కార్గిల్‌లో స్థానికులతో రాహుల్ గాంధీ సెల్ఫీ
కార్గిల్/న్యూఢిల్లీ: మన భూభాగాన్ని చైనా కాజేసిన విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటలు అబద్ధమని ఆయన విమర్శించారు. ఈ నెల 17 నుంచి లద్దాఖ్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత శుక్రవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
‘వారం రోజులుగా లద్దాఖ్‌లో బైక్‌పై పర్యటిస్తున్నా. లద్దాఖ్ వ్యూహాత్మక ప్రదేశం. భారత్‌కు చెందిన వందలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా లాక్కున్న విషయం పాంగోంగ్ సరస్సు వద్దకు వెళ్లినప్పుడు అర్థమయ్యింది. ఇక్కడి భూమిని అంగుళం కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిందంతా పూర్తిగా అసత్యం. ప్రధాని నిజం చెప్పలేదు, చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందనే విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు’అని రాహుల్ అన్నారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. చైనా ఆక్రమణలతోపాటు లద్దాఖ్ ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడతానన్నారు. రాహుల్ అంతకుముందు ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. 1999 ఇండో–పాక్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. లద్దాఖ్‌లో పర్యటన ముగించుకున్న రాహుల్ బైక్‌ను వదిలి, కారులో శ్రీనగర్ చేరుకున్నారని, శనివారం తిరిగి ఢిల్లీకి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment