రోగుల సహాయకులకు షెల్టర్లు
నగరంలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్మాణం: కేసీఆర్
సీఎంను కలసిన సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ
కేన్సర్ ఆసుపత్రిలో నిర్మాణాల క్రమబద్ధీకరణకు విజ్ఞప్తి
హైదరాబాద్: ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగుల సహాయకులకు తగినన్ని నైట్ షెల్టర్లను ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. కేన్సర్ ఆసుపత్రితో పాటు పలుచోట్ల ఇప్పటికే నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరికొన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులనే తేడా లేకుండా అన్ని చోట్ల నిర్మిస్తామని, ఆసుపత్రుల యాజమాన్యాలు దీనికి సహకరించాలని సీఎం కోరారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలుసుకున్నారు. కేన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను సీఎంకు వివరించారు. రోగుల సౌకర్యార్థం ఆసుపత్రి ఆవరణలో పలు నిర్మాణాలు చేపట్టామని, వాటిని బీఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించాలని బాలకృష్ణ కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. సేవా దృక్పథంతో రోగులను ఆదుకుంటున్న కేన్సర్ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని చెప్పారు. రోగుల సహాయకులకు కనీస సౌకర్యాలు అందించే విషయంలో శ్రద్ధ చూపాలని, ఈ విషయంలో ఆసుపత్రి నిర్వాహకులకు ప్రభుత్వం సాయం అంది స్తుందన్నారు. త్వరలోనే ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై చర్చిస్తామని వెల్లడించారు.
డిక్టేటర్ చూడండి: బాలకృష్ణ
ఇటీవల విడుదలైన డిక్టేటర్ సినిమా చాలా బాగుందని, ఆ చిత్రాన్ని చూడాల్సిందిగా కేసీఆర్‌ను బాలకృష్ణ కోరారు. వందో సినిమా ఎప్పుడు చేస్తున్నారని సీఎం అడగగా... ఆదిత్య 369కు సీక్వెల్‌గా వందో సినిమా చేస్తున్నామని, తన కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో తాను ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల సినిమాలు చూసే వాడినని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే బాబుమోహన్ కూడా ఎన్టీఆర్, బాలకృష్ణతో తనకున్న సినీ రంగ అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌పీ సింగ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు కూడా ఉన్నారు. బాలకృష్ణను తన ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించిన సీఎం వెళ్లేటప్పుడు కారు దాకా వచ్చి సాగనంపారు. తన పట్ల చూపిన ఆదరణకు బాలకృష్ణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.