తెనాలిలో అంతులేని అవినీతి | Corruption In Tenali District Hospital | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ అవినీతి

Published Sat, Feb 29 2020 9:15 AM | Last Updated on Sat, Feb 29 2020 9:15 AM

Corruption In Tenali District Hospital - Sakshi

వైద్యవిధాన పరిషత్‌ డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఈశ్వర్‌ప్రసాద్‌ను విచారిస్తున్న ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సురేష్‌బాబు

అప్రంటిస్‌షిప్‌ సర్టిఫికెట్ల మంజూరులో గోల్‌మాల్‌. ఒకే ఏజెన్సీ నుంచి కొన్నేళ్లుగా మందుల కొనుగోళ్లు. కిలో మీటరు కూడా కదలని అంబులెన్స్‌ నిర్వహణకు నెలనెలా బిల్లులు. ఆర్థో ఇంప్లాంట్స్‌.. డైరెక్టుగా ఆపరేషన్‌ థియేటర్‌కు సరఫరా. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకున్న రోగులకు అందని డైట్‌.. ఏమైందో తెలియని ఆర్థిక సాయం.. ఇదీ అంతులేని తెనాలి జిల్లా ఆస్పత్రి అవినీతి కథ. అక్కడ అందే వైద్య సేవలకంటే అందులో జరిగిన అవకతవకలే ఎక్కవ. రెండు రోజులుగా జరుగుతున్న ఏసీబీ అధికారులు తనిఖీల్లో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఆస్పత్రి      అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.

సాక్షి, గుంటూరు/తెనాలి అర్బన్‌: అవినీతి ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  గత ఏడాది 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కాల్‌ సెంటర్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతిపై అనేక ఫిర్యాదు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో  ఏసీబీ ఏఎస్పీ అల్లం సురేశ్‌బాబు నేతృత్వంలో మూడు బృందాలుగా తనిఖీలు నిర్వహించాయి. ఇందులో దిమ్మతిరిగే అవినీతి, అక్రమాలు, నకిలీ లీలలు బయటపడ్డాయి. ఏకంగా పది నకిలీ అప్రంటిస్‌షిప్‌ సర్టిఫికెట్ల జారీ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఏడాది పాటు ఆస్పత్రిలో అప్రంటిస్‌షిప్‌ చేసినట్టు గతంలో సూపరింటెండెంట్‌లుగా పనిచేసిన డాక్టర్‌ సులోచన, నాగేశ్వరరావు సంతకంతో సరి్టఫికెట్లు మంజూరు చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేసింది.

ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో  ఏడాది పాటు అప్రెంటిస్‌íÙప్‌ చేసి ఉండాలని నిబంధన విధించింది. ఏఎన్‌ఎం పోస్టులకు సెలక్ట్‌ అయిన వారు నకిలీ సర్టిఫికెట్‌లను వినియోగిస్తున్నారంటూ పారామెడికల్‌ బోర్డు సెక్రటరీ రాసిన లేఖ మేరకు సూపరింటెండెంట్‌ ఇప్పటికే విచారణ చేశారు. అందులో నకిలీ సరి్టఫికెట్లుగానే తేలింది. దీనిని ఏసీబీ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ నకిలీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ సూపరింటెండెంట్‌కు సూచించారు.

2016 నుంచి ఒకరితోనే కొనుగోళ్లు 
2016 సంవత్సరం నుంచి కామాక్షి మెడికల్స్‌ తెనాలి అనే సంస్థ నుంచి మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ను ప్రభుత్వాస్పత్రికి కొనుగోలు చేస్తున్నట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. అదే విధంగా ఆర్థో ఇంప్లాంట్స్‌ను కూడా ఐక్యత ఆర్థో ఇంప్లాంట్స్‌ గుంటూరు, శ్రీ సాయి శ్రీనివాస ఇంప్లాంట్స్‌ విజయవాడ కంపెనీల నుంచే తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థో ఇంప్లాంట్స్‌ను స్టోర్స్‌కు కాకుండా సరాసరి ఆపరేషన్‌ థియేటర్‌కు సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రి నిధు లతో ఏపీఎంఎస్‌ఐడీసీ సప్లై చేయని మందులు, సర్జికల్‌ వస్తులను కొనుగోలు చేయాలంటే  రెండేళ్లకోసారి టెండర్లు నిర్వహించి కలెక్టర్‌ అనుమతి పొందిన వ్యాపారులతోనే ఒప్పదం చేసుకోవాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఆస్పత్రి అధికారుల వ్యవహారశైలి ఉంది.

రూ.38–40వేలు బిల్లులు.. 
కిలో మీటరు కూడా కదల్లేని, కాలం చెల్లిన అంబులెన్స్‌ వాహనానికి నెలకు రూ.38–40 వేల వరకూ డీజిల్, ఇతర మరమ్మతుల పేర్లతో బిల్లులు చేశారు. రెండేళ్లుగా ఈ తరహా పద్ధతి నడుస్తోంది. బిల్లుల మంజూరు కోసం కేసులకు హాజరు కాకపోయినప్పటికీ హాజరవుతున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.4లక్షలకు పైగా అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేసే డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఆస్పత్రి అధికారుల సాయంతో తన సొంత అంబులెన్స్‌ ఉపయోగిస్తూ డిజిల్‌ సొమ్మును వైద్యశాల ఖాతా నుంచి డ్రా చేసుకుంటున్నాడు. అదే విధంగా గుర్తింపులేని అభయ డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌లో వ్యాధి నిరోధక పరీక్షలు నిర్వహించినట్టుగా 2016కు ముందు బిల్లులు డ్రా చేసినట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. ఈ బిల్లులన్నీ నకిలీవేనని తెలుస్తోంది.

‘డైట్‌’ సొమ్ము స్వాహా  
ఆరోగ్య శ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న ఇంపేషెంట్‌లకు రోజు రూ.100 చొప్పున డిశ్చార్జ్‌ అయ్యేంత వరకూ చెల్లించేలా 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు డైట్‌ ఇస్తున్నందున ఆరోగ్య శ్రీ కింద ఇచ్చే డైట్‌ చార్జీలను రోగి డిశ్చార్జీ అయ్యే సమయంలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. అయితే మూడు వేల మంది రోగులకు తెనాలి ఆస్పత్రిలో డైట్‌ చార్జీలు చెల్లించలేదని ఏసీబీ గుర్తించింది. అదే విధంగా వైద్యశాలలో 23 మంది సెక్యూరిటీ గార్డులు ఉండగా వీరిలో 16 మంది మాత్రమే విధులకు వినియోగిస్తున్నారని, మిగిలిన వారిని మేల్‌ నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ఇతర పనులకు వాడుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఫార్మసీ, డైట్‌ బిల్లులను ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. ఫుడ్‌ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. శానిటరీ, లైటింగ్‌ సరిగా లేకపోవడం, సీసీ కెమెరాలు  పనిచేయకపోవడంతో ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో సీఐలు శ్రీధర్, రవిబాబు, గంగరాజు, ఎస్‌ఐ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement