డీఎంహెచ్‌ఓతో మాట్లాడుతున్న కలెక్టర్
వనపర్తి టౌన్ : ‘కేసీఆర్ కిట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సర్కారు దవాఖానాలకు వస్తున్నారు.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలి.. అని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆస్పత్రి ఆవరణలో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలతోపాటు ఓపీకి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపీ, ల్యాబ్ సేవలను సైతం కంప్యూటరీకరణ చేయాలని, రోగులు వారికి వచ్చిన రోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం పక్కాగా ఉండాలన్నారు. వైద్యులు రోగులను పరీక్షించిన తర్వాతే ల్యాబ్‌కు పంపాలని సూచించారు. జిల్లాకు ఎంసీహెచ్‌ఎస్ కేంద్రం మంజూరైందని వెల్లడించారు. ఖాళీ స్థ«లాన్ని, సామూహిక వంటశాలను వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. సీసీ రోడ్లుకు ప్రతిపాదనాలు పంపాలని కన్సల్‌టెన్సీ ప్రదీప్‌ను సూచించారు. కాన్పులు, ఓపీ, ఇన్‌పేషంట్‌కు తగ్గట్టుగా సిబ్బంది నియమించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్‌ఎంఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు ఉన్నారు.
ఇంటర్ పరీక్షలకు సిద్ధంకండి
మార్చిలో నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్షలకు అధికారులు ఇప్పటినుంచే సిద్ధం కావాలని కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, 28 నుంచి 19 వరకు రాతపరీక్షలు ఉంటాయని తెలిపారు. ఫస్టియర్‌లో 7,606, సెకండియర్‌లో 7,280 మొత్తం 14886 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇందుకు గాను జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ చంద్రయ్య, ఏఎస్‌పీ సురెందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సింహయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక చేయూత పథకాలపై సోషల్ ఆడిట్
ఆయా సంక్షేమశాఖల ద్వారా ఆర్థిక చేయూతనిచ్చే పథకాల యూనిట్లపై ఫిబ్రవరి 7 నుంచి సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం తన చాంబర్‌లో ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో గ్రౌండింగ్ చేసిన రుణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2015–16 సంవత్సరంలో యూటిలైజేషన్ ధ్రువపత్రాలు, 2016–17 సంవత్సరంలో యూనిట్ల గ్రౌండింగ్‌ల రుణాలపై సమీక్షించారు. 2015–16 లో 83 బీసీ యూనిట్లకు గాను కేవలం 5 యూనిట్ల యూసీలు వచ్చాయని, 226 గిరిజన యూనిట్లకు గాను 74 యూసీలు వచ్చాయని మిగతా వెంటనే సమర్పించాలన్నారు. కొత్త యూనిట్ల గ్రౌండింగ్ విషయంలో అందరు చొరవ చూపాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment