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ సందర్భంగా ‘నిము’లో ఉన్న ఫార్వర్డ్ పోస్ట్ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి దాదాపు అరగంట పాటు ఉద్వేగపూరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణల్లో అసువులు బాసిన అమర జవాన్లకు మరోసారి ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాన్ని దేశం తరతరాలు గుర్తు పెట్టుకుంటుందని శ్లాఘించారు. భరతమాత శత్రువుకు భారతీయుల ఆగ్రహావేశాలను రుచి చూపించారని ‘14 కార్ఫ్స్’ సైనికులపై ప్రశంసలు గుప్పించారు.
‘పిరికివారు, బలహీనులు శాంతిని సాధించలేరు. శాంతి నెలకొనేందుకు ముందుగా ధైర్యసాహసాలు అత్యంతావశ్యకం’ అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆ ధైర్య సాహసాలు భారత జవాన్ల వద్ద పుష్కలంగా ఉన్నాయన్నారు. భారత సాయుధ దళాల శక్తి, సామర్థ్యాలను ప్రపంచం గమనించిందని, గల్వాన్ లోయ ఘటనను పరోక్షంగా ప్రస్తావించారు. ‘మీ ధైర్య సాహసాలు మీరు గస్తీ కాస్తున్న ఈ పర్వతాల కన్నా సమున్నతమైనవి. దేశ రక్షణ మీ చేతుల్లో భద్రంగా ఉందన్న భరోసా నాకే కాదు.. దేశ ప్రజలందరిలోనూ ఉంది. మీరంతా మాకు గర్వకారణం’ అని కొనియాడారు. ‘లేహ్, లద్దాఖ్, కార్గిల్, సియాచిన్.. ఈ సరిహద్దుల్లోని ఎత్తైన మంచు పర్వతాలు, ఇక్కడి నదుల్లో ప్రవహించే చల్లని నీరు భారతీయ జవాన్ల వీరత్వానికి మౌన ప్రేక్షకులుగా నిలుస్తాయ’ని అభివర్ణించారు.
సింధూ నది ఒడ్డున..
ప్రధానితో పాటు ఈ ఆకస్మిక పర్యటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పాల్గొన్నారు. ‘నిము’ 11 వేల అడుగుల ఎత్తున సింధు నది ఒడ్డున ఉన్న కఠిన భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న ఆర్మీ ఫార్వర్డ్ పోస్ట్. దీని చుట్టూ జన్‌స్కర్ పర్వతాలున్నాయి. అక్కడ భారత జవాన్లతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్మీ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి కమాండర్లు ఆయనకు వాస్తవాధీన రేఖ స్థితిగతులను వివరించారు.
ప్రపంచం మీ గురించే మాట్లాడుకుంటోంది
గల్వాన్ ఘర్షణల్లో గాయపడి, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధాని పరామర్శించారు. శత్రువుకు సరైన గుణపాఠం చెప్పారని వారిని ప్రశంసించారు. వారి ధైర్యసాహసాలను, వారు చిందించిన రక్తాన్ని దేశం మర్చిపోదన్నారు. గల్వాన్‌లో భారతీయ జవాన్లు చూపిన సాహసం గురించి ప్రపంచం మాట్లాడుకుంటోందన్నారు. వారి గురించి, వారికి అందించిన శిక్షణ గురించి, వారి నిబద్ధత గురించి తెలుసుకోవాలనుకుంటోందన్నారు. ‘మీ ధైర్య సాహసాలు భారతదేశ యువతకు స్ఫూర్తినిస్తున్నాయి’ అన్నారు.
ఏడు వారాలుగా ప్రతిష్టంభన
గత ఏడు వారాలుగా భారత, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంట తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. జూన్ 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు.
చరిత్ర చూడు
‘ప్రపంచ యుద్ధాల సమయంలో కానీ, శాంతి సమయంలో కానీ.. మీ సేవలను ప్రపంచం ఏనాడో గుర్తించింద’ని భారత సైనికులను ప్రధాని ప్రశంసించారు. ‘వేణువూదే కృష్ణుడినే కాదు.. శత్రువుపై సుదర్శన చక్రం ప్రయోగించే కృష్ణుడినీ మనం పూజిస్తామ’న్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, స్నేహం, ధైర్యం.. శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో భాగమైన విధానాన్ని ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. ప్రగతిదాయక శాంతియుత భారతదేశాన్ని కకావికలు చేసే అన్ని కుయత్నాలను విజయవంతంగా అడ్డుకుని, తగిన గుణపాఠం చెప్పిన చరిత్ర భారత్‌కు ఉందన్నారు.
‘అందరితో శాంతిపూర్వక స్నేహ సంబంధాలనే భారత్ కోరుకుంటుంది. అలా అని, అది భారతదేశ బలహీనతగా భావించవద్దు’ అని హెచ్చరించారు. సాయుధ దళాల అవసరాలకు తన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన కోసం గతంలో కన్నా మూడురెట్లు ఎక్కువగా నిధులను కేటాయించామన్నారు. సాయుధ దళాల సహకారంతోనే స్వావలంబ భారత్ లక్ష్యం సాకారమవుతుందన్నారు. ‘మన శక్తిసామర్థ్యాలు, దేశ రక్షణ కోసం మనం చేసే ప్రతిజ్ఞ.. హిమాలయాలంత సమున్నతమైనవి’ అన్నారు.
స్ఫూర్తిదాయక ప్రసంగం: బీజేపీ
లద్దాఖ్‌లో సాయుధ దళాల్లో స్ఫూర్తి నింపేలా ప్రధాని మోదీ ప్రసంగించారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయుల భావాలను ప్రధాని వ్యక్తం చేశారని నడ్డా ట్వీట్ చేశారు. రాజ్యం వీర భోజ్యం అని అర్ధం వచ్చేలా ‘వీర భోగ్య వసుంధర’ అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
భారత్‌కు జపాన్ బాసట
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు జపాన్ నుంచి గట్టి మద్దతు లభించింది. వివాద ప్రాంతంలో యధాతథ స్థితిని మార్చే ఏ ఏకపక్ష చర్యలనైనా వ్యతిరేకిస్తామని జపాన్ స్పష్టం చేసింది. చర్చల ద్వారా శాంతియుతంగా ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు భారత్‌లో జపాన్ రాయబారి సతోషి సుజుకి అన్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లాతో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు. వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితిని ష్రింగ్లా ఆయనకు వివరించారు.
బలమైన భారత్‌కు బలహీన ప్రధాని: కాంగ్రెస్
బలమైన భారత్‌కు ఇంత బలహీన ప్రధాని ఏమిటని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇటీవలి తన ప్రసంగాల్లో కనీసం చైనా పేరును కూడా ఉచ్ఛరించలేనంత బలహీన ప్రధాని అని మోదీని విమర్శించింది. ప్రధాని భారతదేశం పట్ల కన్నా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పట్ల ఎక్కువ విశ్వసనీయంగా ఉంటున్నారని ఎద్దేవా చేసింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లద్దాఖ్ ప్రజలు చెబుతుంటే.. ప్రధాని మోదీ మరోలా చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఉద్రిక్తతలు పెంచే పనులొద్దు: చైనా
లద్దాఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటనపై చైనా స్పందించింది. మోదీ లద్దాఖ్ అనూహ్య పర్యటన చైనాను ఉలిక్కిపడేలా చేసింది. దాంతో, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలు పెరిగేలా వ్యవహరించకూడదని పేర్కొంది. రెండు దేశాల మధ్య మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో ఉద్రిక్తతలు పెరిగే చర్యలకు రెండు దేశాలు ఉపక్రమించడం మంచిది కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్ వ్యాఖ్యానించారు. భారత్‌లోని వ్యాపారాలకు సంబంధించి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చైనాను విస్తరణ వాద దేశంగా భావించడం అర్థరహితమని భారత్‌లో చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జీ రాంగ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment