కేసీఆర్కు బాలకృష్ణ ఆహ్వానం
హైదరాబాద్ : ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తన 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ముహుర్తం షాట్కు బాలయ్య ఈ సందర్భంగా కేసీఆర్ను ఆహ్వానించారు. కాగా అమరావతి చరిత్ర, అమరావతి రాజధానిగా శాతవాహన చక్రవర్తుల పరిపాలనపై బాలకృష్ణ హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమి టైటిట్ను ఉగాదిరోజున అమరావతిలో ప్రకటించగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా 22న పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించబోతుంది. అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ను బాలయ్య ఆహ్వానించారు. ఆయనతో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి మొదలవుతుంది.