goverment hospitals
-
పెద్దాస్పత్రిలో దొంగల భయం!
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో రక్షణ కరువైంది. ఆస్పత్రికి సంబంధించిన విలువైన వస్తువులు తరచూ మాయమవుతున్నాయి. అంతే కాకుండా రోగులు, వారికి సహాయంగా వచ్చే వారి సెల్ ఫోన్ల చోరీ పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రికి వచ్చే వారు మండిపడుతున్నారు. పెరిగిన తాకిడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇటీవల మెడికల్ కళాశాలగా మార్పు చెందింది. దీంతో నిత్యం వెయ్యి నుండి 1,500 మంది వరకు వైద్యసేవలకు వస్తుంటారు. అలాగే రోగుల సహాయకులతో నిత్యం ఆస్పత్రి కిటకిటలాడుతెఓంది. ఇదే అదనుగా కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. రోగుల బెడ్ల వద్ద ఉండే ఫోన్లు, చార్జింగ్ పెట్టిన ఫోన్లు చోరీ చేస్తుండగా.. ఇటీవల ఆర్ఎంఓకు వరుస ఫిర్యాదులు అందుతున్నా ఎలాంటి చర్యలు లేదు. మరోపక్క ఆస్పత్రిలోని వస్తువులు కూడా తస్కరణకు గురవుతున్నాయి. తాజాగా ఆక్సిజన్ సిలిండర్లకు వినియోగించే మ్యాన్ హోల్డ్‌లు చోరీకి గురయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ల నుండి పైప్‌లైన్‌కు లింక్ కలిపేందుకు మ్యాన్ హోల్డ్స్ వినియోగిస్తారు. వీటిని చాలా వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి పూట ముసుగు వేసుకొచ్చి వీటిని చోరీ చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ ఉన్నట్టా.. లేనట్లా? పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ, పేషంట్ కేర్, స్వీపర్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ ఓ ఏజెన్సీకి కట్టబెట్టింది. ఆస్పత్రిలో 575 బెడ్లు ప్రాతిపదికగా బెడ్‌కు రూ.7,500 సదరు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఈమేరకు 259 మంది సెక్యూరిటీ, పేషంట్ కేర్, స్వీపర్లను నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా వారిని ఆస్పత్రి రక్షణకు వినియోగించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో అవసరం మేరకు సిబ్బంది లేకపోవడంతో వీరిని ఇతర పనులకు కేటాయిస్తున్నారని.. మరికొందరిని అధికారులు, ఉద్యోగులు వారి ఇళ్లలో పని చేయించుకుంటున్నారని సమాచారం. ఫలితంగా సెక్యూరిటీ గార్డుల కొరతతో చోరీలు సర్వసాధారణమయ్యాయి. ఇంత జరుగుతున్నా విషయం బయటకు పొక్కకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అధికారులు మిన్నకుంటున్నట్లు సమాచారం. గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం ఆస్పత్రిలో చోరీలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటుచేస్తాం. సెల్ఫోన్లు చోరీకి గురైన విషయమై ఫిర్యాదులు అందాయి. అలాగే సిలిండర్లకు బిగించే మ్యాన్ హోల్ద్స్ కూడా దొంగిలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, ఆర్ఎంఓ -
పట్టపగలు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుబాయ్ దారుణం..
సాక్షి, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మహిళా సిబ్బందికి రక్షణ లేకుండాపోయింది. ఆసుపత్రిలో పనిచేసే ఓ యువతిపై కాంట్రాక్టు విధానంలో పనిచేసే వార్డుబాయ్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆసుపత్రివర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. గురువారం ఉదయం ఆసుపత్రిలో ఓ వార్డులో విధులు నిర్వహిస్తున్న యువతి అదే వార్డులో స్టాక్ ఉండే గదిలోకి వెళ్లగా వార్డుబాయ్ ఆమె వెనకాలే వచ్చి గది తలుపులు బిగించి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన ఆసుపత్రి అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వార్డుబాయ్‌ని శుక్రవారం బాధితురాలి బంధువులు ఆసుపత్రిలోనే చితకబాదినట్టు తెలిసింది. ఉదయం షిప్టులోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఇక రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఇదేవార్డుబాయ్ పై పలు ఆరోపణలు ఉన్నా వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనక మతలబు ఏమిటన్నది ఆసుపత్రిలో చర్చజరుగుతోంది. ఇద్దరి మధ్య సయోధ్యకుదిర్చేయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మహిళా సిబ్బంది ప్రజలకు వైద్యాసేవలందిస్తుంటే ఇలాంటి వారితో ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందని , వార్డుబాయ్ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆస్పత్రులకు క్యూ
సాక్షి, హైదరాబాద్: కరోనా భయంతో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న రోగులు ప్రభుత్వాస్పత్రులకు పరు గెడుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తులతోపాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారితో కాంటాక్టు కలిగి ఉన్నవారు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులు, వరంగల్‌లోని ఎంజీఎంకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు కరోనా భయంతో దాదాపు 800 మంది రాగా వరంగల్ ఎంజీఎంకు వంద మందికిపైగా వచ్చినట్లు చెబు తున్నారు. అయితే వారిలో కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల శాంపిళ్లనే పరీక్షలకు పంపిం చారు. హైదరాబాద్‌లో గురువారం ఒక్కరోజే దాదాపు 500 మంది స్వాబ్, రక్త నమూనాలను కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మిగిలినవారి నమూనాలను పంపించడంలేదు. ఇలా ముం దుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం మంచి పరిణామమని వైద్యాధికారులు అంటున్నారు. అన్ని జిల్లాల్లో ఢిల్లీ గ్యాంగ్‌తో టచ్ ఉన్న వారంతా ముందుకు రావాలని ప్రభుత్వం సూచిస్తోంది. మర్కజ్‌కు వెళ్లినవారికీ క్వారంటైన్ ముద్ర... రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 1,030 మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించగా వారిలో 130 మంది మినహా మిగిలిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. తీవ్రమైన లక్షణాలున్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లోనూ వారి నమూ నాలను సేకరించి హైదరాబాద్‌కు పంపుతు న్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సేకరించిన నమూనాల ఫలితాలు రాగా ఒకట్రెండు రోజుల్లో మిగిలిన జిల్లాలకు సంబంధించి మర్కజ్‌కు వెళ్లిన వారి నమూనాల ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వారందర్నీ జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అలాగే మర్కజ్ యాత్రికులు, వారితో సన్నిహితంగా ఉన్న వారికి కూడా క్వారంటైన్ ముద్ర వేశారు. ఇప్పటిదాకా విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ ముద్ర వేయగా తాజాగా మర్కజ్‌తో సంబంధం ఉన్న వారందరికీ వేస్తున్నారు. మర్కజ్‌కు వెళ్లిన వారు, వారి కుటుంబ సభ్యులను ఇప్పటికే గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ.. వారిని పరీక్షలకు, క్వారంటైన్ కేంద్రాలకు తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛందంగా సహకరించి వచ్చారు. మరి కొందరు మొండికేశారు. హైదరాబాద్‌లో కూడా కొంతమంది ఇలాగే సహాయ నిరా కరణ చేయడంతో సంబంధిత ఏరియాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి, వారిని ఆస్పత్రులకు పంపారు. ఆస్పత్రులు కిటకిట... మర్కజ్ వెళ్లిన వారిలో ఎక్కువ మంది కరో నా బారిన పడుతుండటంతో మిగిలిన వారి లోనూ భయం పెరిగింది. దాంతో ఒక్క సారిగా గాంధీ ఆస్పత్రికి క్యూ కట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 603 మంది మర్కజ్‌కు వెళ్లారు. బుధవారం 300 మంది, గురువారం 500 మంది నమూనాలను గాంధీ ఆస్పత్రిలో సేకరించారు. బుధవారం సేకరించిన 300 న మూనాల్లో 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏ జిల్లాకు చెం దినవారు ఎందరనేది సర్కారు ప్రకటించలే దు. మర్కజ్ వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో సర్కారీ ఆస్పత్రులు కరోనా అనుమానితులతో నిండిపోతు న్నాయి. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పా టు చేసిన ఐసోలేషన్ బెడ్స్ ఇప్పటికే నిండి పోయాయి. అక్కడ ప్రస్తుతం 135 మంది ఐ సోలేషన్‌లో ఉన్నారు. గాంధీలోనూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఛాతీ ఆస్పత్రిలో గురువారం 14 పాజిటివ్ కేసులు అడ్మిట్ అ వ్వగా ఇప్పటికే అక్కడ 8 మంది చికిత్స పొందుతున్నారు. అక్కడ 31 మంది అనుమానితులు ఉన్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో 30 మంది రోగులకు చికిత్స చేస్తున్నారు. అక్కడ మొత్తం 350 పడకలు అందుబాటులో ఉన్నాయి. రక్షణ లేదంటూ జూడాల ఆందోళన... జూనియర్ డాక్టర్లపై కొందరు కరోనా బాధి తులు, వారి కుటుంబాలు దాడి చేయడంతో గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. దీం తో తమకు ఏమాత్రం రక్షణ లేదని రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రతకు ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
తెనాలిలో అంతులేని అవినీతి
అప్రంటిస్‌షిప్ సర్టిఫికెట్ల మంజూరులో గోల్మాల్. ఒకే ఏజెన్సీ నుంచి కొన్నేళ్లుగా మందుల కొనుగోళ్లు. కిలో మీటరు కూడా కదలని అంబులెన్స్ నిర్వహణకు నెలనెలా బిల్లులు. ఆర్థో ఇంప్లాంట్స్.. డైరెక్టుగా ఆపరేషన్ థియేటర్‌కు సరఫరా. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్న రోగులకు అందని డైట్.. ఏమైందో తెలియని ఆర్థిక సాయం.. ఇదీ అంతులేని తెనాలి జిల్లా ఆస్పత్రి అవినీతి కథ. అక్కడ అందే వైద్య సేవలకంటే అందులో జరిగిన అవకతవకలే ఎక్కవ. రెండు రోజులుగా జరుగుతున్న ఏసీబీ అధికారులు తనిఖీల్లో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఆస్పత్రి అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. సాక్షి, గుంటూరు/తెనాలి అర్బన్: అవినీతి ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది 14400 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కాల్ సెంటర్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతిపై అనేక ఫిర్యాదు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏసీబీ ఏఎస్పీ అల్లం సురేశ్‌బాబు నేతృత్వంలో మూడు బృందాలుగా తనిఖీలు నిర్వహించాయి. ఇందులో దిమ్మతిరిగే అవినీతి, అక్రమాలు, నకిలీ లీలలు బయటపడ్డాయి. ఏకంగా పది నకిలీ అప్రంటిస్‌షిప్ సర్టిఫికెట్ల జారీ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఏడాది పాటు ఆస్పత్రిలో అప్రంటిస్‌షిప్ చేసినట్టు గతంలో సూపరింటెండెంట్లుగా పనిచేసిన డాక్టర్ సులోచన, నాగేశ్వరరావు సంతకంతో సరి్టఫికెట్లు మంజూరు చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు అప్రెంటిస్íÙప్ చేసి ఉండాలని నిబంధన విధించింది. ఏఎన్ఎం పోస్టులకు సెలక్ట్ అయిన వారు నకిలీ సర్టిఫికెట్లను వినియోగిస్తున్నారంటూ పారామెడికల్ బోర్డు సెక్రటరీ రాసిన లేఖ మేరకు సూపరింటెండెంట్ ఇప్పటికే విచారణ చేశారు. అందులో నకిలీ సరి్టఫికెట్లుగానే తేలింది. దీనిని ఏసీబీ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ నకిలీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ సూపరింటెండెంట్‌కు సూచించారు. 2016 నుంచి ఒకరితోనే కొనుగోళ్లు 2016 సంవత్సరం నుంచి కామాక్షి మెడికల్స్ తెనాలి అనే సంస్థ నుంచి మందులు, సర్జికల్ ఐటమ్స్‌ను ప్రభుత్వాస్పత్రికి కొనుగోలు చేస్తున్నట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. అదే విధంగా ఆర్థో ఇంప్లాంట్స్‌ను కూడా ఐక్యత ఆర్థో ఇంప్లాంట్స్ గుంటూరు, శ్రీ సాయి శ్రీనివాస ఇంప్లాంట్స్ విజయవాడ కంపెనీల నుంచే తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థో ఇంప్లాంట్స్‌ను స్టోర్స్‌కు కాకుండా సరాసరి ఆపరేషన్ థియేటర్‌కు సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రి నిధు లతో ఏపీఎంఎస్ఐడీసీ సప్లై చేయని మందులు, సర్జికల్ వస్తులను కొనుగోలు చేయాలంటే రెండేళ్లకోసారి టెండర్లు నిర్వహించి కలెక్టర్ అనుమతి పొందిన వ్యాపారులతోనే ఒప్పదం చేసుకోవాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఆస్పత్రి అధికారుల వ్యవహారశైలి ఉంది. రూ.38–40వేలు బిల్లులు.. కిలో మీటరు కూడా కదల్లేని, కాలం చెల్లిన అంబులెన్స్ వాహనానికి నెలకు రూ.38–40 వేల వరకూ డీజిల్, ఇతర మరమ్మతుల పేర్లతో బిల్లులు చేశారు. రెండేళ్లుగా ఈ తరహా పద్ధతి నడుస్తోంది. బిల్లుల మంజూరు కోసం కేసులకు హాజరు కాకపోయినప్పటికీ హాజరవుతున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.4లక్షలకు పైగా అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అవుట్ సోర్సింగ్‌లో పనిచేసే డ్రైవర్ శ్రీనివాస్ ఆస్పత్రి అధికారుల సాయంతో తన సొంత అంబులెన్స్ ఉపయోగిస్తూ డిజిల్ సొమ్మును వైద్యశాల ఖాతా నుంచి డ్రా చేసుకుంటున్నాడు. అదే విధంగా గుర్తింపులేని అభయ డయాగ్నొస్టిక్స్ సెంటర్లో వ్యాధి నిరోధక పరీక్షలు నిర్వహించినట్టుగా 2016కు ముందు బిల్లులు డ్రా చేసినట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. ఈ బిల్లులన్నీ నకిలీవేనని తెలుస్తోంది. ‘డైట్’ సొమ్ము స్వాహా ఆరోగ్య శ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న ఇంపేషెంట్లకు రోజు రూ.100 చొప్పున డిశ్చార్జ్ అయ్యేంత వరకూ చెల్లించేలా 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు డైట్ ఇస్తున్నందున ఆరోగ్య శ్రీ కింద ఇచ్చే డైట్ చార్జీలను రోగి డిశ్చార్జీ అయ్యే సమయంలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. అయితే మూడు వేల మంది రోగులకు తెనాలి ఆస్పత్రిలో డైట్ చార్జీలు చెల్లించలేదని ఏసీబీ గుర్తించింది. అదే విధంగా వైద్యశాలలో 23 మంది సెక్యూరిటీ గార్డులు ఉండగా వీరిలో 16 మంది మాత్రమే విధులకు వినియోగిస్తున్నారని, మిగిలిన వారిని మేల్ నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ఇతర పనులకు వాడుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఫార్మసీ, డైట్ బిల్లులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. శానిటరీ, లైటింగ్ సరిగా లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో సీఐలు శ్రీధర్, రవిబాబు, గంగరాజు, ఎస్ఐ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగని గర్భశోకం
మన్యంలో కన్నతల్లుల గర్భశోకం కొనసాగుతుంది. ఘటన జరిగిన సమయంలో అధికారులు చేసిన హడావుడి ...ఇచ్చిన హామీలు చేతల్లో కానరాకపోవడంతో కన్ను తెరవకముందు కొందరు...కన్ను తెరిచిన కొద్ది రోజులకు మరికొందరు కన్నుమూస్తున్నారు. రంపచోడవరం: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరో పసిపాప శనివారం మృతి చెందింది. అడ్డతీగల మండలం వంగలమడుగు గ్రామానికి చెందిన మడకం దొరబాబు, వెంకటలక్ష్మి దంపతుల రెండో బిడ్డ అయిన ఐదు నెలల పాప అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను అడ్డతీగల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆ పాప మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. -
రోగులను ఇబ్బంది పెట్టొద్దు
వనపర్తి టౌన్ : ‘కేసీఆర్ కిట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సర్కారు దవాఖానాలకు వస్తున్నారు.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలి.. అని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆస్పత్రి ఆవరణలో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలతోపాటు ఓపీకి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపీ, ల్యాబ్ సేవలను సైతం కంప్యూటరీకరణ చేయాలని, రోగులు వారికి వచ్చిన రోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం పక్కాగా ఉండాలన్నారు. వైద్యులు రోగులను పరీక్షించిన తర్వాతే ల్యాబ్‌కు పంపాలని సూచించారు. జిల్లాకు ఎంసీహెచ్‌ఎస్ కేంద్రం మంజూరైందని వెల్లడించారు. ఖాళీ స్థ«లాన్ని, సామూహిక వంటశాలను వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. సీసీ రోడ్లుకు ప్రతిపాదనాలు పంపాలని కన్సల్టెన్సీ ప్రదీప్‌ను సూచించారు. కాన్పులు, ఓపీ, ఇన్పేషంట్కు తగ్గట్టుగా సిబ్బంది నియమించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్ఎంఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు సిద్ధంకండి మార్చిలో నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్షలకు అధికారులు ఇప్పటినుంచే సిద్ధం కావాలని కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, 28 నుంచి 19 వరకు రాతపరీక్షలు ఉంటాయని తెలిపారు. ఫస్టియర్‌లో 7,606, సెకండియర్‌లో 7,280 మొత్తం 14886 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇందుకు గాను జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రయ్య, ఏఎస్పీ సురెందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సింహయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక చేయూత పథకాలపై సోషల్ ఆడిట్ ఆయా సంక్షేమశాఖల ద్వారా ఆర్థిక చేయూతనిచ్చే పథకాల యూనిట్లపై ఫిబ్రవరి 7 నుంచి సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం తన చాంబర్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో గ్రౌండింగ్ చేసిన రుణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2015–16 సంవత్సరంలో యూటిలైజేషన్ ధ్రువపత్రాలు, 2016–17 సంవత్సరంలో యూనిట్ల గ్రౌండింగ్ల రుణాలపై సమీక్షించారు. 2015–16 లో 83 బీసీ యూనిట్లకు గాను కేవలం 5 యూనిట్ల యూసీలు వచ్చాయని, 226 గిరిజన యూనిట్లకు గాను 74 యూసీలు వచ్చాయని మిగతా వెంటనే సమర్పించాలన్నారు. కొత్త యూనిట్ల గ్రౌండింగ్ విషయంలో అందరు చొరవ చూపాలని ఆదేశించారు. -
మందుల్లేవ్.. మళ్లీ రండి
విజయనగరం ఫోర్ట్: విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గేదలవానిపాలేం గ్రామానికి ఒక వ్యక్తి తన కుమార్తెకు హెచ్ఐవీ మందుల కోసం జిల్లా కేంద్రాస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రానికి రెండు నెలల వ్యవధిలో నాలుగు సార్లు వచ్చాడు. మందులు లేవని సిబ్బంది అతన్ని తిప్పి పంపించారు. నాలుగు సార్లు విజయనగరం వచ్చి వెళ్లడానికి రూ.600 ఖర్చు అయింది.. మందులు మాత్రం దొరకలేదు. ఈ పరిస్థితి నిత్యం హెచ్ఐవీ బాధిత పిల్లలకు ఏఆర్టీ కేంద్రంలో ఎదురవుతోంది. ప్రభుత్వం మందులు సరఫరా చేయకపోవడంతో సిబ్బంది కూడా ఏమీ చేయలేక మందులు లేవని తిప్పి పంపించేస్తున్నారు. ఇది ఎయిడ్స్ వాధిగ్రస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. జీవితకాలాన్ని పెంచుకోవడానికి అవసరమైన మందులు రెండు నెలలుగా లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. హెచ్ఐవీతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడాలని, లేదంటే రోగ నిరోధకశక్తి తగ్గిపోతుందని పదే పదే చెప్పే ప్రభుత్వం మందుల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మందులు వీరు వాడాలి సిడిఫోర్ కౌంట్ (రోగ నిరోధకశక్తి) 350 కంటే తక్కువగా ఉన్నవారు మందులు వాడాలి. ఏఆర్టీ మందులను వాడటం ఒకసారి ప్రారంభించాక జీవితాంతం వాడాలి. మధ్యలో మానేస్తే రోగ నిరోధక శక్తి క్షీణించి మృత్యువాత పడే అవకాశం ఉంది. హెచ్ఐవి రోగుల వివరాలు జిల్లాలో 13 వేల మంది హెచ్ఐవీ రోగులున్నారు. వీరిలో 10,493 మంది ఏఆర్టీ కేంద్రంలో నమోదవగా 7634 మంది మందులు తీసుకుంటున్నారు. వీరిలో 263 మంది పిల్లలున్నారు. జిల్లాలో 2071 మంది హెచ్ఐవి రోగులు చనిపోగా వారిలో 42 మంది పిల్లలున్నారు. జెడ్‌ఎల్‌ఎన్-60, ఏబీసీ-3టీసీ, ఎన్వీపీ మందులను పిల్లలకు ఏఆర్టీ కేంద్రంలో అందజేస్తారు. ఇందులో హిమోగ్లోబిన్( హెచ్బి) 9గ్రాముల కంటే తక్కువగా ఉన్నవారికి ఎన్వీపీ, ఏబీసీ-3టీసీ మందులు అందజేస్తారు. తొమ్మిది గ్రాములు, అంతకంటే ఎక్కువగా హెచ్‌బీ ఉన్న వారికి జెడ్‌ఎల్‌ఎన్ -60 మందులను అందజేస్తారు. ఈ మందులను 80 మంది పిల్లలు వరకు వాడేవారు. ప్రస్తుతం వీటిలో జెడ్‌ఎల్‌ఎన్ -60 మందుల కొరత ఏర్పడింది. రెండు నెలలుగా ప్రభుత్వం ఈ మందులను సరఫరా చేయలేదు. జెడ్‌ఎల్‌ఎన్-60 మందు సరఫరా కాలేదు. దీంతో ఏఆర్టీ కేంద్రానికి వచ్చిన వారికి ఫోన్ చేసి రమ్మంటున్నాం. నాలుగు, ఐదు రోజుల్లో మందులు వచ్చే అవకాశం ఉంది. -ఆర్.శంకర్రావు, సీనియర్ వైద్యాధికారి -
ఇదో వైద్య విధ్వంసం!
సర్కారీ ఆసుపత్రుల్లో చికిత్సకు దిక్కులేదు.. ప్రైవేటుకెళితే జేబులు గుల్ల ♦ గతేడాది వైద్యానికి భారతీయులు చేసిన ఖర్చు రూ. 6,00,000 కోట్లు ♦ వచ్చే ఏడాది ఖర్చు... 'మెకిన్సే' అంచనా రూ. 10,00,000కోట్లు ♦ ఏటా 30-40 శాతం పెరిగిపోతున్న వైద్య ఖర్చులు ♦ నాలుగేళ్లలో దేశ బడ్జెట్‌నూ దాటొచ్చని అంచనాలు ♦ ఖర్చులతో 30% మంది పేదరికంలోకి.. ♦ ఈ దుస్థితిపై 'సాక్షి' సమర శంఖం సాక్షి ప్రత్యేక బృందం: పాతికేళ్లకే గుండె బరువెక్కుతోంది.. పొత్తిళ్ల నుంచే మధుమేహం ఆక్రమిస్తోంది.. ముప్పై దాటకున్నా రక్తపోటు భయపెడుతోంది.. అరుదైన వ్యాధులు రొటీన్ రంగు పులుముకుంటున్నాయి. కొత్తకొత్త పేర్లతో జబ్బులు పుట్టుకొస్తున్నాయి. సీజనల్ వ్యాధులకైతే అడ్డూఅదుపూ లేదు. ఇవన్నీ కలిస్తే.. భారతీయులు వైద్యానికి పెడుతున్న ఖర్చు ఆకాశాన్నంటుతోంది. ఈ ఖర్చు గతేడాది రూ.6 లక్షల కోట్లు! వచ్చే ఏడాది రూ.10 లక్షల కోట్ల పైమాటే!! మరో నాలుగేళ్లు ఆగితే.. ఏకంగా దేశ బడ్జెట్‌తో పోటీపడుతుందని చెబుతోంది మెకిన్సే సంస్థ. ఎందుకంటే.. ఇప్పుడు రూ.17 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ ఏటా పెరుగుతున్నది లక్ష కోట్ల లోపే. కానీ భారతీయుల వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం వృద్ధితో భారీ అంగలేసుకుంటూ ఆర్థిక వ్యవస్థనే సవాల్ చేసే స్థాయికి చేరిపోతున్నాయి. జీతభత్యాలు, మౌలిక సదుపాయాలతో సహా ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం ఏడాదిలో చేస్తున్న ఖర్చును.. ప్రజలు తమ ఆరోగ్యం కోసం సొంతంగా వెచ్చిస్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.దురదృష్టమేంటంటే ఇలా వైద్యానికి ఖర్చు చేస్తున్న వారిలో ఆరోగ్య బీమా భద్రత ఉన్నది కేవలం 5 శాతం మందికే. మిగిలిన వారంతా అప్పులు చేసి, తాకట్టులు పెట్టి తమను, తమ వాళ్లను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నవారే. అలాంటి వారి జీవితాలను వైద్యం ఎంతలా విధ్వంసం చేస్తోందో తెలుసా...? ప్రభుత్వాసుపత్రికి వెళితే!: నిరుపేదకు సుస్తీ చేసి సర్కారీ ఆసుపత్రికెళితే డాక్టరుండటం కష్టం. ఒకవేళ ఉంటే ఆయన రాసిన చీటీలోని పరీక్షలు చేయడానికి అక్కడి సౌకర్యాలుండవు. పోనీ బయటికెళ్లి చేయించుకుందామంటే తన ఆర్థిక పరిస్థితి ససేమిరా అంటుంది. చేసేదేమీ లేక ఇంటికెళ్లి ముసుగు తన్నటం.. అయినా బాగులేకుంటే మరోసారి అదే దవాఖానాకు పోవటం. ఎందుకంటే తను చేయగలిగింది అదే!! ఇక సదరు ఆసుపత్రిలో అర్థం చేసుకునే డాక్టరు గనక ఉంటే నాలుగు గోళీలు రాస్తాడు. అవి వేసుకున్నాక దైవాధీనం. రోజులు బాగుంటే బతికిపోతాడు. లేకుంటే బతుకు పోతుంది. ఈ పరిస్థితి ఎందుకు దాపురిస్తోందంటే... నిబద్ధత నీడను కూడా సహించని ప్రభుత్వ వైద్యం వల్ల. ఎన్నాళ్లయినా ఈ పరిస్థితి మారదెందుకు? నిరుపేదకు సుస్తీ చేస్తే చావాల్సిందేనా...? మధ్య తరగతి సంగతో..? నిరుపేదలూ, నిరుద్యోగులే కాదు. కాస్తోకూస్తో స్థితిమంతులు, ముందు చూపుతో వైద్య బీమా చేయించుకున్నవారి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కారణం.. నిజాయితీ కరువైన ప్రైవేటు వైద్యం!! కిందపడి చేయి బెణికిందని వెళితే... తక్షణం ప్లేట్లు వేసి సర్జరీ చేయాల్సిందేనంటాడొక పేరున్న ఎముకల డాక్టరు. కంగారుపడి మరో మంచి వైద్యుడి దగ్గరికెళితే... సర్జరీ కాదు కదా కనీసం కట్టు కూడా లేకుండా తగ్గించారాయన. ఇక మరో ఆసుపత్రయితే రోగి చనిపోయినా ఆ విషయం బంధువులకు చెప్పకుండా నాలుగు సర్జరీలు చేసేసింది. కడుపులో కాస్త మంటగా ఉందని వెళ్తే ఎమ్మారైతో సహా అన్ని స్కానింగ్లూ చేయించేస్తున్నాడు మరో వైద్య శిఖామణి. ఇవన్నీ పచ్చి నిజాలు. పరీక్షల నుంచి సర్జరీల వరకూ అడుగడుగునా దండుకోవటం, పిండుకోవటమే పరమార్థంగా మారిన కార్పొరేట్ వైద్యానికి లాభాల లెక్కలు తప్ప మనుషుల వేదన పట్టే పరిస్థితి లేదు. 'మీరు అడిగినంత డబ్బిస్తాం. మాకు అవసరమైన వైద్యం మాత్రమే చేయండి మొర్రో' అని అరిచినా వినిపించుకునే వైద్య నారాయణులు లేరక్కడ. ఎందుకంటే కన్సల్టేషన్, పరీక్షల నుంచి సర్జరీల వరకూ యాజమాన్యాలు పెట్టే టార్గెట్లే వారికి ముఖ్యం. పాడెక్కిన సంప్రదాయ వైద్యం ఎలాంటి ఊళ్లో ఉండాలో చెబుతూ సుమతీ శతకకారుడు 'అప్పిచ్చువాడు..'తర్వాత వైద్యుడికే ప్రాధాన్యం ఇచ్చాడు! ఆయన చెప్పినట్టుగానే పూర్వపు రోజుల్లో ప్రతి ఊళ్లో సంప్రదాయ వైద్యుడు ఉండేవాడు. ధన్వంతరి వేల ఏళ్ల కిందటే ఈ గడ్డపై మూలి కలతో ఔషధాలను తయారు చేశా డు. అష్ట విధ చికిత్సలతో ఆయుర్వేదాన్ని అందించాడు. ఆ పరంపర ఒక తరం నుంచి మరో తరానికి అందేది. ఊరికి ఏ ఆపద వచ్చినా మందు ఇచ్చి బాగుచేసే సంప్రదాయ వైద్యులుండేవారు. తృణమో పణమో.. ఏమీ లేకుంటే ఓ నమస్కారం మాత్రమే స్వీకరించి చిరునవ్వుతో జనం యోగక్షేమాలను వారు జాగ్రత్తగా చూసుకునేవారు. ఆప్యాయంగా పలకరించి సగం జబ్బు తగ్గించేవారు. గాయాలకు గడ్డి చేమంతి, ఉత్తరేణి వంటివి వేసి కట్టుకడితే అవి ఇట్టే మాయమయ్యేవి. జ్వరం, దగ్గు, జలుబు, అజీ ర్ణం.. ఇలా ఏ జబ్బు చేసినా మాత్రలిచ్చి మాన్పేసేవారు. పెద్ద జబ్బులు వస్తే తప్ప ఊరు దాటి పట్నం వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. మరి ఇప్పుడు..? రోజులు మారాయి. పాలకులు సంప్రదాయ వైద్యాన్ని పాడెక్కించారు. ఊళ్లల్లో నాటి వైద్యులు మచ్చుకైనా కన్పించడం లేదు. ఫలితంగా ప్రాణాంతక వ్యాధుల సంగతి అలా ఉంచితే ఏ చిన్న జబ్బు చేసినా ఊళ్లో పరిష్కారం దొరకడం లేదు! తరతరాల నుంచి వస్తున్న వైద్య విధానాలకు తిలోదకాలు ఇచ్చిన ప్రభుత్వాలు.. అంతకు మెరుగైన వైద్యాన్ని అందిస్తే మంచిదే. కానీ పల్లెల్లో సర్కారీ వైద్యం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాధుల సీజన్ వచ్చిందంటే జనం పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకునే నాథుడు ఉండడు. ఆదుకునే ప్రభుత్వాసుపత్రి ఉండదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పడకేశాయి. ఎక్కడ చూసినా వసతుల లేమి.. మందుల కరువు.. వైద్యుల కొరత. ఫలితంగా ఏ జబ్బు చేసినా పట్నం పోవాల్సిందే. కార్పొరేట్ ఆసుపత్రుల తలుపు తట్టాల్సిందే. ఇక అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. కాసుల వేట తప్ప రోగానికి మందు దొరకదు. దొరికినా సామాన్యుడికి అందని దుస్థితి. ఇలా సంప్రదాయ ైవె ద్యానికి చరమగీతం పాడిన ప్రభుత్వాలు.. ప్రజల ఆరోగ్యాన్ని 'కార్పొరేట్' కు తాకట్టు పెట్టాయి. కదులుదాం.. కదిలిద్దాం.. నిత్యావసరాల్లో భాగమైన వైద్యం ఇప్పుడు... నిబద్ధత, నిజాయితీ లోపించి సంక్షోభంలో కూరుకుపోయింది. సంక్షోభాన్ని సైతం దాటిపోతోంది. ఖరీదైన వైద్యం చేయించుకోలేక 30 శాతం మంది మధ్యతరగతి నుంచి పేదరికంలోకి జారిపోతున్నారంటే ఆ తప్పు ఎవరిది? అందుబాటు ధరలో... అవసరమైన చికిత్స చేయని ప్రైవేటు వైద్యానిది కాదా? ఉచితంగా వైద్యసదుపాయం కల్పించ లేని సర్కారీ ఆసుపత్రులది కాదా? అవును! దీనికిపుడు చికిత్స కావాలి. ప్రజల వైద్య ఖర్చులు బడ్జెట్‌కు రెండింతలు కాకముందే ఈ చికిత్స ఎక్కడో ఒకచోట మొదలవ్వాలి. అందుకే ‘సాక్షి’ ఈ బాధ్యతను భుజాన వేసుకుంది. అందులో భాగంగానే వైద్యరంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ.. జరిగిన, జరుగుతున్న సంఘటనలను తెలియజేస్తూ వరుస కథనాలను అందించనుంది. 'సాక్షి' చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరూ కలసి రావాలి. సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి 'సాక్షి'తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘'సాక్షి'కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి. లేఖలు పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 sakshihealth15@gmail.com