రెండో మాట
ఇంతకూ తెలుగుజాతిని ఒక్క తాటిపైకి తెచ్చిన యోధుడైన శాతకర్ణినీ, తెలుగుజాతి కోల్పోయిన ఉనికిని, గౌరవాన్ని పునఃప్రతిష్టించిన ఎన్టీఆర్‌నూ కేసీఆర్ కీర్తించినప్పుడు - తెలుగుజాతి రెండుగా చీలిపోవడం లేదా చీలగొట్టడం అనే పరిణామం బాధాకరమైనదని అనిపించలేదా? జాతి ఐక్యతకు బీజాలు వేసిన వైతాళికులను తలచుకుంటున్నప్పుడు ఒక్క క్షణమైనా కేసీఆర్ మనసు బాధాతప్తమై ఉండదా?! అయినా గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు వాడని చెబుతూ ‘ప్రజలకు చరిత్రే తెలియదని’ ముక్తాయింపు విసరడం అభ్యంతరకరం.
‘తెలుగు ప్రజలను సుదీర్ఘకాలం పాటు ’మద్రాసీలు’ గానే పిలుస్తుండేవారు. తెలుగువారి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని, గుర్తింపును చాటి చెప్పినవారు- మహానటుడు ఎన్.టి. రామారావు మాత్రమే’.
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవంలో చేసిన ఆత్మీయ ప్రకటన 22-4-2016)
కేసీఆర్ ఆదినుంచీ ఎన్టీఆర్ అభిమాని. అయితే అకస్మాత్తుగా ఎన్టీఆర్‌ను ఆ సందర్భంగా ఆయన కీర్తించడానికి కారణం- తెలుగు ప్రాంతాల ఏలికలుగా దాదాపు 250-300 సంవత్సరాల పాటు ప్రసిద్ధికెక్కిన శాతవాహన రాజులలో ప్రముఖుడైన గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఒక చలనచిత్రాన్ని టీడీపీ శాసనసభ్యుడు, నటుడు బాలకృష్ణ నిర్మించడం కాదు! ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిన తరువాత, పరిశిష్ట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడికి బాలకృష్ణ వియ్యంకుడు కావటం వల్లనే ‘శాతకర్ణి’ ప్రారంభోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారన్న అంశమూ అంత ముఖ్యం కాదు! ‘శాతకర్ణి’ సినిమా పూర్వరంగంలో అధికార పీఠాలకు సంబంధించిన రాజకీయాల పాత్ర కొట్టిపారేయలేనిది.
ఈ పరిణామ క్రమంలో కీలకం ‘నోటుకు ఓటు’ రాజకీయం! దీనివల్ల బహిరంగంగానూ, అజ్ఞాతంగానూ వాడి-వేడిగా జరిగిన చర్చల ప్రభావమూ, అందువల్ల ఉభయ రాష్ట్రాలలో సాగిన రాజకీయ ‘పోరాటాలూ’- ఇవన్నీ రాజకీయ పక్షాలకూ, నారద పాత్ర పోషణలో ఉన్న మీడియాకూ తెలియనివి కావు! కేంద్రం నుంచి ఉభయ రాష్ట్రాలకు వారథిగా, ‘అంపైర్‌గా’ ఉన్న ఉమ్మడి గవర్నర్ వరకూ ఉభయ ముఖ్యమంత్రులకు మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు జరపడమూ తెలిసిందే!
ఇక ‘నోటుకు ఓటు’ పూర్తిగా తెర మరుగు కాకపోయినా వచ్చే (2019) ఎన్నికల దాకా రావణకాష్టంలా ఉండకుండా - ఒక విరామంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవాన్ని గొప్ప రిలీఫ్‌గా ఉభయ పార్టీల రాజకీయులు ’ఫీలయి’ ఉండవచ్చు. ఈ సంకటం పూర్వరంగంలోనే కేసీఆర్ ‘శాతకర్ణి’ చిత్రోత్సవ ప్రారంభానికి ఆహ్వానం అందుకుని ఉండవచ్చు! ’నోటుకు ఓటు’ (లేదా ’ఓటుకు నోటు’ ఎంత తిరగేసి మరగేసి చెప్పినా ఆ రెంటినుంచీ పాలకులకు విముక్తి దొరకదు) నాటకంలో మరో అంతర్నాటకానికి టీఆర్‌ఎస్, టీడీపీ పాలకులు తెరతీశారు!
అంతరాత్మ ఘోషించలేదా!
రెండు తెలుగు రాష్ట్రాలలోను ప్రస్తుతం ‘హామీల’ పర్వమే వినిపిస్తోంది! ఆ హామీలు కార్యరూపం దాల్చాలంటే ఢిల్లీ నుంచి ఇక్కడి దాకా పాలకులంతా ఆ 2019వ సంవత్సరాన్ని మైలురాయిగా చూపుతున్నారు! ఈలోగా ప్రభుత్వాల ఉనికి గురించి ప్రజల్లో అనుమానాలు బలపడకుండా ఎన్నో పిట్ట కథలు వినిపిస్తున్నారు! ఆ కథాగానంలో పరాకాష్టే -ప్రలోభాలతో ప్రతి పక్షాల్ని చుప్తాగా ఖాళీ చేయించాలన్న తపన. ఫిరాయింపుల నిరోధక చట్టా న్నీ, దానికింద జరిగే సభ్యత్వాల బర్తరఫ్ నిబంధనలనూ ఖాతరు చేయకుం డానే ఇటొక పన్నెండుమందినీ, అటొక డజను మందినీ ‘సంతలో బేరానికి’ పెట్టారు! సరిగ్గా ఈ సందర్భంగానే ఉభయ తారకంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దూసుకొచ్చేశాడు. నిజానికి ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ఎవరికివారు తామే ‘శాతకర్ణి’ రూపాలం అనుకుంటున్నట్టుంది!
ఎందుకంటే ‘శాతకర్ణి’ చిత్రానికి ఆహ్వానం పలుకుతూ కేసీఆర్ తెలుగు వారందరూ మెచ్చ దగిన మాట అన్నారు: ‘శాతవాహన సామ్రాజ్యం కిందనే తెలుగు వారంతా ఒకటయ్యారు; అలాగే తెలుగు ప్రజలకు వ్యక్తిత్వానికి గుర్తింపుతెచ్చి, తెలుగులను ఒక్క తాటిపైకి తెచ్చి వారి గౌరవాన్ని నిలిపిన ఖ్యాతి ఎన్టీఆర్‌కి మాత్రమే దక్కింది.’ కేసీఆర్ ఈ మాట అనడంతో రెండురాష్ట్రాలకు విభజన తెచ్చిపెట్టిన పలు సమస్యలను గుర్తించి గుర్తు చేసినట్టయింది! కాకపోతే సామ్రాజ్యాలను ఆక్రమణల ద్వారానో, దండయాత్రల ద్వారానో సంపాదించుకుని ఏలికలైన వారికి ‘బలవంతులు బలహీనులను పాలించార‘న్న పాఠం ఒంటబట్టదు.
‘సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసాన్ని ‘తూచడానికి’ ప్రభువులవద్ద తూనికరాళ్లూ కరువే. ప్రభువెక్కిన పల్లకిని చూస్తారేగాని, దాన్ని మోసే బోయీలెవరో తెలుసుకోలేనంత ’అమాయకులు’ ప్రభువర్గాలు! ఇంతకూ తెలుగుజాతిని ఒక్క తాటిపైకి తెచ్చిన యోధు డైన శాతకర్ణినీ, తెలుగుజాతి కోల్పోయిన ఉనికిని, గౌరవాన్ని పునఃప్రతిష్టిం చిన ఎన్టీఆర్‌నూ కేసీఆర్ కీర్తించినప్పుడు - తెలుగుజాతి రెండుగా చీలి పోవడం లేదా చీలగొట్టడం అనే పరిణామం బాధాకరమైనదని అనిపించ లేదా? జాతి ఐక్యతకు బీజాలు వేసిన వైతాళికులను తలచుకుంటున్నప్పుడు ఒక్క క్షణమైనా కేసీఆర్ మనసు బాధాతప్తమై ఉండదా?!
చరిత్ర చెప్పే ఆప్తవాక్యం
కేసీఆర్ మాటల్లోనే శాతకర్ణి 33 రాజ్యాలను జయించి ఉండొచ్చు. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగువాడని చెబుతూ ‘ప్రజలకు చరిత్రే తెలియదని’ ముక్తాయింపు విసరడం అభ్యంతరకరం. ఎందుకంటే, చరిత్రలో తెలుగు వారందరిని సమైక్యంగా ఉంచి వారి వైభవోన్నతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహాయుగాలు మూడు: (1) శాతవాహన యుగం (2) కాకతీయ యుగం (3) శ్రీకృష్ణదేవరాయల యుగం. రాచరిక వ్యవస్థలు కావటం వల్ల ప్రజారం జక ప్రభువులుగా ఉంటూనే సామ్రాజ్య విస్తరణ కార్యకలాపాల్లో తప్పులూ చేసి ఉండవచ్చు. అది వేరు.
ఉదాహరణకు మనం మహా పాలకులుగా భావిస్తున్న శాతవాహనులలో అత్యంత సమర్థుడు, ఇప్పుడు సినిమా తెర మీద కథానాయక పాత్రలో కనిపించబోతున్న గౌతమీపుత్ర శాతకర్ణి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన ఒక విభ్రాంతికర ఘటనను చరిత్రకారులు నమోదు చేశారు. రాజ్య విస్తరణలో భాగంగా శాతవాహనుల రాజధాని కోటలింగాల (తెలంగాణ) నుంచి ధాన్యకటకానికి, ఆ సమీపంలోని అమరా వతికి శాశ్వతంగా మారకముందు ఈ ఘటన జరిగింది. అది - రాజ్య విస్తరణ కాంక్షలో గతితప్పిన ధర్మం. ఆనాడు శాతకర్ణి మాదిరే అనేక ప్రాంతాలకు నహపాణుడు చక్రవర్తి (మాల్వా, సౌరాష్ట్ర, రాజస్థాన్, కొంకణ్ లేదా అపరా జిత వగైరా పది-పన్నెండు రాజ్యాలకు అధినేత). అలాంటి సమకాలీన చక్రవర్తిని (శక వంశం) మోసంతో శాతకర్ణి ఓడించి చంపాడని ‘ఆవశ్యక- సూత్ర-నిర్యుక్తి’ రచనలో రాసి ఉందని చరిత్రకారులు ఉదహరించారు.
గౌతమీపుత్ర శాతకర్ణి యుద్ధంలో నహపాణుడ్ని లొంగదీసుకోలేక మోసానికి దిగాడని పేర్కొన్నారు. మధుర, పశ్చిమ భారత ప్రాంతాలలో రాజుల/షోడశ శక వంశంలో నహపాణులు ప్రముఖ పాలకులు. నహపాణుడి అల్లుడు ఉషవదత్తుడు. అనేక యాత్రాస్థలాలకు, దేవాలయాలకు అనంతంగా దాన ధర్మాలు చేసిన చరిత్ర వీరిది. ఆక్రమణ, దురాక్రమణలలో పరస్పరం శత్రు రాజులందరిదీ దాదాపు ఒకే ‘ఆనవాయితీ’! అంతటి బలవంతుడైన గౌతమీపుత్ర శాతకర్ణికి విజయావకాశాలు ‘పిలిస్తే’ కళ్లముందు వాలే రోజుల్లో నహపాణుడ్ని జయించే పేరుతో మోసానికి పాల్పడ్డాడని ప్రసిద్ధ చరిత్రకారుడు సి. సోమసుందర్రావు పేర్కొనడం విశేషం! ఏమిటా ‘ఘరానా’ మోసం? ప్రశ్నించిన ఆధునిక భారత పౌరుడిని ‘దేశద్రోహి’గా ముద్ర వేసినట్టుగానే ఆనాడు నహపాణుని విషయంలోనూ జరిగింది.
రక్షణ కోసమే అతడ్ని అదుపులోకి తీసుకోమని శాతకర్ణి తన మంత్రికి ‘బాధ్యత’ అప్పగించాడు! ఎందుకు బంధించినట్లు? ‘నహపాణుడు నన్ను అవమానిం చాడ’ని శాతకర్ణి ఓ కల్పన చేశాడు. ఆ వ్యూహం ప్రకారమే నహపాణుడ్ని విశ్వాసంలోకి తీసుకున్నట్లే శాతకర్ణి మంత్రి నటించుతూ ‘మీ సంపదనంతా మంచి కార్యాల కోసం పూర్తిగా ఖర్చు పెట్టించి దివాళా ఎత్తేదాకా వదిలి పెట్టను’ అని భీష్మించి, నహపాణుడి ఖజానా కాస్తా దివాళా ఎత్తేదాకా వదిలి పెట్టలేదట. ఈ సంగతిని మంత్రి ఆనందంతో శాతకర్ణికి తెలియచేశాడు. నహపాణుని గల్లాపెట్టి ఖాళీ చేయించి, అప్పుడు శాతకర్ణి ‘నహపాణుని’పై దొంగదాడి చేశాడు, ఆ దాడిలో నహపాణుడు చనిపోయాడు! ఈ గాథకు నాసిక్ శాసనాలే ఆధారం.
ఇలా శాతవాహనుల కాలంలో మాతృస్వామిక వ్యవస్థలో భాగంగా పాలకులకు తల్లి పేరు (గౌతమీపుత్ర, వాసిష్ఠీపుత్ర) పురుషులకు సంక్రమిం చడం గర్వకారణమైన సంప్రదాయం. బౌద్ధంలో ‘ఆంధ్రులు’గానే శాతవాహ నులు ప్రసిద్ధికెక్కారు, ఆంధ్ర జాతిగానే మనగలిగారు. శాతవాహన రాజ్యం ‘ఆంధ్రపథం’ గానే (మైదవోలు) శాసనాలలో వినుతికెక్కింది. మరి ‘మేము ఆంధ్రులం కాద’న్న వాదం ఒక ప్రాంతంలో మన తెలుగు వాళ్లలోనే నూరి పోయడానికి ఆధారం ఎక్కడి నుంచి వచ్చిందో కేసీఆర్ చెప్పలేకపోయారు! సైనిక విజయాలలోనే కాదు, సమర్థులైన పాలకులుగా ప్రజల జీవనాన్ని మెరుగు పర్చడం ద్వారా పాలనను సుస్థిరం చేసి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రభృతులు ఘన విజయాలు సాధించారు.
విదేశీ వాణిజ్య సంబంధాల్ని దృఢతరం చేసుకోడానికి శాతవాహనులు ఆంధ్ర రేవు పట్టణాలను ఆసరా చేసుకుని బ్రోచ్ (భరుకచ్చ) దాకా, నర్మద వరకు, బొంబాయి సమీపంలోని సొపరా, కల్యాణ్ లాంటి ప్రధాన రేవుల దాకా పాకిపోయారంటే వారు వ్యాపారానికి రేవులు, రేవు పట్టణాల అవసరాన్ని ఎంతగా గుర్తించారో అర్థమవుతుంది. కానీ ఈ స్పృహ కూడా నేటి కొందరి పాలకులకు కరువైంది. అందుకే తెలుగు వారి విభజన తర్వాత నాలుకలు కరచుకోవలసి వచ్చింది. పైగా ‘జలరహిత (డ్రై) రేవుల్ని నిర్మిస్తామ’ని ప్రకటించడమేగాదు, కొన్నాళ్ల తర్వాత ‘మాకూ రేవు సౌకర్యాలు కల్పిద్దురూ’ అని కోరడమూ జరిగింది! అందుకే కలసి ఉంటే కలదు సుఖమని గుర్తించిన శాతవాహనులు ‘దక్షిణాపథపతులు’గా స్థిర గౌరవానికి అర్హులయ్యారు! ఆంధ్రులు వేరన్న మాటగాని, మేము వేరన్న మాటగాని ఇక విన్పించరాదన్నది సురవరం వారి శాశ్వత ఆప్తవాక్యం!
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
సెబాసు ‘శాతకర్ణీ'! చంద్రశేఖరా!
Published Tue, Apr 26 2016 12:31 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement